Share News

డోలీ రహిత జిల్లాగా మారుస్తాం

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:08 AM

పార్వతీపురం మన్యం జిల్లాను డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు.

 డోలీ రహిత జిల్లాగా మారుస్తాం
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

- కందుల సాగుకు ప్రోత్సాహం

- వెయ్యి ఎకరాల్లో నిమ్మగడ్డి సాగు

- తలసరి ఆదాయం పెంపునకు చర్యలు

- ముఖ్యమంత్రికి వివరించిన కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌

పార్వతీపురం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లాను డోలీ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామని కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు వివరించారు. రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు బుధవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులు, వివిధ సమస్యలపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ‘జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. కొండ ప్రాంతాల్లో రహదారుల సదుపాయం లేక డోలీలు ఉపయోగిస్తున్నారు. ఆ పరిస్థితిని మార్చేందుకు కృషి చేస్తున్నాం. అన్ని గిరిజన గ్రామాలకు రహదారి సదుపాయం కల్పించేలా పనిచేస్తున్నాం. 250 మంది జనాభా ఉన్న గ్రామాలకు కూడా రహదారి సదుపాయం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాం. అరకు కాఫీకి బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చింది. అదే మాదిరిగా మన్యం ప్రాంతంలో జీడిపప్పు సాగును ప్రోత్సహించి, దానికి కూడా బ్రాండ్‌ ఇమేజ్‌ వచ్చేలా చేస్తాం. అపరాల సాగును ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో ఎమేమియా ఎక్కువగా ఉంది. దానిని కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నాం. కంటైనర్లలో హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం జిల్లా తలసరి ఆదాయం రూ.1.67 లక్షలుగా ఉంది. ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రూ.1.94 లక్షలకు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా ప్రగతికి పర్యాటకం ఎంతో దోహదపడుతుంది. ఈ రంగంలో జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల నిర్మాణ పనులు 60 శాతం పూర్తయ్యాయి. పశుసంవర్థకశాఖ, మత్స్య పరి శ్రమలు, పర్యాటకం, రైల్వే, రవాణా, కమ్యూనికేషన్‌, నిర్మాణ రంగాల ద్వారా జిల్లాకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. కందుల సాగుకు రైతులను ప్రోత్సహిస్తాం. వెయ్యి ఎకరాల్లో నిమ్మగడ్డి సాగు జరిగేలా చూస్తున్నాం. పల్లెనిద్ర కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వసతి గృహాల్లోని సమస్యలను పరిష్కరిస్తున్నాం.’ అని కలెక్టర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌తో చర్చించి అన్ని విధాల జిల్లాను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నామని సీఎంకు వివరించారు.

పలు అంశాలపై నివేదిక..

జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులు, తదితర అంశాలపై కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక అందించారు. 91 గ్రామాలకు పీఎంజీఎస్‌వై ద్వారా రహదారులు నిర్మించేందుకు డీఆర్‌పీని పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌శాఖకు పంపించినట్టు చెప్పారు. దీనికి సంబంధించి అవసరమైన ఆదేశాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు ఎంతో అవసరమని, ఇది గిరిజన విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని నివేదికలో పేర్కొన్నారు.

16.90 శాతం వృద్ధిరేటుపై కలెక్టర్‌కు ప్రశంస

పార్వతీపురం మన్యం జిల్లా 16.90 శాతం వృద్ధిరేటు సాధించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ను ప్రశంసించారు. పీపీపీ పర్సెప్షన్‌లో జిల్లా నాలుగో ర్యాంకులో ఉండడంపై అభినందించారు. ఈ జిల్లాను అన్ని జిల్లాలు ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో ఏనుగుల సమస్య ఉందని, శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కోరారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్‌ కళాశాల పనులు 60 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులు కావాల్సి ఉందన్నారు. లాబేసు, పూర్ణపాడు వంతెన పనులు పూర్తి చేయాల్సి ఉందని, తద్వారా 19 గ్రామాలకు రహదారి సౌకర్యం లభిస్తుందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా.. తక్షణ చర్యలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో 50 శాతం వ్యవసాయ రంగం నుంచి, 9 శాతం పారి శ్రామిక రంగం, 42 శాతం సేవా రంగం నుంచి జీడీపీ వస్తుందని కలెక్టర్‌ అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పది సూత్రాలు కచ్చితంగా అమలు చేస్తూ, మరింత వృద్ధి సాధించడానికి చర్యలు చేపడతామని సీఎంకు వివరించారు.

Updated Date - Mar 27 , 2025 | 12:08 AM