Share News

Survey delay సర్వే ఆలస్యం

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:59 PM

Survey delay ‘‘మీ ఇంట్లో ఎంతమంది వున్నారు.. ఎంతవరకు చదువుకున్నారు.. రాష్ట్రం బయటకు వలస వెళ్లారా.. వ్యవసాయ భూమి ఉందా.. ప్రభుత్వ, సామాజిక పెన్సన్‌ పొందుతున్నారా.. సొంత ఇల్లా.. వాహనం ఉందా..’’ పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన సర్వే.లో అడుగుతున్న ప్రశ్నలివి.

Survey delay సర్వే ఆలస్యం
వివరాలు సేకరిస్తున్న సచివాలయ ఉద్యోగులు(ఫైల్‌)

సర్వే ఆలస్యం

గడువులోగా పూర్తికావడం కష్టమే

పేదరిక రహిత సమాజం కోసం సర్వే తలపెట్టిన ప్రభుత్వం

ఇంటింటికీ వెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు

సందేహాలతో ముందుకురాని ప్రజలు

‘‘మీ ఇంట్లో ఎంతమంది వున్నారు.. ఎంతవరకు చదువుకున్నారు.. రాష్ట్రం బయటకు వలస వెళ్లారా.. వ్యవసాయ భూమి ఉందా.. ప్రభుత్వ, సామాజిక పెన్సన్‌ పొందుతున్నారా.. సొంత ఇల్లా.. వాహనం ఉందా..’’ పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించేందుకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన సర్వే.లో అడుగుతున్న ప్రశ్నలివి. పేదరిక రహిత సమాజం కోసం పీ-4 విధానం అమలు చేయాలని భావించిన ప్రభుత్వం ముందుగా సర్వేకు ఆదేశించింది. అయితే అందులో అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి చాలా మంది ముందుకు రావడం లేదు. దీనివల్ల సర్వే ఆలస్యమవుతోంది.

శృంగవరపుకోట, మార్చి 18(ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వం, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరిక రహిత సమాజం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ-4 విధానం తీసుకొస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ముందుగా సర్వే తలపెట్టారు. సర్వే ద్వారా ఎంపిక చేసిన పేద కుటుంబాలను ఆర్థికంగా పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. తద్వారా పేదరికం లేని సమాజం స్థాపించాలనేది సీఎం ఆలోచన. జిల్లాలో 5,20,900 కుటుంబాలు ఉన్నాయి. ప్రజల స్థితిగతులపై గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం సూచించిన 27 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తున్నారు. సర్వే దాదాపు పూర్తికావొచ్చిందంటున్నారు. కానీ ఇంతవరకు మూడు లక్షల కుటుంబాల లోపే సర్వే జరిగినట్లు తెలుస్తోంది. సర్వేలో అడుగుతున్న వివరాలు చెప్పేందుకు కొంత మంది ముందుకు రావడం లేదు.

- సర్వే ద్వారా గుర్తించిన వివరాల ఆధారంగా ఎక్కడ ప్రభుత్వ పథకాలను రద్దు చేస్తారోనన్న భయం వారిని వెంటాడుతోంది. పలు కుటుంబాలకు కార్లు, టాక్టర్లు, భూములు ఉన్నాయి. ఇలాంటి వారు రేషన్‌ కార్డులను విడదీసేయడం ద్వారా సంక్షేమ పథకాలను పొందుతున్నారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు సర్వే సమయంలో అడుగుతున్న పశ్నలకు సమాధానం రాబట్టడంతో పాటు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసిన తరువాత కుటుంబ సభ్యుల బయోమెట్రిక్‌ను తీసుకుంటున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా తీసుకుంటున్న సంతకం వల్ల సంక్షేమ పథకాలను తీసేస్తారన్న అపోహ నెలకొంది. ఈ కారణంతో చాలా మంది సర్వేకు సహకరించడం లేదు. ఓటీపీలు చెప్పడం లేదు. దీంతో సర్వే వేగంగా జరగడం లేదు. సర్వేకు సంక్షేమ పథకాలతో ఎటువంటి సంబంధం లేదని చెప్పేందుకు సచివాలయ ఉద్యోగులకు తలప్రాణం తోకకు వస్తోంది.

- సర్వే పూర్తి చేసిన తరువాత గ్రామ సభలు నిర్వహిస్తారు. అక్కడే గ్రామంలో ఉన్న ప్రవాసాంధ్రులు (ఎన్‌ఆర్‌ఐ), సంపన్నులు (ధనిక కుటుంబాలు)తో చర్చిస్తారు. ఈ పక్రియ పూర్తయితే ఉగాదికొ కార్యాచరణకు దిగాలని ప్రభుత్వం భావిస్తోంది. గుర్తించిన పేద కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయదు. సహాయం అందించే ఎన్‌ఆర్‌ఐ, సంపన్న కుటుంబాలకు అప్పగిస్తారు. వారిచ్చే ప్రోత్సాహంతో పేద కుటుంబాలు ఎదిగేలా ప్రభుత్వం చూస్తుంది. సలహాలు, సూచనలతో కొందరు పరోక్షంగా సహాయం అందిస్తే, గ్రామాలు, కుటుంబాలను దత్తత తీసుకొని ప్రత్యక్షంగా ఇంకొందరు సహాయం చేస్తారని ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - Mar 18 , 2025 | 11:59 PM