YS Jagan: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:40 PM
YS Jagan: మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలుతామన్నారు. వైసీపీ బతుకుతుందన్నారు.

అమరావతి, ఫిబ్రవరి 05: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతోందని.. ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు ఏలుతోందని ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ జోస్యం చెప్పారు. అయితే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బెదిరిస్తారు.. దొంగ కేసులు పెడతారు.. అలాగే జైల్లో సైతం పెడతారని.. అయినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మీకు మంచి చేసిన వారినీ.. అలాగే చెడు చేసిన వారినీ.. ఇద్దరినీ గుర్తుపెట్టుకొండంటూ పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా వైఎస్ జగన్ కీలక సూచన చేశారు.
బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్ధలోని వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముఖ్య నాయకులతో మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఒక్కటే గుర్తు పెట్టుకొండంటూ పార్టీ కేడర్‌కు ఆయన కీలక సూచనలు చేశారు. ఈ జగన్ 2.0 వేరుగా ఉంటుందన్నారు. ఈసారి కార్యకర్తల కోసం జగన్ ఏం చేస్తాడో చూపిస్తాని తెలిపారు. గతంలో పార్టీ శ్రేణులకు అధిక ప్రాధాన్యత ఇవ్వ లేకపోయానని చెప్పారు.
అయితే పార్టీలోని కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టమని వైఎస్ జగన్ హెచ్చరించారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని స్పష్టం చేశారు. వారిని చట్టం ముందు నిలబెడతాంటూ వారికి వైఎస్ జగన్ భరోసా కల్పించారు.
గత జగన్ ప్రభుత్వ హాయంలో కార్యకర్తలకు అంత గొప్పగా చేయ లేక పోయిండవచ్చు.. కానీ ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకు వచ్చారని.. వారి కోసమే తాను తాపత్రయపడ్డానని ఈ సందర్భంగా ఆయన వివరించారు. వారి కోసమే తన టైం కేటాయించానని.. ప్రజల కోసమే అడుగులు వేశానన్నారు. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు.. మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులు చూశానన్నారు. అలాగే కార్యకర్తల బాధలను సైతం గమనించానని చెప్పారు. వారి అవస్ధలను సైతం చూశానని.. వీళ్ల కోసం అండగా ఉంటాడని ఈ సందర్భంగా వైఎస్ జగన్ స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు నడుపుతున్నారన్నారు.
Also Read: డ్రగ్స్ పెడ్లర్లు అరెస్ట్.. షూటర్ల కోసం గాలింపు
2024, మే, జూన్ మాసాల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో కూటమి 164 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. దీంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం దక్కలేదు. అయినా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ స్పీకర్‌కు లేఖ రాశారు.
Also Read : కడప జిల్లాలో క్లబ్ మూసివేసిన పోలీసులు
సంఖ్య బలం లేకుండా ఆ హోదా ఇవ్వడం సాధ్యం కాదంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించే వరకు తనతోపాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీలో అడుగు పెట్టమని వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కేటాయించాలంటూ వైఎస్ జగన్.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం విధితమే.
Also Read: మిర్చి బోర్డు ఏర్పాటు చేయండి: ప్రత్తిపాటి డిమాండ్
ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొంది. దీంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేశారు. అదీకూడా ప్రతిపక్ష నేతగా రాజధాని అమరావతికి మద్దతు ప్రకటించిన ఆయన.. సీఎం కాగానే మాటతప్పి మడం తిప్పేశారు. సీఎంగా వైఎస్ జగన్.. కేవలం సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. రాష్ట్రాభివృద్ధిని వదిలేశారు. దీంతో రహదారుల పూర్తి అధ్వాన స్థితిలోకి చేరాయి. రాష్ట్రానికి పరిశ్రమలు సైతం రాలేదు. ఇక ఏపీలో ఉన్న పరిశ్రమలు సైతం పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2024లో జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమిలోని పార్టీలకు పట్టం కట్టిన సంగతి తెలిసిందే.
For AndhraPradesh News And Telugu News