తెలుగు బొమ్మలో తెలంగాణ శోభ
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:51 AM
‘నా పల్లె నా కాన్వాసు, నా ప్రజలే నా వస్తువు, వాళ్ల జీవనమే నా ప్రేరణ, ఈ ప్రకృతే నాకు గురువు, నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, విశ్వయవనిక మీద ఆవిష్కరించడమే నా లక్ష్యం’– 1945లో హైదరాబాద్‌లో ఒక చిత్రకళా ప్రదర్శనలో...

‘నా పల్లె నా కాన్వాసు, నా ప్రజలే నా వస్తువు, వాళ్ల జీవనమే నా ప్రేరణ, ఈ ప్రకృతే నాకు గురువు, నా సమాజాన్ని, సంస్కృతిని, దేశాన్ని, విశ్వయవనిక మీద ఆవిష్కరించడమే నా లక్ష్యం’– 1945లో హైదరాబాద్‌లో ఒక చిత్రకళా ప్రదర్శనలో యువ రాజయ్య వ్యక్తం చేసిన మనోరథమది. ఆ మాటలను ఆయన తదనంతర జీవితమంతా నిజం చేసి చూపించారు. తెలంగాణ సంస్కృతి అన్నా, జీవనశైలి అన్నా, సంప్రదాయం అన్నా, బోనాలన్నా, బతుకమ్మ అన్నా మున్ముందుగా గుర్తుకు వచ్చేది రాజయ్య జానపద చిత్ర రాజాలే.
జానపద చిత్రాలను సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలతో చిత్రిస్తారు. రాజయ్య మాత్రం అందుకు పూర్తి భిన్నంగా తెలంగాణ తెలుగు సంస్కృతిని, కాన్వాస్‌పై ప్రాథమిక రంగుల్లో ఆవిష్కరించారు. స్వస్థలమైన సిద్దిపేట గ్రామీణులు, వారి వృత్తులు, ఉత్సవాలు, పండుగలకు సమకాలీనతను తన చిత్రాల్లో చూపించారు. తెలంగాణ సంస్కృతిని తన చిత్రాలతో విశ్వవ్యాప్తం చేశారు. రాజయ్య అంటే తెలంగాణ చిత్రం, తెలంగాణ అంటే రాజయ్య అనే విధంగా ఆయన సృజన వర్ధిల్లింది.
సిద్దిపేటలో ఒక నిరుపేద కుటుంబంలో 1925, ఏప్రిల్ 7న జన్మించిన రాజయ్య చిన్నతనంలో మట్టి ముద్దలతో బాతులు, ఎద్దులు వంటి బొమ్మలు చేసేవారు. పాఠశాలలో 7వ తరగతి చదివేటప్పుడు రాజయ్యను ఒక టీచర్ బాంబే ప్రభుత్వం నిర్వహించే ఇంటర్మీడియట్ డ్రాయింగ్ పరీక్షలకు పంపించారు. తర్వాత కుబేరుడు అనే డ్రాయింగ్ టీచర్ హైదరాబాద్‌లో ఉన్న సెంట్రల్ స్కూల్ అఫ్ ఆర్ట్, క్రాఫ్ట్‌లలో ఐదేళ్ల పెయింటింగ్ డిప్లొమాలో చేర్పించారు.
సంగారెడ్డి మిడిల్ పాఠశాలలో 1947లో రాజయ్య డ్రాయింగ్ టీచర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. చిత్రకళ పట్ల ఆసక్తి చూపిన వారిని డ్రాయింగ్ పరీక్షలకు పంపి వారిని చిత్రకారులుగా, చిత్రకళోపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ఆయన చిత్రరచన ప్రధానంగా మూడు దశలుగా జరిగింది. ప్రారంభంలో చిత్రకళ నేర్చుకున్నప్పుడు అందరిలా కాగితాలపై వాష్ టెక్నిక్‌లో చిత్రాలు గీశారు. 1960 నుంచి టెంపరరీ రంగులు అలవాటు చేసుకున్నారు. 1970 నుంచి అంతర్జాతీయ మీడియం అయిన నూనె రంగులు వాడకం ప్రారంభించారు. రాజయ్య చిత్రరచన ఏ మీడియంలో కొనసాగినా తన సంస్కృతిని, మూలాల్ని మర్చిపోలేదు. పేపర్లు, రంగులు మార్చారు గాని భావం, చిత్రీకరణలను, తనదైన జానపదాన్ని వీడలేదు. అదేవిధంగా నీటి రంగుల నుంచి నూనె రంగులకు మారినా ప్రాథమిక రంగులే కొనసాగించారు. రంగుల శోభ, లావణ్యం, మృదుత్వం, సహజత్వం ఆయన ప్రత్యేకత. వెలుగు నీడలు ఆయన చిత్రాల్లో ఉండవు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో విరివిగా సంచరించడం, పల్లె ప్రజల జీవనశైలిని సన్నిహితంగా పరిశీలించడం వల్ల రాజయ్య చిత్రాల్లో సహజత్వం కనబడుతుంది. ఆయన చిత్రాలు చూస్తే తెలంగాణ పల్లెలో ఉన్న అనుభూతి కలుగుతుంది. పెళ్ళి వేడుకలకు సంబంధించిన చిత్రాలు ఆయన సూక్ష్మ పరిశీలనకు నిలువెత్తు నిదర్శనం. ‘నా చిత్రకళకు పట చిత్రకళే ప్రేరణ’ అని ఆయన తరచు చెప్పేవారు.. రాజయ్య సృజించిన ‘బోనాలు’ ముఖచిత్రంగా ప్రతిష్ఠాత్మక బ్రిటిష్ మ్యాగజైన్ ‘స్టూడియో లండన్’ ఒకసారి వెలువడింది. ఆ సంచికలో ప్రముఖ చిత్రకళా విమర్శకులు ఎ.ఎస్. రామన్ రాజయ్య చిత్రకళ విశిష్టత గురించి ఒక విపుల వ్యాసం రాశారు. ‘దేశ కాలాపేక్ష లేని, శాశ్వతమైన, సార్వజనీనమైన, లోకంలో ఏ శక్తి అంతరింప చేయలేని, నిత్య నూతన సౌందర్యం కోసం అన్వేషిస్తున్న రాజయ్యకు తన చుట్టూవున్న జానపద రూపాల్లోనూ, జాతీయాల్లోనూ అలాంటి శాశ్వత సౌందర్యం సాక్షాత్కరించింది’ అని రామన్ ప్రశంసించారు.
