Share News

ఈసారి వరమెవ్వరికో?

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:07 AM

నామినేటెడ్‌ పదవుల భర్తీ మరింత వేగవంతం కాబోతుంది. ఇప్పటికే ఉగాదికి ముందే మార్కెట్‌ కమిటీ చైర్మన్ల తొలి జాబితా విడుదలైంది.

ఈసారి వరమెవ్వరికో?

నియోజకవర్గాల నేతల్లో తీవ్ర ఉత్కంఠ

మార్కెట్‌ కమిటీల్లో ఆచితూచి వ్యవహరించారన్న భావన

మిగతా వాటి భర్తీలోను ఇదే జరగాలన్నదే అందరి ఆశ

మరోవైపు కార్పొరేషన్ల పదవుల్లోను చోటు ఇవ్వాలన్న కోరిక

సామాజికవర్గం కాదు.. పనితనాన్ని బట్టి ఇవ్వాలంటున్న మహిళా నేతలు

బీజేపీ, జనసేన తమకూ ఇవ్వాలని డిమాండ్‌

నామినేటెడ్‌ పదవుల భర్తీ మరింత వేగవంతం కాబోతుంది. ఇప్పటికే ఉగాదికి ముందే మార్కెట్‌ కమిటీ చైర్మన్ల తొలి జాబితా విడుదలైంది. సమాంతరంగా దేవాలయ కమిటీలు, సహకార సంఘాల త్రిసభ్య కమిటీలు, కీలకమైన మరికొన్ని కార్పొరేషన్ల పోస్టులను భర్తీ చేయబోతున్నారు. జిల్లాలో ఆరు వేల మందికిపైగా తమకు మంచి అవకాశం ఇవ్వాల్సిందిగా తెలుగుదేశం అధిష్ఠానంకు దరఖాస్తు చేసుకున్నారు. అటు జనసేన, ఇటు బీజేపీలకు చోటు ఇవ్వడం ఖాయంగా తేలింది. అయితే పార్టీ తమకు అవకాశం ఇస్తుందా, లేదా అనే సందేహంలోనే కేడర్‌, సీనియర్‌ నాయకులు తీవ్ర ఉత్కంఠలో పడ్డారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావొస్తోంది. ఒక దఫా నామినేటెడ్‌ పోస్టులు కొన్నింటిని మాత్రమే ప్రకటించారు. తాజాగా మార్కెట్‌ కమిటీ చైర్మన్లను ప్రకటించగా, మిగతా కమిటీ సభ్యు లతో కూడిన జీవోలు ఒకటి, రెండు రోజుల్లోనే విడుదల కానున్నాయి. నియోజక వర్గాల్లో స్థానికంగా కీలకమైన పదవి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌. దీనికోసం తీవ్ర స్థాయి లోనే స్థానిక నేతలంతా పోటీలు పడ్డారు. ఎమ్మెల్యేలు ఆయా మార్కెట్‌ కమిటీల చైర్మన్‌ పదవులకు ఉన్న రిజర్వేషన్‌ను దృష్టిలో పెట్టుకుని మూడు పేర్లను పార్టీ అధిష్ఠానానికి పంపారు. కొన్నిచోట్ల ఒక పేరునే సిఫా ర్సు చేశారు. ఎమ్మెల్యేల నుంచి అందిన జాబితాలన్నింటి పైనా అక్కడక్కడ అభిప్రాయ సేకరణ జరిపారు. దెందులూరు మార్కెట్‌ కమిటీ నుంచి మహిళా రిజర్వేష న్‌ పేరిట సీనియర్‌ నేత గారపాటి రామసీతకు అవ కాశం ఇచ్చారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సైతం ఆది నుంచి ఆమె అభ్యర్థిత్వం పట్లే మొగ్గు చూపుతూ వచ్చారు. ఫలితంగా గతంలో పెదపాడు జడ్పీటీసీగా వ్యవహరించిన ఆమె తాజాగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ హోదాను పొందగలిగారు. ఏలూరులో మామిళ్ళపల్లి పార్థసారథికి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి దక్కింది. సారథితోపాటు మిగతా నేతలు కంప్యూటర్‌ ప్రసాద్‌, పూజారి నిరంజన్‌ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. కాని చివరకు సారథి వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. మార్కెట్‌ కమిటీ సభ్యులుగా మరికొందరికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో జన సేన పక్షాన ఉంగుటూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా కె.జ్యోతిని ఎంపిక చేశారు. చింతలపూడి మార్కెట్‌ కమిటీ కోసం టీడీపీ పక్షాన పెద్ద ఎత్తున అభ్యర్థులు రంగంలో ఉన్నారు. గత మూడు నెలలుగా వీరంతా పార్టీ ముఖ్యులతో టచ్‌లో ఉన్నారు. తొలి జాబితాలో చింతలపూడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పేరు ప్రకటి స్తారనుకున్నా అది సాధ్యంకాలేదు. నందిగం బాబి, కిలారు సత్యనారాయణ, గుత్తా వరప్రసాద్‌, రాధారాణి, మధుబాబు వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు జనసేన కూడా మార్కెట్‌ కమిటీ తమకే రావాలని గట్టిగా డిమాండ్‌ చేస్తోంది.

