పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:19 AM
జిల్లాలో పాఠశాలల పునర్వ్య వస్థీకరణ దాదాపు కొలిక్కివచ్చింది.

296 మోడల్ ప్రాథమిక బడులకు ఓకే
సర్‌ప్లస్ స్కూల్ అసిస్టెంట్లు ఆదర్శ పాఠశాలల హెచ్‌ఎంలు?
ఏలూరు అర్బన్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాఠశాలల పునర్వ్య వస్థీకరణ దాదాపు కొలిక్కివచ్చింది. జగన్ ప్రభుత్వ పాలనలో విధ్వంసానికి గురైనన ప్రాథమిక తరగతులను తిరిగి ఆయా పాఠశాలలకే చేర్చడంతో పాటు, క్లస్టర్లలోని పంచాయితీ యూనిట్‌గా అన్ని వసతులతో మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేయడానికి జిల్లా విద్యాశాఖ సమాయత్తమవు తోంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పాటుచేయ తలపెట్టిన ఐదు రకాల బడులకు సంబంధిత పాఠశాలల ఎస్‌ఎంసీ (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ)ల నుంచి ఆమోదం తీసుకున్న తర్వాతే వీటిని ప్రారంభిస్తున్నారు.
జిల్లాలో మొత్తం 1609 ప్రభుత్వ పాఠశాలలుండగా 30 పాఠశాలల ఎస్ ఎంసీలు తీర్మానాలు ఇచ్చేందుకు కొన్ని ప్రత్యామ్నాయాలను విద్యాశాఖ ముం దుంచాయి. వాటిని కూడా ఒప్పించి ఐదు రకాల బడుల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో విద్యాధికారులు సన్నద్ధమవుతున్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే నాటికి ఐదు రకాల బడులను సిద్ధంచేయడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కొత్తగా 296 మోడల్ ప్రైమరీ స్కూళ్లు
జిల్లాలోని 27 మండలాలను 111 క్లస్టర్లుగా విభజించారు. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు భోదించేలా కొత్తగా 296 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించనున్నారు. తరగతుల విలీనానికి అవకాశంలేని, సహజ సిద్ధ అడ్డంకులున్న (జాతీయ రహదారులు, చెరువులు, కాల్వలు) ప్రస్తుత 1 నుంచి 5వ తరగతి బేసిక్‌ప్రైమరీ స్కూళ్లను అక్కడే కొనసాగిస్తారు. ఇక 1, 2 తరగతులతోపాటు పూర్వ ప్రాథమిక తరగతులతో కూడిన ఫౌండేషనల్ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటవుతాయి. జిల్లాలో బేసిక్ ప్రైమరీ, ఫౌండేషనల్ స్కూళ్లు 894 ప్రారంభిస్తారు. అదనంగా 207 హైస్కూళ్లు ఉంటాయి. కేవలం ఉన్నత పాఠశాలలు మినహా, మిగతా 4రకాల బడులలలో ప్రీప్రైమరీ – 1, 2 (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులుంటాయి. ప్రీప్రైమరీ తరగతులు నిర్వహించే శాటిలైట్ పాఠశాలల సంఖ్యను మహిళా శిశు సంక్షేమశాఖ నిర్ణయిస్తుంది. ఇప్పటికే నిర్వహిస్తోన్న అంగన్‌వాడీ కేంద్రాలన్నీ శాటిలైట్ స్కూల్స్‌గా మారి పోతాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లోవున్న సుమారు 1.40 లక్షల మంది బాలబాలికలు కొత్తగా పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పాటయ్యే ఐదురకాల బడుల్లో ఉంటారనేది విద్యాధికారుల అంచనా.
సర్‌ప్లస్ టీచర్ల సర్దుబాటు
పాఠశాలల పునర్వ్యవస్థీకరణ అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాలమేరకు ఉపాధ్యాయుల అవసరత, కొరతను తేల్చనున్నారు. ఇంతకుముందు సేకరిం చిన గణాంకాల ప్రకారం పాఠశాల విద్య పరిధిలో ఏర్పాటయ్యే 4రకాల బడులకు ఎస్జీటీ కేడర్ టీచర్లు 3,322 మంది, స్కూల్ అసిస్టెంట్‌కేడర్ ఉపాధ్యాయులు 2,996 మంది అవసరమవుతారని గుర్తించారు. అవసరానికి మించి మిగులు (సర్‌ప్లస్) ఉపాధ్యాయుల్లో 35మంది ఎస్జీటీలు, 431మంది స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారని నిర్ధారణకు వచ్చారు. సవరించిన పునర్వ్యవస్థీక రణ డేటాప్రకారం టీచర్ల అవసరత, సర్‌ప్లస్ గణాంకాల్లో కొద్దిపాటి మార్పు లు ఉండవచ్చు. సర్‌ప్లస్ స్కూల్‌అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెచ్‌ఎంలుగా నియమించి, ఎస్జీటీలను డీఈవో పూల్‌లో ఉంచేలా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక నిర్ణయం వెలువడలేదు.