Share News

క్లీన్‌ మొగల్తూరు

ABN , Publish Date - Apr 02 , 2025 | 01:17 AM

చెత్త సమస్య పరిష్కరించి క్లీన్‌ మొగల్తూరుగా తీర్చిదిద్దడానికి డిప్యూటీ సీఏం పేషీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

క్లీన్‌ మొగల్తూరు
మొగల్తూరులో డంప్‌ చేసిన చెత్తను పరిశీలిస్తున్న అధికారులు

చెత్త సమస్యపై డిప్యూటీ సీఎం పేషీ ప్రత్యేక చర్యలు

విశాఖలో వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌కు తరలింపు యోచన

మొగల్తూరు, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): చెత్త సమస్య పరిష్కరించి క్లీన్‌ మొగల్తూరుగా తీర్చిదిద్దడానికి డిప్యూటీ సీఏం పేషీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆక్వా చెరువులు, రహదారి వెంబడి డంప్‌ చేసిన చెత్తను విశాఖపట్నంలోని వేస్ట్‌ టూ ఎనర్జీ ప్లాంట్‌కు తరలించనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యా ణ్‌ పేషీ అధికారులు మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో గత నెల 28న గ్రామాభివృద్ధి సభ ఏర్పాటు చేశారు. మొగల్తూరులో ప్రధాన సమస్యలను గ్రామస్థులు పంచాయతీరాజ్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. గ్రామంలో డంపింగ్‌ యార్డ్‌ లేకపోవడంతో నిత్యం సేకరించిన చెత్తాచెదారం ఆక్వా చెరువుల వద్ద, రహదారుల వెంబడి వేస్తున్నారని నల్లంవారితోటకు చెందిన ఆక్వా రైతు కొత్తపల్లి చిరంజీవి అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పేషీ అధికారులు విశాఖపట్నంలోని వేస్ట్‌ టూ ఎనర్జి ప్లాంట్‌కు చెత్తా, చెదారం తరలించాలని సూచించారు.

క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన

తణుకు పట్టణం నుంచి డంప్‌ చేసిన చెత్తా చెదారం విశాఖకు తరలిస్తున్నారని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిప్యూ సీఎం పేషీ అధికారులు సూచించడంతో మంగళవారం ఈవోఆర్డీ నవీన్‌ కిరణ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ మోహనరావు, పంచాయతీ కార్యదర్శి ముచ్చర్ల నాగేశ్వరరావు డంప్‌ చేసిన చెత్తను పరిశీలించారు. మొగల్తూరు జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 800 క్యూబిక్‌ మీటర్ల విస్తీర్ణంలో చెత్త నిల్వ ఉందని గుర్తించారు. తణుకు నుంచి 15 టన్నుల చెత్త విశాఖకు తరలిస్తున్నారని, మొగల్తూరులో చెత్త ఎగుమతికి ప్రతిపాదనలు సిద్ధం చేసి డీసీఎం పేషీకి పంపుతామని ఈవోపీఆర్డీ నవీన్‌ కిరణ్‌ తెలిపారు.

Updated Date - Apr 02 , 2025 | 01:17 AM