Share News

పాలకొండ ఏరియా ఆసుపత్రికి మహర్దశ

ABN , Publish Date - Mar 27 , 2025 | 11:09 PM

పాలకొండ ఏరియా ఆసుపత్రికి మహర్దశ పట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌కు ఎంపికైంది. ఈ పథకం కింద ఆస్పత్రి అభివృద్ధికి రూ.23.75 కోట్లు కేంద్రం కేటాయించనుంది.

పాలకొండ ఏరియా ఆసుపత్రికి మహర్దశ
పాలకొండ ఏరియా ఆసుప త్రి

పీఎం ‘ఆయుష్మాన్‌ భారత్‌’కు ఎంపిక

  • రూ.23.75 కోట్లు కేటాయింపు

  • ఏర్పాటుకానున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాకు

  • 50 బెడ్లు, ఐసీయూ విభాగం కూడా..

పాలకొండ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): పాలకొండ ఏరియా ఆసుపత్రికి మహర్దశ పట్టింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌కు ఎంపికైంది. ఈ పథకం కింద ఆస్పత్రి అభివృద్ధికి రూ.23.75 కోట్లు కేంద్రం కేటాయించనుంది. ఈ నిధులతో ఆస్పత్రిలో 50 బెడ్లు, అత్యాధునిక క్రిటికేల్‌ కేర్‌, ఐసీయూ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు ఆస్పత్రులకు క్రిటికల్‌ కేర్‌ బ్లాకులను మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్న పాలకొండ ఏరియా ఆసుపత్రిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాకు ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిద్వారా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులతో పాటు మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో కూడిన వైద్య సేవలు అందనున్నాయి. అందుకోసం ఒక్కో యూనిట్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.23.75 కోట్లతో భవనాలు నిర్మించనుంది. దీనిలో 50 బెడ్లు, అత్యాధునిక క్రిటికేల్‌ కేర్‌, ఐసీయూ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అందించేలా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పుడు క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ఏర్పాటుతో మరిన్ని అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.


ఆసుపత్రి ప్రాంగణంలోనే నూతన భవనం..

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న రూ.23.75 కోట్లతో ఆసుపత్రి ప్రాంగణంలోనే అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించేందుకు వైద్యవిధాన పరిషత్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వైద్య సిబ్బంది పాత క్వార్టర్స్‌ను తొలగించి, వాటి స్థానంలో ఈ నూతన భవనం నిర్మించేందుకు పరిశీలన చేస్తున్నారు. నిధులు మంజూరైన వెంటనే పనులు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన నమూనా ఇంజనీరింగ్‌ విభాగం అధికారులకు అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ గొర్లె నాగభూషణరావు మాట్లాడుతూ.. పీఎం ఆయుష్మాన్‌భారత్‌ పథకంలో భాగంగా ఏరియా ఆసుపత్రిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయని, త్వరలో భవన నిర్మాణం చేపట్టేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసిందని అన్నారు. ఇదిలావుండగా, కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పాలకొండ ఏరియా ఆసుపత్రిలో పది బెడ్ల ఐసీయూ యూనిట్‌ను అందుబాటులోకి తెచ్చింది. కరోనా తర్వాత సిబ్బంది కొరతతో ఐసీయూని ఉపయోగించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్రిటికేల్‌ యూనిట్‌ ఏ విధంగా సేవలు అందిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Mar 27 , 2025 | 11:09 PM