Share News

no clarity on railway line రైల్వేలైన్‌ తెరపైకి వస్తూ.. పోతూ

ABN , Publish Date - Mar 18 , 2025 | 11:57 PM

The railway line is coming to the screen.. going away రాజాం రైల్వేలైన్‌ విషయంలో ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నచందంగా పరిస్థితి తయారైంది. రాజాం మీదుగా రైల్వేలైన్‌ కావాలని దశాబ్దాలుగా ఆ ప్రాంతీయులు కోరుతున్నారు.

no clarity on railway line రైల్వేలైన్‌   తెరపైకి వస్తూ.. పోతూ

రైల్వేలైన్‌

తెరపైకి వస్తూ.. పోతూ

ముందుకు పడని అడుగులు

గత ఏడాది జూలైలో సర్వే

డీపీఆర్‌కు ఆమోదం

అటు తరువాత ఊసేలేని వైనం

నిరాశలో రాజాం, పాలకొండ నియోజకవర్గాల ప్రజలు

రాజాం, మార్చి18(ఆంధ్రజ్యోతి): రాజాం రైల్వేలైన్‌ విషయంలో ఒక అడుగు ముందుకు.. మూడు అడుగులు వెనక్కి అన్నచందంగా పరిస్థితి తయారైంది. రాజాం మీదుగా రైల్వేలైన్‌ కావాలని దశాబ్దాలుగా ఆ ప్రాంతీయులు కోరుతున్నారు. ఏడాదికోమారు ఉన్నతాధికారులు వచ్చి హామీలివ్వడం.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప లైన్‌ మంజూరు కావడం లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత డీపీఆర్‌ రూపంలో అయితే కదలిక వచ్చింది. ఆ తర్వాత ఇంతవరకూ రైల్వేలైన్‌ నిర్మాణం విషయమై కేంద్ర రైల్వేశాఖ నుంచి స్పష్టత రాలేదు.

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గత ఏడాది జూలై 29న లోక్‌సభలో తొలి ప్రసంగం చేశారు. రాజాం ప్రాంతానికి దశాబ్దాలుగా రైల్వేలైన్‌ నిర్మాణం కలగానే ఉండిపోయిందని ఆ ప్రాంత ఆకాంక్షను ప్రస్తావించారు. దీనికి సంబంధించి సర్వేకు అనుమతిచ్చామని.. డీపీఆర్‌కు ఆమోదం తెలిపామని సంబంధించి శాఖ ప్రకటించింది కానీ దాదాపు ఎనిమిది నెలలు అవుతున్నా రైల్వేలైన్‌ నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పురోగతి లేదు. దీంతో ఈ ప్రాంతీయులు మళ్లీ నిరాశ పడుతున్నారు.

దశాబ్దాలుగా ఇదే తంతు

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం ఉన్నప్పుడు పొందూరు నుంచి రాజాం మీదుగా పార్వతీపురం లైన్‌కు కలుపుతూ ప్రత్యేక రైల్వే లైన్‌ నిర్మించాలన్నది ప్రతిపాదన. ఈ అంశం దశాబ్దాలుగా బుట్టదాఖలవుతూ వచ్చింది. తాజాగా విజయనగరం నుంచి రాజాం మీదుగా పలాసకు కలుపుతూ రైల్వేలైన్‌ నిర్మాణ సర్వేకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించింది. కానీ ఇది ఏ స్థాయిలో ఉందో తెలియని పరిస్థితి. విజయనగరం నుంచి రాజాం, పాలకొండ, కొత్తూరు, పర్లాకిమిడి, మెళియాపుట్టి మీదుగా పలాసకు 142 కిలోమీటర్ల రైల్వేలైన్‌ నిర్మాణం చేపట్టాలన్నది కొత్త ప్రణాళిక. ఈ రైల్వేలైన్‌ నిర్మాణమైతే.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు ఒడిశాలోని ఒక జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది. ప్రజా రవాణాతో పాటు పారిశ్రామికాభివృద్ధి, గిరిజన ఉత్పత్తుల రవాణా, మార్కెటింగ్‌కు మరింత అనుకూలత ఏర్పడనుంది. పర్యాటకంగానూ మరింత అభివృద్ధికి అవకాశం కలుగుతుంది. రాజాం, పాలకొండ ప్రాంతీయులకు రైల్వే రవాణా అంటే గగనమే. ఇటు చీపురుపల్లి, అటు శ్రీకాకుళం రోడ్డు వెళ్లి రైలెక్కాలి. దీంతో దూర ప్రాంతాలు వెళ్లాల్సిన వారు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. చీపురుపల్లిలో రైల్వే వంతెన నిర్మాణ పనుల నేపథ్యంలో రోడ్డు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. దీంతో రాజాం, పాలకొండ నియోజకవర్గాల ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు.