ఎవరికి ఇస్తారో.. ఎప్పుడు ఇస్తారు ?

మార్కెట్‌ కమిటీల పదవులకు నామినేటెడ్‌ ఆరంభ మైంది. దీంతోపాటు మిగతా పదవుల కోసం అత్యధికు లు ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తొమ్మిది మార్కెట్‌ కమిటీలు ఉండగా తొలి జాబితాలో మూడు మాత్రమే ప్రకటించారు. ఉంగుటూరు, కైకలూరు వంటి నియోజకవర్గాల్లో రెండేసి చొప్పున మార్కెట్‌ కమిటీలు ఉన్నాయి. ఉంగుటూరులో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తమ వారి కోసం గట్టిగా నిలబడుతున్నారు. ఇప్పుడు ఎలాగూ ఉంగుటూరును భర్తీ చేసినందున ఇదే నియోజక వర్గంలో ఉన్న భీమడోలు తమకే దక్కుతుందన్న భావన లో టీడీపీ ఉంది. కైకలూరు, కలిదిండి మార్కెట్‌ కమి టీలు ప్రస్తుతానికి పెండింగ్‌లో ఉంచారు. మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజి వీడులో మార్కెట్‌ కమిటీని రెండో విడతలో విడుదల చేసే అవకాశాలున్నాయి.

ఇప్పటికే సహకార సంఘాల్లో త్రిసభ్య కమిటీల కోసం నియోజకవర్గాల వారీగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు జాబితా లను రూపొందించి ప్రభుత్వం వద్దకు చేర్చారు. కొన్ని సహకార సంఘాల త్రిసభ్య కమిటీల్లోను తమకు చోటు ఇవ్వాలని బీజేపీ, జనసేన పట్టుపడుతున్నాయి. పోల వరం ప్రాంతంలో జనసేనతోపాటు బీజేపీ అనుకూలురు త్రిసభ్య కమిటీల్లో చోటు కోసం గట్టిగానే ఒత్తిడి చేస్తు ్నారు. ఇప్పటికే కొందరు ఏలూరు పార్లమెంటు నియో జకవ్గ ఇన్‌చార్జి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపన చౌదరి మద్దతు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు పదికి పైగా సొసైటీ కమిటీల్లో బీజేపీకి అవకాశం దక్కవచ్చు. జనసేనకు మరో 10 నుంచి 15 కమిటీల్లోను చోటు దక్కవచ్చని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు జనసేన నేతలు తమ పార్టీ పక్షాన ఎమ్మెల్యేలకు సిఫార్సులు అందజేశారు. మరోవైపు వివిధ కార్పొరేషన్ల భర్తీ ఇంకా జరగాల్సి ఉన్నందున వాటిలోనైనా చోటు ఇవ్వాలని పట్టుపడుతున్న వారి సంఖ్య భారీగానే పెరుగుతోంది. తెలుగుదేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న దాసరి శ్యాంచంద్ర శేషు నామినేటెడ్‌ పోస్టు కోసం పట్టుపడుతున్నారు. గత ఐదేళ్లల్లో పార్టీ వ్యవహారాల్లోను వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన వారిలో ఆయనొకరు. బీసీ వర్గాలకు చెందిన తనకు సరైన స్థానం కల్పిస్తే పార్టీలో ఉన్న మిగతా వారికి సానుకూల సంకేతాలు అందుతాయన్న కోణంలోనే తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మహిళా నేతలు గంగిరెడ్ల మేఘలాదేవి, కడియాల విజయలక్ష్మి వంటి వారంతా తమకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుకుంటున్నారు. కేవలం ఒక సామాజిక వర్గ కోణంలో చూడకుండా పార్టీ కోసం ఎంతమేర పని చేశామో విశ్లేషించి తమకు అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలు వారి పేర్లను పరిగణనలోకి తీసుకోవాలన్న కోణంలోనే ఇప్ప టికే కేడర్‌ పట్టుదలతో ఉంది. మార్కెట్‌ కమిటీలు దక్కని సీనియర్లకు వివిధ కార్పొరేషన్లలోనైనా చోటు ఇవ్వాల్సిం దేనని పట్టుపడుతున్నారు.

Updated Date - Mar 30 , 2025 | 01:07 AM