జీసీసీ ఉద్యోగులకు జీతాల జోష్
ABN , Publish Date - Mar 20 , 2025 | 03:52 AM
వచ్చే ఏడాది కాలంలో దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) వేతనాలు 9.8 శాతం మేర పెరగవచ్చని డిజిటల్ నైపుణ్య పరిష్కారాల సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ తాజా నివేదిక అంచనా వేసింది....

వచ్చే ఏడాది కాలంలో 9.8% వేతన వృద్ధి
ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నిపుణులకు గరిష్ఠం
హైదరాబాద్, ముంబై కేంద్రాలు టాప్ పేయర్స్
ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ నివేదికలో వెల్లడి
ముంబై: వచ్చే ఏడాది కాలంలో దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) వేతనాలు 9.8 శాతం మేర పెరగవచ్చని డిజిటల్ నైపుణ్య పరిష్కారాల సంస్థ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ తాజా నివేదిక అంచనా వేసింది. ఉద్యోగుల వేతనాలు, వృద్ధిలో జీసీసీలు సంప్రదాయ ఐటీ కంపెనీలను మించిపోయాయని పేర్కొంది. 2030 వరకు జీసీసీల రంగం వేతనాల్లో 9-12 శాతం సంచిత వృద్ధిని నమోదు చేయనుందని అంచనా వేసింది. ‘‘ప్రపంచవ్యాప్త జీసీసీల్లో 55 శాతానికి పైగా భారత్‌లోనే ఉన్నాయి. 2030 నాటికి జీసీసీల మార్కెట్ సైజు 11,000 కోట్ల డాలర్లకు చేరవచ్చని అంచనా. క్రియాశీలత, వ్యయ దక్షత, భారీ సంఖ్యలో నిపుణులను కోరుకునే సంస్థలకిప్పుడు జీసీసీలు కీలక కేంద్రాలుగా మారాయి. జీసీసీలు వేగంగా వృద్ధి చెందుతుండటంతో వాటిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారు ఇదివరకంటే అధిక వేతన పెంపు డిమాండ్ చేయగలుగుతున్నారు’’ అని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ సీఈఓ సచిన్ అలుగ్ అన్నారు. దేశంలోని 6 నగరాల్లోని 10 రంగాలకు చెందిన 207 జీసీసీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది.
హైదరాబాద్, ముంబైలోని జీసీసీలు అధిక జీతాలు చెల్లిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సాఫ్ట్‌వేర్ అండ్ కన్సల్టింగ్, బ్యాంకింగ్/ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల జీసీసీలు భారీ జీతాలు ఆఫర్ చేస్తున్నాయి. ఢిల్లీ/ఎన్‌సీఆర్, బెంగళూరులో బలమైన పోటీతత్వం కనబరిచాయి. కాగా, టెలికాం, ఇంటర్నెట్ సేవల విభాగాల్లో సమానత్వం కనిపించింది.
కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్య రంగాల్లో డిమాండ్ కారణంగా జూనియర్, మధ్య స్థాయి సిబ్బంది వేతనాలు అధికంగా వృద్ధి చెందనున్నాయి. కంపెనీలు నాయకత్వ పదవుల్లో వ్యయ దక్షతకు ప్రాధాన్యం ఇస్తున్న కారణంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల వేతనాలు మాత్రం స్వల్పంగా వృద్ధి చెందనున్నాయి.
జీసీసీలు ప్రత్యేక నైపుణ్యాలకు ప్రాధాన్యమిస్తున్నా యి. అది వేతన చెల్లింపుల్లోనూ ప్రతిబింబిస్తుంది. ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ నిపుణులు సంప్రదాయ ఐటీ నిపుణుల కంటే 30-50 శాతం అధికంగా వేతనం అందుకుంటున్నారు. జనరేటివ్ ఏఐ, హైబ్రిడ్ క్లౌడ్ వినియోగం పెరగడంతో క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు, ప్రొడక్ట్ డిజైనర్లకు భారీ జీతాలు లభిస్తున్నాయి.
నాలుగో తరం పారిశ్రామిక రంగాల్లో ఫౌండేషనల్ డిజిటల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్లకు మిగతా వారికంటే 20-50 శాతం అధిక వేతనం లభిస్తోంది. కాగా, కంపెనీల్లో డేటా భద్రత కీలకంగా మారుతున్న తరుణంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల జీతం రెండంకెల్లో వృద్ధి చెందనుంది.
జీసీసీలు కేవలం ఐటీ సేవల రంగానికే పరిమితం కావడం లేదు. ప్రస్తుతం ఆర్థిక సేవల రంగానికి చెందిన జీసీసీలు ముందంజలో ఉన్నాయి. వీటిల్లో ఎంట్రీ లెవెల్ ఉద్యోగుల వార్షిక వేతనం రూ.6-12 లక్షల స్థాయిలో ఉంటోంది. మధ్య స్థాయి ఉద్యోగులు రూ.18-35 లక్షలు, సీనియర్ అధికారులు రూ.45-90 లక్షల వార్షిక జీతం అందుకుంటున్నారు. ప్రతిభ కలిగిన వారిని కాపాడుకోవడంతోపాటు నాయకుల అభివృద్ధిపై జీసీసీలు గట్టిగా దృష్టిసారించాయనడానికి ఇది నిదర్శనం.