వేసవి అలవెన్స్ లేనట్టేనా?
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:16 AM
జిల్లాలో ఉపాధి హామీ వేతనదారులకు వేసవి అలవెన్స్ ప్రశ్నార్థకంగా మారింది. ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల కాకపోవడమే ఇందుకు కారణం.

కొమరాడ, మార్చి 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉపాధి హామీ వేతనదారులకు వేసవి అలవెన్స్ ప్రశ్నార్థకంగా మారింది. ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల కాకపోవ డమే ఇందుకు కారణం. వాస్తవంగా ఏటా జనవరిలోనే అలవెన్స్‌ను ప్రకటించేవారు. కానీ ఈ సారి మార్చి వచ్చినా ఇంతవరకు ఆ ఊసే లేదు. మరోవైపు వేసవి ప్రారంభం లోనే ఎండలు మండుతున్నాయి. పగతి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిన నేపథ్యంలో వేతనదారులు పని ప్రదేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఉపాధి కూలీలకు కనీస వేతనం 300కు తగ్గకుండా చూడాలని కేంద్రం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే అందులోనే వేసవి అలవెన్స్ ఉంటుందని పలువురు చెబుతున్నారు. మరోవైపు మార్చి నెల పూర్తి కావస్తుంది. దీంతో ఈ ఏడాది ఉపాధి వేతన దారులకు వేసవి అలవెన్స్ లేనట్లేనని కొంతమంది అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కూలీలకు వేసవిలో రూ. 300 వేతనం కచ్చితంగా గిట్టుబాటయ్యేనా అనే సందేహాన్ని పలువురు వ్యక్తపరుస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ఫ జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 2.10 లక్షల కుటుంబాలకు జాబ్‌కార్డులు ఉన్నాయి. వాటిల్లో 3.98 లక్షల మంది ఉపాధి పనులకు వెళ్తున్నారు. వేసవిలో ఉపాధి పను లు చేయడం కష్టంగా ఉంటుందని భావించిన ప్రభుత్వాలు గతంలో ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రి ల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం వరకు పను ల పరిమాణం తగ్గించి 100 శాతం పనికి వేతనం అంది ంచేవారు. అంటే వేసవిలో నేల గట్టిగా ఉండటంతో పని తక్కువగా జరిగినా వేసవి అలవెన్సుతో కలిపి వేతనం ఇచ్చే వారు. దీంతో వేతనదారులకు కూలి గిట్టుబాటు అయ్యేది.
-ఉపాధి హామీ పథకం ద్వారా ప్రస్తుతం జిల్లాలో చెరువుల్లో పూడిక తీత, నీటి కుంటలు, కందకాల తవ్వకం వంటి పనులు చేపడుతున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో మొక్కలు పెంపకం వంటి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నా రు. మరో పది రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్ నుంచి మరిన్ని పని దినాలు కల్పించే అవకాశం ఉంది. 50 మంది కూలీలను పనులకు తీసుకొచ్చే ప్రతి మేట్‌కు రూపాయిన్నర వంతున అదనపు వేతనం అందిస్తారు. కాగా కూలీలకు వేసవి అలవెన్స్ విషయమై కొమరాడ ఏపీవో బాలకృష్ణను వివరణ కోరగా ఇప్పటివరకు ఎటువంటి ఉత్తర్వులు రాలేదన్నారు. ఆదేశాలు వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పారు.