KCR Criticizes Congress: కాంగ్రెసుది వింత పాలన
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:49 AM
కేసీఆర్ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ, ప్రజల పట్ల అన్యాయంగా వ్యవహరించినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన, బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం 10 లక్షల మందిని వరంగల్‌లో పాల్గొనాలని సూచించారు.

ఇబ్బందుల్లో అన్ని వర్గాల ప్రజలు
మార్పు కోరుకున్న రైతులకు కన్నీళ్లే
ఈ దుస్థితిని కలలో కూడా ఊహించలేదు
10 లక్షల మందితో వరంగల్‌లో భారీ సభ: కేసీఆర్
గజ్వేల్/మర్కుక్/హైదరాబాద్/వరంగల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వింతగా ఉందని, అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. మార్పు కోరుకున్న రైతులకు కన్నీళ్లే మిగిలాయని, వారికి ఈ దుస్థితి వస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలంతా మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు స్పందించాలని, ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆ జిల్లా నేతలు, పార్టీ ముఖ్యులతో మంగళవారం ఎర్రవెల్లిలోని తన ఫాంహౌ్‌సలో కేసీఆర్ సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని, బహిరంగ సభకు వారు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. 10 లక్షల మంది పాల్గొనేలా విస్తృత ఏర్పాటు చేయాలని సూచించారు. ఎల్కతుర్తిలో బహిరంగ సభ కోసం గుర్తించిన స్థలంలో బుధవారం మధ్యాహ్నం భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. ఎండాకాలం కావడంతో సభకు హాజరయ్యే వారికి చిన్నపాటి ఇబ్బంది కూడా కలగకుండా చూడాలన్నారు. ఈ మేరకు 10 లక్షల చొప్పున మజ్జిగ ప్యాకెట్లు, నీళ్ల బాటిళ్లు అందుబాటులో ఉంచాలని, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా 1500 మంది వాలంటీర్లను నియమించాలని, అత్యవసర వైద్య సేవలు, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సందర్భంగా మార్చి 28న ‘ఆంధ్రజ్యోతి’ వరంగల్ జిల్లా సంచికలో ‘గడబిడల గులాబీ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై సమావేశంలో ప్రస్తావన వచ్చింది. దీంతో పార్టీలో విభేదాలను పక్కన పెట్టాలని జిల్లా నేతలకు కేసీఆర్ సూచించారు.
154 ఎకరాల్లో సభా ప్రాంగణం..
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని, ఎల్కతుర్తి వద్ద ఎంపిక చేసిన చోట సభా ప్రాంగణం మొత్తం 154 ఎకరాల్లో ఉంటుందని వరంగల్ జిల్లా నేతలు తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలను కలిపే జాతీయ రహదారి 563, 763కు జంక్షన్ ను కేంద్రంగా చేసుకొని స్థలాన్ని ఎంచుకున్నామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశం మేరకు అక్కడ 1,213 ఎకరాలను చదును చేశామని, ఇందులో 154 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ ప్రాంగణం ఉంటుందని వివరించారు. 50 వేల వాహనాలు నిలిపేందుకు వీలుగా 1,059 ఎకరాల స్థలంలో పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యమ సమయంలో అనేక భారీ సభలను సమరంగా నిర్వహించి విజయవంతం చేశామని, వరంగల్‌లో సభ నిర్వహణ తమ పార్టీకి కలిసొచ్చే అంశమని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News