Bigbasket IPO: బిగ్ బాస్కెట్ బిగ్ టార్గెట్.. త్వరలో ఐపీఓకు, ఫుడ్ డెలివరీ విభాగంలోకి ఎంట్రీ..
ABN , Publish Date - Mar 01 , 2025 | 02:49 PM
రాబోయే రోజుల్లో బిగ్ బాస్కెట్‌ను మరింతగా విస్తరించాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. క్విక్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు కంపెనీ సీఈఓ హరిమీనన్ తెలిపారు. అలాగే రాబోయే రెండేళ్లలో ఐపీఓకు రావాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు.

టాటా సన్స్ ఆధ్వర్యంలో నడస్తున్న క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్ బాస్కెట్ (Bigbasket) నిత్యావసర వస్తువుల నుంచి యాపిల్ ఐఫోన్ల వరకు అనేక వస్తువులను నిమిషాల్లోనే డెలివరీ చేస్తూ వినియోగదారులకు నమ్మకమైన సర్వీసులను అందిస్తోంది. రాబోయే రోజుల్లో బిగ్ బాస్కెట్‌ను మరింతగా విస్తరించాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. క్విక్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు కంపెనీ సీఈఓ హరిమీనన్ తెలిపారు. అలాగే రాబోయే రెండేళ్లలో ఐపీఓకు రావాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు (Bigbasket IPO).
తాజాగా ముంబైలో జరిగిన రిటైల్ సమ్మిట్‌లో హరి మీనన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కంపెనీ లక్ష్యాలను గురించి వివరించారు. 2026 మార్చి నాటికి అంటే మరో ఏడాదిలో బిగ్ బాస్కెట్ వ్యాపారాన్ని రెట్టింపు చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసినట్టుగా ఆయన తెలిపారు. ప్రస్తుతం బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా 35 నగరాల్లో సేవలందిస్తోంది. వచ్చే ఏడాదికి 70 నగరాల్లో బిగ్‌బాస్కెట్ తన సేవలను అందించబోతోంది. అలాగే రానున్న 18 నుంచి 24 నెలల్లో బిగ్‌బాస్కెట్ ఐపీఓకు కూడా వస్తుందని హరిమీనన్ తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో జొమాటో-బ్లింకిట్, స్విగ్గీ-ఇన్‌స్టామార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో దూసుకుపోతున్నాయి. మహా నగరాల్లో కేవలం 10 నిమిషాల్లోనే ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేస్తున్నాయి. త్వరలో బిగ్‌బాస్కెట్ కూడా ఆయా విభాగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించాలని భావిస్తోంది. దేశీయ క్విక్ కామర్స్ పరిశ్రమ రాబోయే రోజుల్లో మరింత వృద్ధి చెందుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో బిగ్‌బాస్కెట్ కూడా తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..