Share News

ఇక్కడి అమ్మాయి.. అక్కడ అందాల రాశి

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:20 AM

విజయనగరం జిల్లా తెర్లాం మండలం సోమిదవలస గ్రామానికి చెందిన చందక సాయిసాత్విక అరుదైన గుర్తింపును పొందారు. మే 25న డల్హాస్‌ లో జరుగనున్న అమెరికా తెలుగు అం దాల భామల పోటీలో పాల్గొనేందుకు ఆమె ఎంపికయ్యారు.

ఇక్కడి అమ్మాయి..  అక్కడ అందాల రాశి

బొబ్బిలి /తెర్లాం, మార్చి 26 (ఆంధ్ర జ్యోతి): విజయనగరం జిల్లా తెర్లాం మండలం సోమిదవలస గ్రామానికి చెందిన చందక సాయిసాత్విక అరుదైన గుర్తింపును పొందారు. మే 25న డల్హాస్‌ లో జరుగనున్న అమెరికా తెలుగు అం దాల భామల పోటీలో పాల్గొనేందుకు ఆమె ఎంపికయ్యారు. బాపట్ల అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో బీఎస్‌సీ పూర్తి చేసి.. డేటా ఎనలైటికల్‌ కోర్సులో ఎమ్మెస్సీ చదువుకునేందుకు ఆమె అమెరికాలోని యూఎన్‌టీ యూనివర్సిటీలో (డల్హాస్‌) చేరారు. అక్కడ నిర్వహించిన తెలుగు అందాల పోటీలో పాల్గొన్నారు. సుమారు 300 మంది తెలుగు అమ్మాయిలు ఈ పోటీలో పాల్గొనగా... సాయిసాత్విక ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. మే 25న జరిగే ఫైనల్స్‌లో తనకు తెలుగువారంతా ఓటు చేయాలని ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా కోరారు. ఆమె తండ్రి చందక సూర్యకుమార్‌ వివిధ సంస్థలలో మెకానికల్‌ ఇంజనీరుగా పనిచేశారు. తల్లి సబిత సోమిదవలస రేషన్‌ డిపో డీలర్‌. ఆమె అక్క సాయి సుస్మిత అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. సాయిసాత్విక, సాయిసుస్మిత ఇద్దరూ రాజాంలోని సెయింట్‌యాన్స్‌ పాఠశాలలో చదువుకొని టాపర్స్‌గా నిలిచారు. బాసరలో ట్రిపుల్‌ ఐటీ చేశారు.

ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు కావాలనుకుంది

అమెరికాలో తెలుగు అందాల అమ్మాయిల పోటీలకు ఎంపికైన మా రెండో అమ్మాయి సాయిసాత్విక ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు కావాలని కలలు కనింది. చిన్న నాటి నుంచి రచనా వ్యాసంగం పట్ల ఆమెకు మక్కువ ఎక్కువ. నేషనల్‌ బాల భవన్‌ ఢిల్లీలో జరిగిన క్రియేటివ్‌ రైటింగ్‌ పోటీలలో బహుమతులు సాఽధిం చింది. మా తల్లిదండ్రులు పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పలగర గ్రామంలో ఉంటున్నారు. తండ్రి తుమ్మగంటి గోపాలకృష్ణారావు ఉపా ధ్యాయులు. ఆయన జర్నలిస్టు. అనేక రచనలు చేశారు. ఇప్పటికీ రచనలు చేస్తున్నారు. మా కుమార్తె అమెరికాలో తెలుగు అందాల అమ్మాయి పోటీలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉంది. మేలో జరిగే ఫైనల్స్‌లో కూడా ఆమె విజయం సాధించి మిస్‌ అమెరికా తెలుగు అందాల భామ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగువారి అందరి ఆశీస్సులు నా కుమార్తెకు అందజేసి ఈ పోటీలో గెలిపించాలని కోరుకుంటున్నాను.

-సబిత, సాయిసాత్విక తల్లి

Updated Date - Mar 27 , 2025 | 12:20 AM