Share News

Let's Go Home! లే చిన్నా.. ఇంటికెళ్దాం!

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:04 AM

Come on, Chinna... Let's Go Home! నిరుపేద కుటుంబం.. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. తండ్రి లేని ఇంటిలో తల్లికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. వయసులో చిన్నవాడైనా కుటుంబ బాధ్యతను తనపై వేసుకున్నాడు. కూలి పనులు చేసుకుంటూ.. చదువునూ కొనసాగించాడు. అయితే కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. మృత్యువు రూపంలో కబళించింది.

 Let's Go Home!  లే చిన్నా.. ఇంటికెళ్దాం!
సవర చలపతి (ఫైల్‌)

  • ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థి మృతి

  • కన్నీరు మున్నీరుగా విలపించిన కుటుంబ సభ్యులు

సీతంపేట రూరల్‌,మార్చి 28(ఆంధ్రజ్యోతి): నిరుపేద కుటుంబం.. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. తండ్రి లేని ఇంటిలో తల్లికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. వయసులో చిన్నవాడైనా కుటుంబ బాధ్యతను తనపై వేసుకున్నాడు. కూలి పనులు చేసుకుంటూ.. చదువునూ కొనసాగించాడు. అయితే కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. మృత్యువు రూపంలో కబళించింది. రెండు నెలల తర్వాత ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. బిడ్డ బాగా చదువుకొని తనను పోషిస్తాడని ఆశించిన ఆ తల్లికి కడుపుకోతే మిగిలింది. వివరాల్లోకి వెళ్తే..

కొత్తగూడ పంచాయతీ కె.కాగుమానుగూడకు చెందిన సవర చలపతి(14) సీతంపేట ఐటీడీఏ పరిధి దోనుబాయి గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా రెండు నెలలుగా చదువుకు దూరమైన ఆ విద్యార్థి గురువారం సాయంత్రమే పాఠశాలకు చేరాడు. కాగా శుక్రవారం ఉదయం హాస్టల్‌ గదిలో తాను పడుకుంటున్న బంకర్‌ బెడ్‌ పైకి తువ్వాలు కట్టి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే ఇంతలో బెడ్‌ ఒక్కసారిగా ఒరిగి చలపతిపై పడింది. బలమైన గాయం కావడంతో అపస్మారక స్థితికి చేరాడు. దీన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది, తోటి విద్యార్థులు చలపతిని సమీపంలోని దోను బాయి పీహెచ్‌సీకి తరలించారు. వైద్యాధికారి భానుప్రతాప్‌ చికిత్స అందిస్తుండగానే విద్యార్థి మరణించాడు. పాఠశాల సిబ్బంది నుంచి సమాచారం తెలుసుకున్న తల్లి లడ్డమ్మ, కుటుంబసభ్యులు, కె.కాగుమానుగూడ గ్రామస్థులు హుటాహుటిన దోనుబాయి ఆసుపత్రికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న చలపతిని చూసి తల్లి లడ్డమ్మ షాక్‌కు గురైంది. మృతదేహంపై పడి భోరున విలపించిన తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది.

నిరుపేద కుటుంబం

కె.కాగుమానుగూడకు చెందిన సవర భీముడు, లడ్డమ్మకు ముగ్గురు కుమారులు. భీముడు మూడేళ్ల కిందట మృతి చెందాడు. కుమారులైన సవర గణేష్‌, ప్రసాద్‌, చలపతిలతో కలిసి లడ్డమ్మ అదే గ్రామంలో నివసిస్తోంది. మృతి చెందిన విద్యార్థి అందరికంటే చిన్నవాడు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో రెండు నెలలు పాటు చలపతి తల్లికి అండగా ఉంటూ కూలీ పనుల కోసం వెళ్లినట్లు గ్రామస్థులు తెలిపారు.

న్యాయం చేస్తాం

ప్రమాదవశాత్తు మృతి చెందిన గిరిజన విద్యార్థి సవర చలపతి కుటుంబానికి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఈ సమాచారం తెలుసుకున్న ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో ఏపీవో జి.చిన్నబాబు, డీడీ అన్నదొరలు దోనుబాయి ఆశ్రమ పాఠశాలకు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అయితే అప్పటికే విద్యార్థి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆందోళన చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో యశ్వంత్‌కుమార్‌రెడ్డి దోనుబాయి ఆశ్రమ పాఠశాలకు చేరుకొని తోటి విద్యార్థులతో మాట్లాడారు. ప్రమాదం ఎలా జరిగిందో ఆరా తీశారు. ఆందోళన చేస్తున్న కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. చలపతి దహన సంస్కారాల నిమిత్తం తల్లి లడ్డమ్మకు అధికారులు రూ. 10 వేలు అందజేశారు. మరోవైపు దోనుబాయి గిరిజనసంక్షేమ ఆశ్రమ పాఠశాల వార్డెన్‌ సుబ్బారావుకు మెమో జారీ చేశారు. పాలకొండ డీఎస్పీ రాంబాబు, ీఐ చంద్రమౌళిలు దోనుబాయి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. మృతుని తల్లి లడ్డమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దోనుబాయి ఎస్‌ఐ మస్తాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:04 AM