ఉక్కు దిగుమతులపై 12% సుంకం!
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:49 AM
దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని స్టీల్ ఉత్పత్తులపై 200 రోజులపాటు 12 శాతం తాత్కాలిక రక్షణ సుంకం విధించాలని...

కేంద్ర వాణిజ్య శాఖ సిఫారసు
న్యూఢిల్లీ: దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు విదేశాల నుంచి దిగుమతయ్యే కొన్ని స్టీల్ ఉత్పత్తులపై 200 రోజులపాటు 12 శాతం తాత్కాలిక రక్షణ సుంకం విధించాలని కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన దర్యాప్తు విభాగం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమిడీ్‌స (డీజీటీఆర్) సిఫారసు చేసింది. పలు పరిశ్రమల్లో ఉపయోగించే నాన్ అల్లాయ్, అల్లాయ్ స్టీల్ ఫ్లాట్ ఉత్పత్తుల దిగుమతులు ఒక్కసారిగా పెరగడంతో ఇండియన్ స్టీల్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు గత ఏడాది డిసెంబరులో డీజీటీఆర్ దర్యా ప్తు ప్రారంభించింది. ఈ ఉత్పత్తుల దిగుమతు లు ఆకస్మికంగా, వేగం గా పెరిగాయని, ఇది దేశీయ స్టీల్ తయారీదారులకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని డీజీటీఆర్ ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
దేశీయ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు విదేశాల నుంచి దిగుమతి అవుతున్న స్టీల్ ఉత్పత్తులపై 12 శాతం సుంకం విధించాలని ఈనెల 18న జారీ చేసిన నోటిఫికేషన్‌లో డీజీటీఆర్ సిఫారసు చేసింది. ఈ ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది.
స్టీల్ స్టాక్స్ జూమ్: ఈ ప్రతిపాదనతో బుధవారం స్టీల్ రంగ కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. ఎన్‌ఎండీసీ షేరు ఏకంగా 6.88 శాతం ఎగబాకింది. సెయిల్ 3.99 శాతం, టాటా స్టీల్ 2.52 శాతం, జేఎ్‌సడబ్ల్యూ స్టీల్ 1.33 శాతం, జిందాల్ స్టెయిల్‌నెస్ 1.15 శాతం, జిందాల్ స్టీల్ అండ్ పవర్ 0.25 శాతం పెరిగాయి.