పాత ప్రణాళిక ఇలా..

ఉమ్మడి శ్రీకాకుళంలో ఉన్నప్పుడు రాజాం పారిశ్రామికంగా ఎంతో వృద్ధి సాధించింది. ఆ సమయంలో పొందూరు నుంచి రాజాం మీదుగా బొబ్బిలికి ప్రత్యేక రైల్వేలైన్‌ నిర్మించాలన్నది ప్లాన్‌. కానీ ప్రతి రైల్వే బడ్జెట్‌లో సర్వేకు సంబంధించి డీపీఆర్‌కు ఆమోదం తెలుపుతారని ఆశించడం, తర్వాత భంగపడడం పరిపాటిగా మారింది. రాజాంలో దాదాపు 20 పరిశ్రమలుండేవి. జూట్‌, సిమెంట్‌, ప్లాస్టిక్‌, సింథటిక్‌, విద్యుత్‌ వైర్లు, పైపుల తయారీ వంటి పరిశ్రమలను ఇక్కడ ఏర్పాటుచేశారు. అందులో జూట్‌ పరిశ్రమలు ఏడు నడిచేవి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరికేది. ముడిసరుకుల కొరతతో పాటు రవాణా సౌకర్యం లేక పలు పరిశ్రమలు మూతపడుతూ వచ్చాయి.

జూట్‌ పరిశ్రమ తిరోగమనం

రాజాం పరిసర ప్రాంతాల్లో జుట్‌ పరిశ్రమలపై ఆధారపడి వేలాది మంది బతికేవారు. అటు గోగునార సాగుచేసి రైతులూ ఉపాధి పొందేవారు. గతంలో కేంద్ర జౌళిశాఖ ఆధ్వర్యంలో జూట్‌ కార్పొరేషన్‌ రాజాంలో కార్యకలాపాలు సాగించేది. రైతులకు సాగు ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమల నిర్వహణకు రాయితీలిచ్చేది. నేడు జూట్‌ కార్పొరేషన్‌ రాష్ట్రం నుంచే వెళ్లిపోయింది. ప్రోత్సాహం లేక రైతులు గోగునార సాగును తగ్గించారు. కొన్నాళ్లు పశ్చిమబెంగాల్‌ నుంచి గోగునారను తెప్పించిన పరిశ్రమల యాజమాన్యాలు లారీల్లో తెప్పిస్తుండడంతో రవాణా చార్జీలు భారంగా భావించాయి. అదే రైలు మార్గం ఉంటే ముడిసరుకుల దిగుమతితో పాటు ఉత్పత్తుల ఎగుమతి కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రైల్వేలైన్‌ నిర్మాణంపై దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

దశాబ్దాలుగా మార్పు లేదు

రాజాం రైల్వేలైన్‌ విషయంలో దశాబ్దాలుగా మార్పు రావడం లేదు. విజయనగరం నుంచి పలాసకు ప్రత్యేక లైన్‌ వేస్తామని చెప్పడంతో ఆశించాం. ఎనిమిది నెలల కిందట సర్వే అని చెప్పుకొచ్చారు. ఆ సర్వే ఏ స్థితిలో ఉందో తెలియడం లేదు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు రైల్వేలైన్‌పై దృష్టిపెట్టాలి. కేంద్ర రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావాలి.

- గోపాలరావు, జూట్‌ కార్మికుడు, రాజాం

Updated Date - Mar 18 , 2025 | 11:57 PM

News Hub