Bobbili Municipality: ఉత్కంఠ
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:19 AM
Bobbili Municipality: బొబ్బిలి మునిసిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుకు సంబంధించి అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది.

- బొబ్బిలి మునిసిపాల్టీలో క్యాంపు శిబిరాలు
- కౌన్సిలర్లు చేజారిపోకుండా పార్టీల వ్యూహాలు
- అసమ్మతి శిబిరానికి మళ్లీ తిరిగి వచ్చిన మహిళా కౌన్సిలర్
బొబ్బిలి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మునిసిపల్ చైర్మన్ సావు వెంకటమురళీకృష్ణారావుకు సంబంధించి అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ నేడో, రేపో ఫారమ్-2 నోటీసును జారీ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈలోగా అనేక రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు తెరమీదకి వస్తున్నాయి. చైర్మన్‌పై అసమ్మతిని తెలియజేస్తూ పదిమంది వైసీపీ కౌన్సిలర్లు కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయం తెలిసిందే. ఆ పదిమంది ఓ రహస్య శిబిరంలో ఉన్నారు. వారిలో ఓ మహిళా కౌన్సిలర్ తన ఇంటికి వచ్చేయడంతో అసమ్మతి కౌన్సిలర్ల శిబిరంతో పాటు టీడీపీ శిబిరంలోనూ కాసింత కలవరం మొదలైంది. యుద్ధప్రాతిపదికన పావులు కదిపారు. అధినాయకుల ఆదేశాలతో సంప్రదింపులు జరిపారు. దీంతో మహిళా కౌన్సిలర్ మళ్లీ అసమ్మతి వైసీపీ కౌన్సిలర్ల రహస్య శిబిరంలో చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజా పరిణామంతో తొలుత సంబరపడిన వైసీపీ శిబిరం తమ వంతు వ్యూహాలకు పదును పెట్టింది. తమ వర్గంలో ప్రస్తుతం ఉన్న పదిమందిని కాపాడుకుంటూనే మరికొంతమంది అసమ్మతి కౌన్సిలర్లను తమ వైపు తీసుకొచ్చేందుకు అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీనిని సమర్థవంతంగా తిప్పికొటేందుకు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమాత్రం తీసిపోని రీతిలో ప్రతివ్యూహాలతో సన్నద్ధమయ్యారు. ఇందులో కొంతమేర సానుకూల ఫలితాలను సాధించినట్లు పార్టీ శ్రేణులు సంబరపడుతున్నాయి. ఫారమ్-2 నోటీసు విడుదలయ్యే వరకు రెండు రాజకీయ శిబిరాలు చాలా ఉత్కంఠగా కాలాన్ని వెల్లబుచ్చకతప్పదు. ఇదే అదనుగా కొంతమంది కౌన్సిలర్లు భారీ మొత్తంలో బహుమతులను డిమాండ్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.