Share News

happy poormens గృహానందం

ABN , Publish Date - Mar 24 , 2025 | 12:01 AM

happy for finance help ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపేసిన పేదలకు గృహయోగం పట్టనుంది. సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. నానాటికీ శిథిలమయ్యే ప్రమాదం ఉంది.

happy poormens గృహానందం
అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లు

గృహానందం

పేదల ఇళ్లకు సాయం

15,226 ఇళ్ల నిర్మాణదారులకు ఉపయోగం

ఎస్‌సీ, బీసీలకు రూ.50 వేలు

ఎస్టీలకు రూ.75 వేలు

పీటీజీలకు రూ.లక్ష

ప్రకటించిన ప్రభుత్వం

ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపేసిన పేదలకు గృహయోగం పట్టనుంది. సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సాయం ప్రకటించింది. వివిధ కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఇళ్లు అసంపూర్తిగా నిలిచిపోయి ఉన్నాయి. అవన్నీ ఉపయోగం లేకుండా పడి ఉన్నాయి. నానాటికీ శిథిలమయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం వాటిని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తోంది. అదనపు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని పేదలు స్వాగతిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 15,226 ఇళ్లు మధ్యలో నిలిచిపోయినట్లు అధికారులు గుర్తించారు.

విజయనగరం, మార్చి23 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మధ్యలో నిలిచిపోయిన ఇళ్లు అత్యధికంగా గత ప్రభుత్వం లోనివే. ప్రభుత్వ సాయం సరిపడక.. ముడి సామగ్రి ధరలు, ఇసుక ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ పూర్తి చేయలేక వదిలేశారు. వాటికి నేడు మోక్షం కలగనుంది. గతంలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన అర్బన్‌, గ్రామీణ పథకాల కింద ఇళ్లు మంజూరయ్యాయి. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.లక్షా 80 వేలు ఆర్థిక సాయం అందింది. ఈ సాయంతో ఇంటినిర్మాణం పూర్తికాకపోవడంతో జిల్లాలో 15,226 ఇళ్ల నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇళ్ల లబ్ధిదారుల్లో బీసీలకు, ఎస్‌సీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు, ఆదివాసీ, గిరిజన తెగలకు రూ.లక్ష సాయాన్ని తాజాగా ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లు మంజూరై 2024 డిసెంబరు 10 నాటికి మధ్యలో ఆగిన ఇళ్లకు మాత్రమే ఈ అదనపు సాయం వర్తిస్తుంది.

పూర్తికాని ఇళ్లకు సంబంధిత సచివాలయ సిబ్బంది లేదా ఇంజనీరింగు సహాయకులు ఫొటోలు తీసి వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో సుమారు 15,226 మందికి లబ్ధి చేకూరనుంది. వీరిలో ఎస్‌సీలు 2,231, ఎస్టీలు 565, బీసీలు 12,240, ఆదివాసీ గిరిజన తెగలు 190 మంది ఉన్నారు. వచ్చే రెండు నెలల్లోనే ఇంటి నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది.

సంఖ్య కేటగిరీ పీవీటీజీఎస్‌ ఎస్టీ ఎస్సీ బీసీ మొత్తం

-------------------------------------------------------------------------------------------------

1. బీఎల్‌సీ అర్బన్‌ 0 564 2,162 12,097 14,823

2. గ్రామీణం 0 1 69 143 213

3. పీఎం-జన్మన్‌ 190 0 0 0 190

--------------------------------------------------------------------------------------------------

190 565 2,231 12,240 15,226

-------------------------------------------------------------------------------------------------

సద్వినియోగం చేసుకోవాలి

కలెక్టర్‌ అంబేడ్కర్‌

ప్రభుత్వం అందిస్తున్న అదనపు సాయాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణానికి ఇది అనుకూలమైన సమయం. అదనంగా ఆర్థిక సాయం చేయడమే కాకుండా, ఇసుకను కూడా ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి.

ఇంటి నిర్మాణం పూర్తిచేస్తాం

పతివాడ పైడితల్లి, గొడ్డుపాలెం, డెంకాడ మండలం

గత ప్రభుత్వ హయాంలో ఇల్లు మంజూరైంది కానీ రూ.లక్ష 80 వేలు సరిపోక నిర్మాణాన్ని మధ్యలో ఆపేశాను. ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న సాయంతో రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు.

చాలా ఆనందంగా ఉంది

పతివాడ రమణమ్మ, గొడ్డుపాలెం, డెంకాడ మండలం

ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం ఇంటికోసం ఇచ్చిన డబ్బులు ఏ మూలకు సరిపోలేదు. ఇప్పుడు మరో రూ.50 వేలు వస్తుండడంతో వచ్చే రెండు నెలల్లో ఇంటి నిర్మాణం పూర్తి చేస్తాం.

==========

ముఖ్యమంత్రికి ధన్యవాదాలు

దుప్పాక మంగమ్మ, భోగాపురం

చాలా సంతోషంగా ఉంది. మా లాంటి పేదల కష్టాలు తెలుసుకుని ఇంటి నిర్మాణం పూర్తి చేయడానికి అదనంగా డబ్బులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు. ఈ డబ్బులు వినియోగించి రెండు నెలల్లో ఇంటిని పూర్తి చేసుకుంటాం.

Updated Date - Mar 24 , 2025 | 12:01 AM