ఆక్వాకు మంచి రోజులు !
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:24 AM
ఆక్వాలో విద్యుత్ రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌ల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాయితీపై దిశానిర్దేశం చేశారు. రిజిస్ర్టేషన్ చేసుకున్న చెరువులకు రాయితీ వర్తిస్తుందని యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకు ఇస్తామని తేల్చి చెప్పారు.

విద్యుత్ రాయితీపై ప్రభుత్వం స్పష్టత
ఆక్వా చెరువులకు రిజిస్ర్టేషన్ తప్పనిసరి
జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు
48 వేల ఎకరాలకే రిజిస్ర్టేషన్
13,000 విద్యుత్ క నెక్షన్‌లకు వర్తిస్తున్న రాయితీ
నాన్ ఆక్వా జోన్‌లో రిజిస్ర్టేషన్‌పైనే అయోమయం
ఆక్వాలో విద్యుత్ రాయితీపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. జిల్లా కలెక్టర్‌ల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాయితీపై దిశానిర్దేశం చేశారు. రిజిస్ర్టేషన్ చేసుకున్న చెరువులకు రాయితీ వర్తిస్తుందని యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకు ఇస్తామని తేల్చి చెప్పారు. ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికీ యూనిట్ విద్యుత్‌ను రూ. 1.50లకు ఇవ్వనున్నట్టు కూటమి తరపున చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అయితే రిజిస్ర్టేషన్ మెలికతో రైతుల్లో ఒకింత ఆందోళన ఉంది. జిల్లాలో 50శాతానికి పైగా చెరువులకు రిజిస్ర్టేషన్‌లు లేవు. అధికారులు ఇప్పుడు సర్వేకు సిద్ధమవుతున్నారు. రిజిస్ర్టేషన్ చెరువులను గుర్తిస్తారు. వాటికి మాత్రమే రాయితీ వరిస్తుంది. రిజిస్ర్టేషన్ చేసుకుంటే అన్నింటికి రాయితీ కల్పించనున్నారు.
(భీమవరం–ఆంధ్రజ్యోతి) :
విద్యుత్ రాయితీ కోసం ప్రభుత్వం రిజిస్ర్టేషన్ విధానాన్ని అమలు చేయడం వెనుకు సదుద్దేశమే ఉంది. రొయ్యలు, చేపలు సాగు చేస్తే రైతులు సునాయాసంగా విక్రయించుకోవడానికి రిజిస్ర్టేషన్ ఉపయోగపడుతుంది. యాంటీబయోటిక్ వంటి మందులను కొందరు వినియోగించడం వల్ల రొయ్య ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. దీనివల్ల రైతలందరూ నష్టపోయే పరిస్థితి తలెత్తుతోంది. ఒక్కోసారి కంటైనర్‌లను విదేశాలనుంచి తిప్పి పంపుతున్నారు. అదే రిజిస్ర్టేషన్ చేసుకుంటే రైతులనుంచి కొనుగోలు చేసుకున్న ఉత్పత్తులకు ముందుగానే గుర్తింపు ఉంటుంది. యాంటీబయోటిక్ అవశేషాలు లేనట్టయితే అటువంటి రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లే అవకాశం లేదు. మరోవైపు చేపల్లోనూ పురుగుమందుల అవశేషాలున్నాయంటూ అస్సాం, బిహార్ వంటి రాష్ర్టాలు దిగుమతులను నిషేధిస్తున్నాయి. యాంటీబయోటిక్ మందులు వినియోగించడం లేదంటూ అక్కడ శాస్త్రవేత్తలను. అధికారులను రప్పించి క్షేత్ర స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే యాంటీబయోటిక్ వినియోగించకుండా రైతులను కట్టడి చేయడం, ఇతర ప్రయోజనాల కోసం ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ను తప్పనిసరి చేస్తోంది. గతంలోనే దీనిపై చర్యలు తీసుకున్నారు. రైతులందరూ ముందుకు రావడం లేదు.
13,000 కనెక్షన్లకు రాయితీ
జిల్లాలో 1.33 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారు. దానిని ఈ ఏడాది 1.50 లక్షల ఎకరాలకు విస్తరించాలని జిల్లా అధికారులు ప్రణాళిక రచించారు. రిజిస్ర్టేషన్‌కు వచ్చేసరికి 48 వేల ఎకరాలకు మాత్రమే రైతులు ముందడుగు వేశారు. రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. పశ్చిమలో మొత్తం 26,000 మంది రైతులు ఆక్వా సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 16,500 విద్యుత్ కనెక్షన్‌లున్నాయి. అందులో ఆక్వాజోన్ పరిధిలో ఉండే విద్యుత్ కనెక్షన్‌లకు మాత్రమే ప్రభుత్వం రూ.1.50 విద్యుత్ రాయితీ ఇస్తోంది. జోన్ పరిధిలో పది ఎకరాలకుపైగా ఉన్న రైతులకు రాయితీ ఇవ్వడం లేదు. నాన్‌జోన్ పరిధిలో చిన్న రైతులకు రాయితీ లేకుండా పోయింది. ఈ నిబంధనలతో జిల్లాలో 13,000 కనెక్షన్‌లకు రాయితీ అమలు జరుగుతోంది. మరో 3,500 కనెక్షన్‌లకు రాయితీ లేకుండా పోయింది. రిజిస్ర్టేషన్ చేసుకుంటే రైతులందరికి విద్యుత్ రాయితీ వర్తింపచేసేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మత్స్యశాఖ సైతం త్వరలోనే సర్వేకు ఉపక్రమించనుంది. రిజిస్ర్టేషన్ చేసుకునేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు.