ఆధార్ అడ్డంకులు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:56 AM
ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు పొందడంలో ఆధార్ అడ్రస్, ఫ్యామిలీ మ్యాపింగ్‌ల మధ్య వున్న తేడాలు విద్యార్థుల పాలి ట శాపాలుగా మారాయి.

విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు
తరుముకొస్తున్న ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల తేదీలు
తణుకులో నివసిస్తున్న రమేశ్ కుటుంబంలో వర్క్ ఫ్రం హోమ్ సర్వే నిమిత్తం ఆ ప్రాంత సచివాలయ సిబ్బంది వెళ్లారు. ఆధార్ కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలన్నీ నమోదు చేశారు. మరో రెండు రోజుల తర్వాత అదే కుటుంబాన్ని ఆధార్ కార్డుల ఆధారంగా పీ 4 సర్వే చేశారు. ఇంత వరకు బాగానే వుంది. కాని రమేశ్ తన కుమార్తెకు కుల ధ్రువీకరణ పత్రం కావాలని సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేశాడు. ఆమె ఒకటి నుంచి ఇంటర్ వరకు తణుకులోనే చదివింది. రమేశ్ రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఓటర్ కార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆధార్ మాత్రం రమేశ్ స్వగ్రామం అడ్రస్‌తో ఉందని చెప్పి దరఖాస్తును తిరస్కరిం చారు. ఇక్కడి సచివాలయంలో అనుసంధానమైన కుటుంబ సభ్యులకు అవసరమైన ధ్రువీక రణ పత్రాలు వారి స్వగ్రామాల్లో ఎలా ఇస్తారు ? అన్ని ప్రభుత్వ సర్వేలకు ఆధారంగా నిలిచిన ఆధార్ కార్డు, ధ్రువీకరణ పత్రాల జారీకి అడ్డంకి ఎలా అవుతుందో ? అధికారులే చెప్పాలి.
తణుకు రూరల్, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువపత్రాలు పొందడంలో ఆధార్ అడ్రస్, ఫ్యామిలీ మ్యాపింగ్‌ల మధ్య వున్న తేడాలు విద్యార్థుల పాలి ట శాపాలుగా మారాయి. వివిధ వృత్తి, ఉద్యోగాలు, వ్యాపార, ఉపాధి నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వెళ్లి తాత్కాలిక నివాసం వుంటున్న వారి పిల్లలకు ఇది మరింత భారంగా మారింది. వీరు ఒక గ్రామం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లి అక్కడి పాఠశాలల్లో తమ పిల్లలను చదివిస్తూ వుం టారు. పదో తరగతి వరకూ సర్టిఫికెట్ల అవసరం లేకున్నా.. ఆ తర్వాత ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు వివిధ ఉన్నత విద్యా కోర్సులలో చేరేందుకు ధ్రువ పత్రాలు అవసరం. వీటిని స్థానికులు ఆధార్ కార్డు ఆధారంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా పొందుతారు. కానీ స్వగ్రామంలో ఆధార్ కార్డులు వుండి, ప్రస్తుతం ఉపాధి నిమిత్తం ఉంటున్న పట్టణంలోని సచివాలయ పరిధిలో మ్యాపింగ్ అయిన కుటుంబాలకు సర్టిఫికెట్ పొందడం కష్టం మారింది. మ్యాపింగ్ చేసిన సచివాలయ
పరిధిలో ఆధార్ కార్డులో అడ్రస్ లేకపోవడంతో అక్కడ సర్టిఫికెట్ల జారీకి అభ్యంతరం వ్యక్తమవు తోంది. ఆధార్ కార్డు అడ్రస్ ఉన్న సచివాలయ పరి ధిలో ప్యామిలీ మ్యాపింగ్ లేకపోవడంతో అక్కడ సర్టిఫికెట్‌కు అర్హత లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. దీనితో ఇప్పటికే జాతీయ స్థాయిలోని నీట్, జేఈఈ, ఐఏటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, ఎన్‌ఈఎస్‌టీ తదితర పరీక్షలకు దరఖాస్తుల గడువు ముగుస్తుం డగా వీటికి సంబంధించిన పలు ధ్రువీకరణ పత్రాలు అవసరం. వీటితోపాటు రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రవేశ పరీక్షలకు ఏపీఈఏపీ సెట్, ఈసెట్, ఐసెట్‌లకు దరఖాస్తులకు గడువు ముగు స్తుంది. పాలిటెక్నిక్, ఏపీఆర్‌జేసీ వంటి వాటికి నోటిఫి కేషన్లు రానున్నాయి. వీటి గడువు ముగియక ముందే విద్యార్థులకు సర్టిఫికెట్‌లు జారీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
వాట్సాప్ సేవలకు ప్రచారం కరువు
రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలందించే కార్య క్రమానికి ప్రచారం కొరవడింది. ఈ పద్ధతిపై దరఖాస్తుదారులకు, సిబ్బందికి సరైన అవగా హన ఉండడం లేదు. దరఖాస్తుదారులు ఆన్ లైన్‌లో పంపించిన వివరాలు సచివాలయం పరిధిలోని వీఆర్‌వోలకు, అక్కడి నుంచి ఆర్‌ఐ, తహసీల్దార్‌లకు చేరాలి. నెల రోజుల క్రితం ఓబీసీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినా ఇప్పటికీ ధ్రువీకరణ పత్రం జారీ కాలేదు.
ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలి
సర్టిఫికేట్‌ల జారీలో ఆధార్ అడ్రస్‌తోపాటు సచివాలయ ప్యామిలీ మ్యాపింగ్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఆధార్ కార్డులో అడ్రస్‌లో లేకపోతే మ్యాపింగ్ జరిగిన సచివాలయం పరిధిలో వున్న అడ్రస్‌లోకి ఆధార్ కార్డులను మార్చుకోవాలి. ఈ ప్రక్రియ కోసం ఉచితంగా ఆధార్ అప్‌డేట్ శిబిరాలను నిర్వహిస్తున్నారు.
– డీవీఎస్‌ఎస్ అశోక్ వర్మ, తహసీల్దార్ తణుకు