రిజర్వేషన్లపై పునరాలోచించాలి
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:25 AM
ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెల్లి కులస్థులకు ఒక శాతం రిజర్వేషన్ కేటాయింపుపై పునరాలోచన చేయాలని రెల్లికుల రాష్ట్ర అభివృద్ధి సం ఘం సభ్యులు కోరారు.

పాలకొండ, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెల్లి కులస్థులకు ఒక శాతం రిజర్వేషన్ కేటాయింపుపై పునరాలోచన చేయాలని రెల్లికుల రాష్ట్ర అభివృద్ధి సం ఘం సభ్యులు కోరారు. ఈ మేరకు పట్టణంలోని అంబే డ్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఆందోళన చేశారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ వర్గీకరణలో రెల్లి, వాటి ఉపకులా లకు జనాభా ప్రాతిపదికన కాకుండా ఆర్థిక, సాంఘిక, విద్య, వెనుకుబాటుతనం ఆధారంగా ఎస్సీ-ఏగా గుర్తిం చి రెండు శాతం నుంచి ఐదు శాతం రిజర్వేషన్‌ను కేటాయించాలని కోరారు. విద్య, ఉద్యోగ ఆర్థిక విషయాలలో రెల్లి, వాటి ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కుల గణన తర్వాతే వర్గీకరణ చేయాలి
జియ్యమ్మవలస, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సీల్లో వర్గీకరణ అనేది కుల గణన జరిగిన తర్వాతే చేయాలని రాష్ట్ర రెల్లి కులాల జేఏసీ అధ్యక్షుడు గండి విజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన చినమేరంగి గ్రామానికి వచ్చి రెల్లి కులస్థులతో మాట్లాడారు. ఎస్సీ కులాలన్నీ ఒకటేనని, ఇందులో విభజన చేసి తమలో తారతమ్యం తీసుకురావద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాను యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్ కల్పించాలన్నారు. నాలుగు లక్షల జనాభా ఉన్న బేడ, బుడగ జంగం కులాలను ఎస్సీ బీలో గానీ, ఎస్సీ సిలో గానీ కలపాలన్నారు. తర్వాత ప్రధాన రహదారిపై నిరసన తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి కులస్థుల మన్యం జిల్లా కన్వీనర్ వెలగాడ గురువులు, పైడి కులాల రాష్ట్ర అధ్యక్షులు కోట సుందర్ సుదర్శన్, అధిక సంఖ్యలో రెల్లి కులస్థులు పాల్గొన్నారు.