Attempted murder: సోదరుడి స్నేహితుడే నిందితుడు
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:21 AM
Attempted murder:గరివిడి మండలం శివారం గ్రామంలో కోండ్రు అఖిల అనే యువతిపై శనివారం జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు.

- అఖిలపై హత్యాయత్నం కేసును ఛేదించిన పోలీసులు
- యువకుడి అరెస్టు
విజయనగరం క్రైం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): గరివిడి మండలం శివారం గ్రామంలో కోండ్రు అఖిల అనే యువతిపై శనివారం జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. అఖిల సోదరుడి స్నేహితుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన వ్యవహారాన్ని గ్రామస్థులకు చెబుతుందని అదే గ్రామానికి చెందిన బురిడి ఆదినారాయణ అనే యువకుడు అఖిలను కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. అఖిల సోదరుడికి ఆదినారాయణ స్నేహితుడు. దీంతో ఆదినారాయణ తరచూ అఖిల ఇంటికి వెళ్తుండేవాడు. ఆమెను చెల్లిగా పిలిచేవాడు. ఇటీవల అఖిల తరచూ ఎవరితో ఫోన్లో మాట్లాడుతుండడంతో ఆదినారాయణ అనుమానం పెంచుకున్నాడు. అలాగే ఆదినారాయణ విజయవాడలో ఉంటున్న ఒక మహిళకు అసభ్యకరమైన సందేశాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంపినట్టుగా అఖిలకు తెలిసింది. తన వ్యవహారాన్ని అఖిల గ్రామస్థులకు చెబుతున్నట్లు ఆదినారాయణ భావించాడు. ఈ విషయంలో ఆమెను చంపేస్తానని గతంలో అఖిలను బెదిరించాడు. ఈ నేపథ్యంలో శనివారం ఆమె ఇంటికి వెళ్లి దాక్కున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంకీక్యాప్ ధరించి అఖిలను చంపేందుకు కత్తితో దాడి చేశాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ సమయంలో సంఘటనా స్థలం వద్ద ఆదినారాయణకు చెందిన బ్లూటూత్, ఈయర్‌బడ్స్ పడిపోగా, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలి చెప్పిన ఆధారాలతో కొద్ది గంటల్లోనే ఆదినారాయణను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. కేసును చాకచక్యంగా చేధించిన చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, ఇన్‌చార్జి సీఐ ఉపేంద్ర, గరివిడి ఎస్‌ఐ లోకేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఆనందరావు, హరిను ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సమావేశంలో ఎస్‌బీ ఎస్‌ఐ కేకే నాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.