‘చెత్త’ పంచాయితీ!
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:59 AM
ప్రజారోగ్యం విఽధులతోనే సతమతమవుతున్న వారిపై చెత్త సేకరణ పర్యవేక్షణ బాధ్యతలు, రెవెన్యూ పరిధిలోని పన్ను వసూళ్ల బాధ్యతలు మోపటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణకు ఒక వైపు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే మరో వైపు ఆ లక్ష్యానికి విరుద్ధంగా కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఏఎన్‌ఎంలు ఆరోపిస్తున్నారు. ఇన్ని రకాల పనులు తమ వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై కలెక్టర్‌ను కలిసినా తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు.

కార్పొరేషన్ వర్సెస్ ఏఎన్‌ఎం
- ఏఎన్‌ఎంలకు చెత్త సేకరణ పర్యవేక్ష ణ బాధ్యతలు
- ఇప్పటికే రెవెన్యూ పరిధిలో పన్ను వసూళ ్ల బాధ్యతలు అప్పగింత
- కార్పొరేషన్ నిర్వాకంపై కలెక్టర్‌ను కలిసిన ఏఎన్‌ఎంలు
- సానుకూల స్పందన రాకపోవటంతో ఆందోళన
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్, ఏఎన్‌ఎంల మధ్య కొద్ది రోజులుగా ‘చెత్త’ పంచాయితీ నడుస్తోంది. ప్రజారోగ్యం విఽధులతోనే సతమతమవుతున్న వారిపై చెత్త సేకరణ పర్యవేక్షణ బాధ్యతలు, రెవెన్యూ పరిధిలోని పన్ను వసూళ్ల బాధ్యతలు మోపటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రజారోగ్య పరిరక్షణకు ఒక వైపు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే మరో వైపు ఆ లక్ష్యానికి విరుద్ధంగా కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారని ఏఎన్‌ఎంలు ఆరోపిస్తున్నారు. ఇన్ని రకాల పనులు తమ వల్ల కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై కలెక్టర్‌ను కలిసినా తమకు న్యాయం జరగలేదని వాపోతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ప్రజారోగ్యానికి సంబంధించిన విధులు నిర్వహించాల్సిన ఏఎన్‌ఎంలను విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) ‘చెత్త’ పనులకు ఉపయోగించటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రజారోగ్యానికి ఒక పక్క ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే.. మరోపక్క ప్రజారోగ్యాన్ని పరిరక్షించాల్సిన ఏఎన్‌ఎంలతో కార్పొరేషన్ అధికారులు ఆడుకుంటున్నారని విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. నగర పరిధిలో ప్రజారోగ్యాన్ని మెరుగు పరిచేందుకు విధులు నిర్వహించాల్సిన ఏఎన్‌ఎంలకు చెత్త సేకరణ పర్యవేక్షణ విధులను అప్పగిస్తున్నారు. ఒక్క చెత్తే కాదు .. రెవెన్యూ విభాగం పరిధిలోని అన్ని రకాల పన్ను వసూళ్ల బాధ్యతలను కూడా మోపారు. ఇవి కాకుండా మరో 10 రకాల కొత్త బాధ్యతలను అప్పగించారు. ఇవన్నీ కూడా ఏఎన్‌ఎంలుగా వారు చేస్తున్న స్వభావ పనులకు విరుద్ధమైనవి కావడంతో తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఏఎన్‌ఎంలుగా రోజువారీ చేసే బాధ్యతలు చాలా ఉన్నాయి. వారు మొత్తం 31 రకాలకు సంబంధించిన విధులు నిర్వహించాల్సి ఉంది. వీటిలో ఏది తేడా వచ్చిన ఏఎన్‌ఎంలు టార్గెట్ అవుతారు. ఇప్పటికే బండెడు చాకిరీ చేస్తున్న ఏఎన్‌ఎంలపై మరో 15 రకాల బాధ్యతలు మోపటం వారిని తీవ్రంగా కుంగదీస్తోంది.
ఏమిటీ చెత్త పనులు?
ఏఎన్‌ఎంలకు ప్రధానంగా చెత్త సేకరణ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. తమ సచివాలయం పరిధిలో చెత్త సేకరణ సవ్యంగా జరుగుతున్నది.. లేనిదీ పరిశీలించాల్సి ఉంది. ఎక్కడైనా చెత్త కుప్పలు పేరుకుపోతే పారిశుధ్య సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని తొలగింపచేసే బాధ్యత వీరిది. సచివాలయం పరిధిలో చెత్త సేకరణ పర్యవేక్షణ బాధ్యతలు అంటే రోజంతా ఏఎన్‌ఎంలు దీనిని పర్యవేక్షించటంతోనే సరిపోతుంది. ఇక ప్రజారోగ్య విధులు ఎలా నిర్వహిస్తారో కార్పొరేషన్ అధికారులకే ఎరుక. నగరంలోని శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఇప్పుడే సరిగా పర్యవేక్షణం చేయటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఏఎన్‌ఎంల చేత ఈ పనులు చేయిస్తే మరీ శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఏం పని చేస్తారో కార్పొరేషన్ అధికారులే చెప్పాలి.
