Ugadi 2025 Horoscope: ఉగాది నుంచి ఈ రాశుల వారికి పట్టిందంతా బంగారమే
ABN , Publish Date - Mar 28 , 2025 | 07:07 PM
ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉగాది పండుగ జరగనుంది. శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం నుంచి కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలుగనున్నాయి. అన్ని రకాలుగా వారికి రాజయోగం పట్టనుంది. విద్య, ఉద్యోగం, వివాహం, బిజినెస్ వంటి విషయాల్లో పట్టిందల్లా బంగారం అవుతుంది.

శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం మార్చి 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఉగాది పండుగ జరగనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొన్ని రాశుల వారి జీవితం అద్భుతంగా మారనుందని జ్యోతిష్క శాస్త్ర నిపుణులు అంటున్నారు. జీవితంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాలు ఓ కొలిక్కి వస్తాయని హామీ ఇస్తున్నారు. కొత్త ఏడాది కొత్త అనుభవాలతో వారి జీవితం ఆనందమయం కానుందని చెబుతున్నారు. వ్యక్తిగత జీవితంతో పాటు, వృత్తిపరంగా కూడా లాభపడే అవకాశం ఉందంటున్నారు. మొత్తం ఐదు రాశుల వారికి మంచి రోజులు రానున్నాయట. మరి, ఉగాది నుంచి మహర్థశ మొదలవ్వనున్న ఆ ఐదు రాశుల వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభం
మార్చి 30వ తేదీనుంచి ఈ రాశి వారిపై శని ప్రభావం తగ్గుతుంది. వీరికి ఏ పనిలో అయినా విజయం లభిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఊహించని విధంగా ధనలాభం కలుగుతుంది. వృత్తి పరంగా.. ఆర్థికపరంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. స్థల తాగాదాలు ఉంటే అవి తీరిపోతాయి. వివాహ బంధంలోనూ సామరస్యం పెరిగి.. భార్యాభర్తలు సంతోషంగా జీవిస్తారు. ప్రేమ విషయంలోనూ సానుకూల పవనాలు వీస్తాయి. పెళ్లి విషయంలోనూ కలిసి వస్తుంది. ధనవంతులైన భాగస్వాములు జీవితంలోకి వస్తారు. తరచుగా సుందరాకాండ చదువుతూ ఉంటే మరింత మంచి జరుగుతుంది.
మిథునం
ఈ రాశి వారికి శని పదవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు. ఉగాదినుంచి వీరికి అన్ని విషయాల్లో తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్న వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఉన్నతాధికారుల నుంచి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కొత్త సంవత్సరం నుంచి ఆదాయం కూడా పెరుగుతుంది. ఆర్థికపరంగా పుంజుకుంటారు. ప్రేమలు ఫలిస్తాయి. వివాహ బంధాలు బలపడతాయి. ప్రతీ రోజూ సుబ్రమణ్య స్వామి శ్లోకం పఠించటం వల్ల మరింత మంచి జరుగుతుంది.
కర్కాటకం
ఉగాది నుంచి ఈ రాశి వారి జీవితంలోని కష్టనష్టాలన్నీ తొలగిపోతాయి. అసంపూర్తిగా నిలిచిపోయిన పనులు చకచకా జరుగుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. అయితే, మే నుంచి ఆర్థికపరంగా కొంచెం ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. ఈ ఒక్క విషయంలో తప్పితే అన్నిటిపరంగా మంచి జరుగుతుంది. ఉద్యోగం, బిజినెస్, వివాహం సంబంధ విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ప్రతీ రోజూ ఆధిత్య హృదయం చదవటం వల్ల మరింత మంచి జరుగుతుంది.
కన్య
ఉగాది నుంచి ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే అని చెప్పొచ్చు. వీరికి అన్ని రకాలుగా లాభం కలుగనుంది. వృత్తి జీవితంలోనూ మంచి రోజులు రానున్నాయి. ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉంది. తలపెట్టిన పనుల్లో విజయాలకే ఎక్కువ అవకాశం ఉంటుంది.
కుంభం
కుంభరాశి వారికి కూడా కొత్త సంవత్సరంనుంచి మంచి రోజులు రానున్నాయి. ఆర్థికపరంగా జీవితం మెరుగుపడుతుంది. ఇచ్చిన అప్పులు తిరిగి వస్తాయి. మధ్యలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితం కూడా బాగుటుంది. బిజినెస్‌లో అభివృద్ధి సాధ్యం అవుతుంది. కలహాలు తీరిపోయి.. దాంపత్య జీవితం కూడా సాఫీగా సాగుతుంది.
గమనిక: పైన తెలిపిన సమాచారాన్ని ABN Andhrajyoty నిర్ధారించడం లేదు. కొందరి విశ్వాసాల ఆధారంగా రాసిన కథనం మాత్రమే. దీనికి, ABN Andhrajyotyకి ఎలాంటి సంబంధం లేదు.
ఇవి కూడా చదవండి:
Ugadi 2025: ఉగాది రోజు ఇవి తింటే మహా పాపం.. అవేంటంటే