Share News

అంతలోనే అమ్మకు దూరంగా..

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:53 PM

Meanwhile, away from mom అంతవరకూ అమ్మతోనే మాట్లాడింది. జోకులు వేస్తూ నవ్వించింది. తన స్నేహితుల యోగక్షేమాలు.. కబుర్లు చెప్పింది. ఇంటర్‌ పరీక్షలు బాగా రాసినట్లు తెలిపింది. తల్లీకూతుళ్ల ఆత్మీయానురాగాలు చూసిన విధికే కన్ను కుట్టిందేమో ఉన్నఫలంగా పాముకాటు రూపంలో వారిని విడదీసింది.

అంతలోనే అమ్మకు దూరంగా..
మౌనిక (ఫైల్‌), మృతదేహం వద్ద విలపిస్తున్న స్నేహితులు

అంతలోనే అమ్మకు దూరంగా..

మాట్లాడుతుండగానే విద్యార్థినిని కాటేసిన పాము

ఆస్పత్రికి తరలించినా దక్కని ప్రాణం

బూర్లెపేటలో విషాదం

అంతవరకూ అమ్మతోనే మాట్లాడింది. జోకులు వేస్తూ నవ్వించింది. తన స్నేహితుల యోగక్షేమాలు.. కబుర్లు చెప్పింది. ఇంటర్‌ పరీక్షలు బాగా రాసినట్లు తెలిపింది. తల్లీకూతుళ్ల ఆత్మీయానురాగాలు చూసిన విధికే కన్ను కుట్టిందేమో ఉన్నఫలంగా పాముకాటు రూపంలో వారిని విడదీసింది. వరండా అరుగుపై అమ్మ చెంతనే కూర్చొన్న కుమార్తెను పాము కాటేసింది. బూర్లెపేటలో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నిమిషాల్లో ఆస్పత్రికి తరలించినా ఆమె ప్రాణం దక్కలేదు. అంతవరకు ఎన్నో మాటలాడిన కుమార్తె మౌనిక(16) అంతలోనే అచేతనంగా మారడాన్ని పాపం ఆ తల్లి తట్టుకోలేకపోయింది. గుండెలు పగిలేలా విలపించింది.

గుర్ల, మార్చి 19(ఆంధ్రజ్యోతి):

బూర్లెపేట గ్రామానికి చెందిన ద్వారపూడి మౌనిక (16) ఇటీవలే ఇంటర్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసింది. మొన్నటివరకూ పుస్తకమే లోకంగా ఉన్న ఆమె పరీక్షలు పూర్తికావడంతో వివిధ పనుల్లో అమ్మకు సహకారం అందిస్తోంది. రోజులాగే మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి పనులన్నీ పూర్తిచేసుకుని తల్లి లక్ష్మీ పక్కనే ఇంటి వరండా అరుగుపై కూర్చొంది. చాలాసేపు వారిద్దరు మాట్లాడుకున్నారు. వీధిలో అటుగా వచ్చేవారిని పలకరించారు. ఇంట్లోకి వెళ్లిపోదామని అనుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా కాళ్ల వద్దే మాటు వేసిన పాము మౌనికను కాటేసింది. వెంటనే ఆమె గమనించి తల్లికి చెప్పింది. ఇద్దరూ కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి సమీపంలో ఉన్న తెట్టంగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ దుర్ఘటనను తల్లి జీర్ణించుకోలేకపోయింది. కుమార్తె మృతదేహం వద్ద భోరున విలపించింది.

- బూర్లెపేట గ్రామానికి చెందిన లక్ష్మీ, రాములుకు కుమార్తె మౌనిక, కుమారుడు భాస్కరరావు ఉన్నారు. మౌనిక పదో తరగతి కస్తూర్బాగాంధీ గురుకుల పాఠశాలలో చదువుతున్నప్పుడు టాపర్‌గా నిలిచింది. ఇంటర్‌ నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేరింది. రెండు నెలల క్రితమే అన్నయ్యకు వివాహమైంది. సంతోషంగా ఉన్న సమయంలో ఆ కుటుంబాన్ని విధి దుఃఖసాగరంలోకి నెట్టింది. కూలీ పనులు చేసుకుంటూ కుమార్తెను చదివిస్తున్నానని, ఇటీవలే తన కుమారుని పెళ్లి చేసి తాపీ పనుల కోసం విశాఖలో ఉంటున్నానని తండ్రి రాములు కన్నీటి పర్యంతమయ్యాడు. మౌనిక మృతిగురించి తెలుసుకు న్న స్నేహితులంతా వచ్చి తీవ్రంగా విలపించారు.

Updated Date - Mar 19 , 2025 | 11:53 PM