రెవెన్యూ పన్ను వసూళ్ల బాధ్యత ఎవరిది?
కార్పొరేషన్‌లో రెవెన్యూ విభాగం ఉంది. ఈ విభాగం పరిధిలో పనిచేయటానికి ప్రత్యేకంగా సిబ్బంది ఉన్నారు. పన్నుల వసూళ్ల బాధ్యతలను చూడటానికి క్షేత్ర స్థాయిలో బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు ఉంటారు. వారి విధులను కూడా ఏఎన్‌ఎంల మీద కార్పొరేషన్ అధికారులు నెట్టారు. రెవెన్యూ విభాగం పన్నులకు సంబంధించి చూస్తే ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, వాటర్ చార్జీలు, సీవరేజి అద్దె, వాటర్ మీటర్ చార్జీల వసూళ్లకు సంబంధించిన పురోగతి వ్యవహారాలన్నింటికీ ఏఎన్‌ఎంలదే బాధ్యత అని కార్పొరేషన్ అధికారులు తేల్చారు.
మరిన్ని విధులు.. మోపారిలా..
పారిశుధ్యం, రెవెన్యూ విభాగాల పనులే కాకుండా మరిన్ని సంబంధం లేని అదనపు బాధ్యతలను ఏఎన్‌ఎంలపై మోపారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ఫీడ్ బ్యాక్ విధులు అప్పగించారు. ఆధార్ లేని పిల్లల రిపోర్టులు సమర్పించటం, మిస్సింగ్ సిటిజన్స్ మ్యాపింగ్, వర్క్‌ఫ్రమ్ హోమ్ రిపోర్టు, నాన్ రెసిడెంట్ ఏపీ రిపోర్టు, హౌస్‌హోల్డ్ జియో ట్యాగింగ్, ఎంఎస్‌ఎంఈ సర్వే, డెత మార్క్డ్ సిటిజన్స్ ఆడిట్ రిపోర్టు, ప్యాక్స్ ఈకేవైసీ రిపోర్టు, పాఠశాల టాయ్‌లెట్స్ సందర్శన - తనిఖీలు, దోమల నియంత్రణ వంటి అదనపు బాధ్యతలను అప్పగించారు. వీటిలో ఒకటి, రెండు ఏఎన్‌ఎంలు చేయగలిగేవి ఉన్నా.. మిగిలినవన్నీ వారి స్వభావ విధులకు పూర్తి భిన్నమైనవి కావటం గమనార్హం.
ఏఎన్‌ఎంల రోజువారీ విఽధులే చాలా కష్టం!
ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రతిరోజూ మొత్తం 31 రకాల విధులను ఏఎన్‌ఎంలు నిర్వహించాల్సి ఉంటుంది. సచివాలయాల పరిధిలో గర్భిణులను గుర్తించి ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తారు. హైరిస్క్ ఉన్న వారిని గుర్తించి వారికి మెరుగైన చికిత్సకు దోహదపడాలి. రక్తహీనత పరీక్షలు, ప్రభుత్వ హాస్పిటల్‌లో డెలివరీ చేయించటం వంటివి క్రమం తప్పకుండా చేయాలి. ఇవి కాకుండా పీహెచ్‌సీల నుంచి వివిధ రకాల వ్యాక్సిన్లను తీసుకుని పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఆ బిడ్డకు 16 సంవత్సరాలు వచ్చే వరకు ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడే విధులు నిర్వహించాల్సి ఉంది. ఫ్యామిలీ ప్లానింగ్, ఇంటింటికీ తిరిగి ప్రజల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవటం, తల్లీ బిడ్డలను కాపాడటం వంటివి చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఏఎన్‌ఎంలు రోజువారీగా యూ - విన్, ఆర్‌సీహెచ్, అన్మోల్, హెచ్‌ఎంఐఎస్, ఐహెచ్‌ఎంపీ, ఏఎంబీ, వెక్టార్ హైజీన్, ఎన్‌టీఆర్ వైద్యసేవ, ఫ్రైడే డ్రైడే, గర్భవతులకు ఆర్‌సీహెచ్ ఐడీ, బర్త్ ప్లానింగ్, ఎఫ్‌డీపీ, ఎన్‌సీడీసీడీ 3.0, ఆర్‌బీఎస్‌కే, వీహెచ్‌ఎన్‌డీ, వీహెచ్‌ఎస్‌ఎన్‌సీ, టీబీ కేసులు, లెప్రసీ కేసులు, నెల వారీ రిపోర్టులు, అభా ఐడీలను రూపొందించటం, పీఎంజేఏవై వంటి కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంటుంది.
కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేదాయె..
కార్పొరేషన్ అధికారులు సంబంఽధం లేని అదనపు బాధ్యతలను మోపటంతో ఏఎన్‌ఎంలు కలెక్టర్‌ను కలిసి తమ గోడు చెప్పుకున్నారు. ఆయన నుంచి సానుకూలంగా స్పందన రాకపోవటంతో ఆందోళన చెందుతున్నారు.