టెక్ నైపుణ్యాలకు అడ్డా భారత్
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:23 AM
అత్యున్నత టెక్ నైపుణ్యాలకు భారత్ ప్రధాన కేంద్రం (హబ్)గా ఎదిగిందని ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ అన్నారు...

టెక్ ప్రభావం లేని పరిశ్రమ లేదు.. ఎవరికైనా మనమే కీలక భాగస్వాములం
ప్రపంచ సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో 23 శాతం మనోళ్లే
నాస్కామ్ చీఫ్ రాజేశ్ నంబియార్
న్యూఢిల్లీ: అత్యున్నత టెక్ నైపుణ్యాలకు భారత్ ప్రధాన కేంద్రం (హబ్)గా ఎదిగిందని ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నాస్కామ్ సంస్థ జాతీయ అధ్యక్షుడు రాజేశ్ నంబియార్ అన్నారు. ఈ కారణంగానే టెక్నాలజీ రంగంలో మన దేశం అనేక ప్రముఖ ప్రపంచ కంపెనీలకు ప్రాధాన్యతా బాగస్వామిగా ఎదిగిందన్నారు. నాస్కా మ్ నిర్వహిస్తున్న ‘గ్లోబల్ కన్‌ఫ్లూయెన్స్- 2025 సదస్సులో ఆయన ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుత ప్రపంచ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) నిపుణుల్లో 28 శాతం, సాఫ్ట్‌వేర్ నిపుణుల్లో 23 శాతం మన దేశంలోనే ఉన్న విషయాన్ని నంబియార్ గుర్తు చేశారు. గతంలో ఎన్నడూ లేనంత బలంగా, టెక్నాలజీ ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను మార్చివేస్తోందన్నారు. సాంకేతిక మార్పుల ప్రభావం లేని పరిశ్రమగానీ, దేశంగానీ ప్రస్తుతం లేవన్నారు. ఈ మార్పులతో ఏర్పడే సవాళ్లు, అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అత్యున్నత నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోందని నంబియార్ తెలిపారు.
రూ.24 లక్షల కోట్ల టర్నోవర్
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 25,400 కోట్ల డాలర్ల టర్నోవర్ నమోదు చేసిన భారత ఐటీ పరిశ్రమ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో దాదాపు 28,300 కోట్ల డాలర్ల (సుమారు రూ.24.43 లక్షల కోట్లు) టర్నోవర్ నమోదు చేసే అవకాశం ఉందని నంబియార్ తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా ఇది 30,000 కోట్ల డాలర్లు మించిపోతుందన్నారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ కూడా మన దేశంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న విషయాన్ని గుర్తు చేశారు. 2030 నాటికి మనజీడిపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వాటా లక్ష కోట్ల డాలర్లు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.86.36 లక్షల కోట్లు) మించిపోనుందని నాస్కామ్ చీఫ్ తెలిపారు. ప్రస్తుతం దాదాపు 58 లక్షల ఉద్యోగులున్న ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల కల్పన ముందు ముందూ కొనసాగుతుందన్నారు. దేశంలో పెరుగుతున్న స్టార్ట్‌పలు, జీసీసీలు ఇందుకు మరింత దోహదం చేస్తాయన్నారు. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్‌లోనూ మన దేశానికి మంచి భవిష్యత్ ఉందన్నారు.
Also Read:
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
For Business News And Telugu News