Share News

తెర వెనుక ఏం జరిగింది?

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:13 AM

మార్కెట్‌ పాట ద్వారా పురపాలకానికి వచ్చే ఆదాయానికి ఈ ఏడాది భారీగా గండిపడింది. మునిసిపల్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆశీలు పాట ద్వారా రూ.30,06,000 లక్షలు ఆదాయం వచ్చింది.

తెర వెనుక ఏం జరిగింది?
పాటను నిర్వహిస్తున్న కమిషనర్‌, పాల్గొన్న పాటదారులు

నరసాపురం ఆశీలు పాట గత ఏడాది రూ.82 లక్షలు

ఈ ఏడాది రూ.30 లక్షలే.. రూ.52 లక్షలు తగ్గడంపై అనుమానాలు

కాంట్రాక్టర్లు రింగ్‌ అయ్యారంటూ ప్రచారం..

కౌన్సిల్‌ ఆమోదిస్తుందా ? రద్దు చేస్తుందా ?

నరసాపురం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌ పాట ద్వారా పురపాలకానికి వచ్చే ఆదాయానికి ఈ ఏడాది భారీగా గండిపడింది. మునిసిపల్‌ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఆశీలు పాట ద్వారా రూ.30,06,000 లక్షలు ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.82 లక్షలకు పాట వెళ్లింది. ఈ మేరకు గత ఏడాదితో పోలిస్తే దాదాపు రూ.52 లక్షలు తగ్గింది. పాటదారులు రింగ్‌గా ఏర్పడి టెండర్లు వేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కమిషనర్‌ అంజయ్య పర్యవేక్షణలో చాంబర్‌లో జరిగిన పాటలో మొత్తం నలుగురు పాటదారులు పాల్గొన్నారు. ప్రారంభఽ ధర రూ.72 లక్షలుగా నిర్ణయించారు. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. ఈసారి సీక్రెట్‌, బహిరంగ పద్ధతిలో పాట నిర్వహించారు. ముందుగా సీక్రెట్‌ పద్ధతిలో డిపాజిట్‌ కట్టిన నలుగురు టెండర్లు వేశారు. వాటిని తెరిచి చూస్తే గంటా నాగదుర్గదేవి రూ.30 లక్షలకు కోడ్‌ చేశారు. మిగిలిన ముగ్గురు రూ.29 లక్షలకు తక్కువకు కోడ్‌ చేశారు. దీంతో బహిరంగ వేలం పెట్టారు. దీనిలోనూ మిగిలిన ముగ్గురు ఎక్కువ మొత్తంలో పాడేందుకు ఆసక్తి చూపించలేదు. గంటా నాగదుర్గాదేవి రూ 30లక్షల ఆరు వేలకు హెచ్చు పాడింది. సీక్రెట్‌ కంటే రూ.6 వేలు ఎక్కువ కావడంతో ఈ టెండర్‌ను ఓకే చేశారు. అయితే పాటను కౌన్సిల్‌ ఆమోదించాల్సి ఉంది.

రింగ్‌గా టెండర్లు వేశారని ఆరోపణలు..

మార్కెట్‌ పాటపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. రింగ్‌గా ఏర్పడి టెండర్లు వేశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో పాటను దక్కించుకున్న పాటదారులు ఈసారి పాటలో పాల్గొన్నారు. వీరు కూడా రూ.30 లక్షలు మించి పాడేందుకు ముందు కు వెళ్లకపోవడంపై పలు అనుమానాలు వినిపిస్తు న్నాయి. ఇటీవల మార్కె ట్‌లో చిరు వ్యాపారులం తా సమావేశమయ్యారు. దీనికి విప్‌ నాయకర్‌ను అతిథిగా ఆహ్వానించారు. వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్నామని గెజిట్‌ ప్రకారం మార్కెట్‌ పన్ను వసూలు చేయడం లేదని విప్‌ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన నాయకర్‌ గెజిట్‌ ప్రకారమే పన్నులు చెల్లించాలని, పాటదారులు ఎక్కువ మొత్తంలో డిమాండ్‌ చేస్తే పన్ను కట్టొద్దం టూ సూచించారు. ఈ కారణంగా పాటదారులెవ్వ రూ మార్కెట్‌ పాట పాడేందుకు సాహసం చేయలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వ్యాపారుల సంబరాలు

మార్కెట్‌ పాట తక్కువ మొత్తానికి వెళ్లడంతో వ్యాపారులు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో మాదిరిగా పన్ను చెల్లించనవసరం లేదని, గెజిట్‌ ప్రకారమే పన్ను వసూలు జరుగుతుందన్న ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో సైకిల్‌పై పండ్లు అమ్మాలంటే రూ.20 పన్ను కట్టాల్సి వస్తుంది. అదే తోపుడు బండ్లు, బజ్జీల పండ్లకు రూ.30 నుంచి రూ.50 కడుతున్నారు. గెజిట్‌ ప్రకారం వసూలు చేస్తే సగానికి సగం తగ్గుతుం దని వ్యాపారులు చెబుతున్నారు.

ఆమోదిస్తారా..?

ఈ పాటను కౌన్సిల్‌ ఆమోదించాల్సి ఉంది. గతంలో కంటే రూ.50లక్షలు తగ్గింది. పాట ప్రారంభధర కంటే రూ.42 లక్షలు తగ్గింది. ఇంత తక్కువ మొత్తంలో పాట వెళ్లడం వల్ల మునిసిపాల్టీకి భారీ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్‌ ఆమోదిస్తేనే పాట ఖరారువుతుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ ఓకే అయితేనే పాటదారుడికి మార్కెట్‌ పన్ను వసూలు చేసుకునే అవకాశం కల్పిస్తారు.

Updated Date - Mar 30 , 2025 | 01:13 AM