Share News

Once Again మరోసారి..

ABN , Publish Date - Mar 19 , 2025 | 11:31 PM

Once Again పార్వతీపురం ప్రధాన మార్కెట్‌తో పాటు తోపుడు బళ్లు ఇతర ఆశీలు వసూళ్లకు సంబంధించి జరిగిన బహిరంగ వేలం పాట మరోసారి వాయిదా పడింది. మున్సిపల్‌ కమిషనర్‌, పాటదారుడు మధ్య జరిగిన వాగ్వాదమే ఇందుకు కారణం.

Once Again మరోసారి..
బహిరంగ వేలంలో మాట్లాడుతున్న కమిషనర్‌ వెంకటేశ్వర్లు

  • మున్సిపల్‌ కమిషనర్‌, పాటదారుడి మధ్య వాగ్వాదం

పార్వతీపురం టౌన్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ప్రధాన మార్కెట్‌తో పాటు తోపుడు బళ్లు ఇతర ఆశీలు వసూళ్లకు సంబంధించి జరిగిన బహిరంగ వేలం పాట మరోసారి వాయిదా పడింది. మున్సిపల్‌ కమిషనర్‌, పాటదారుడు మధ్య జరిగిన వాగ్వాదమే ఇందుకు కారణం. ఈ విషయాన్ని పాలకవర్గం దృష్టికి అధికారులు తీసుకెళ్లనుండగా.. మూడో సారి కూడా ఆశీలు పాట వాయిదా పడుతుందా లేదా అధికారులు నిర్ణయించిన ధరకు వేలం పాడిన వారికి ఆశీలు వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో బుధవారం కమిషనర్‌ సీహెచ్‌. వెంకటేశ్వర్లు సమక్షంలో 2025-26 సంబంధించి ప్రధాన మార్కెట్‌ ఆశీలు వసూళ్లకు బహిరంగ వేలం నిర్వహించారు. సర్కారు పాట రూ.16.60 లక్షలుగా రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. దాసరి ప్రసాదరావు అనే పాటదారుడు రూ.16.61 లక్షలకు పాట పడారు. అయితే బుడితి శ్రీనివాసరావు అనే పాటదారుడు బహిరంగ వేలంలో తాను పాల్గొనడానికి రాలేదనడంతో మున్సిపల్‌ కమిషనర్‌తో పాటు రెవిన్యూ అధికారులు షాక్‌ అయ్యారు. ఆశీలు వసూళ్ల ప్రక్రియను తప్పుదోవ పట్టిస్తున్నారని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. నిబంధనల మేరకు సాల్వెన్స్‌ చెల్లిస్తేనే ఆశీలు వివరాలు చెబుతామని రెవెన్యూ అధికారి రూబేను చెప్పారన్నారు. ఆశీలు పాటలో తాము పాల్గొనలేమంటే అధికారులు తమపై ఒత్తిడి తేవడం సరికాదన్నారు. కరోనా కాలంతో పాటు 2024-25లో ఆశీలు వసూళ్లకు సంబంధించి తమకు బాగా నష్టం వాటిల్లినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. కమిషనర్‌ స్పందిస్తూ పాటదారునిగా వ్యవహరశైలి బాగోలేదనడంతో వారిద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది. బహిరంగ వేలానికి వచ్చి అధికారులను దూషించి, దూర్భాషలాడితే ఊరుకొనేది లేదని కమిషనర్‌ హెచ్చరించారు. ఇలాయితే వచ్చే పోలీసు బందోబస్తు మధ్య వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లను వివరణ కోరగా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆశీలు బహిరంగ వేలంతో పాటు పారిశుధ్య నిర్వహణ, కార్మికుల చార్జీలు, జీఎస్‌టీ విధింపుపై పాటదారుడు బుడితి శ్రీనివాసరావు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని మున్సిపల్‌ పాలకవర్గం దృష్టిలో పెడతామన్నారు. వారి నిర్ణయంతో పాటు మున్సిపల్‌ చట్టప్రకారం నడుచుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Mar 19 , 2025 | 11:31 PM