రాజయ్య చిత్రించిన చిత్రాల్లో బతుకమ్మ, పంటపొలాలు, శ్రమజీవులు, రిస్కీలైఫ్, ముస్తాబు, నీలి భాగవతం, అంపశయ్యపై భీష్ముడు, జీవాత్మ పరమాత్మ వైపు తదితరాలు ఆయనకు అత్యంత ఇష్టమైనవిగా చెప్పుకున్నారు. వేంకటేశ్వర స్వామిపై ఆయన పాతికకు పైగా చిత్రాలు సృజించారు. రిస్కీలైఫ్ చిత్రానికి జాతీయ అవార్డు లభించింది. సిద్దిపేటలోనే ఆయన మూడున్నర దశాబ్దాల పాటు చిత్రకళోపాధ్యాయుడుగా పనిచేశారు. 1963లో లలితకళా సమితిని ఏర్పాటు చేసి రాష్ట్ర, జాతీయ స్ధాయిలో చిత్రకళా పోటీలు, ప్రదర్శనలు నిర్వహించి, ఔత్సాహికుల్ని విరివిగా ప్రోత్సహించారు. 1956–88 సంవత్సరాల మధ్య హంగేరీ, బల్గేరియా, రొమేనియా, చెక్‌స్లోవేకియా, ఆస్ట్రేలియా, క్యూబా, మెక్సికో, రష్యా, ఇటలీ, బ్రిటన్ తదితర దేశాలలో నిర్వహించిన ఆయన చిత్రకళా ప్రదర్శనలు కళాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
రాజయ్య సృజన జీవన వ్యాసంగాలు తెలంగాణాకు మాత్రమే పరిమితం కాలేదు. విశాఖ, అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, వెల్లటూరు తదితర ప్రాంతాలలో జరిగే చిత్రకళా ప్రదర్శనలకు హాజరై యువ, బాల చిత్రకారులను ప్రోత్సహించేవారు. కేంద్ర లలితకళా అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా రాజయ్య మా విశాఖ చిత్రకళా పరిషత్‌కు సహాయ సహకారాలు అందించారు. పరిషత్ పునరుద్ధరణకు, ఇంకా చిత్రకళా రత్నాలు, చిత్రకళా చరిత్ర, వడ్డాది పాపయ్య, దామెర్ల రామారావు తదితర గ్రంథాల ముద్రణకు, సింహాచలం, భీమిలి, కోణార్క్ తదితర ప్రాంతాలలో వర్కుషాపుల నిర్వహణకు లలితకళా అకాడమీ గ్రాంట్లు ఇప్పించడానికి సహకరించారు. ‘కుంచెపదాలు’ కవిగా ఆయన కవిలోకంలో కూడా ప్రసిద్ధులు. 2013లో 9వ తరగతి తెలుగు ఉపవాచకంలో స్ఫూర్తిదాతలు పేరిట ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు. 1978లో ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ వీరి కళాజీవితాన్ని మోనోగ్రాఫ్‌గా ప్రచురించింది.. సిద్దిపేట ప్రజలు 2019లో తమ ఊరికి గర్వకారణమైన రాజయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పట్ల తమ గౌరవాదరాలు చాటుకున్నారు. రాజయ్య 2012, ఆగస్టు 20న తన 87వ ఏట మరణించారు. ఆయన కళాకృతులు జాతి ఆస్తులు. వాటిని సేకరించి భద్రపరచాలి.
సుంకర చలపతిరావు
(ఏప్రిల్ 7: కాపు రాజయ్య శతజయంతి)
ఇవి కూడా చదవండి..
Amit Shah: ఆయుధాలు వీడండి.. మావోయిస్టులకు అమిత్‌షా పిలుపు
Cash Row: అలహాబాద్ హైకోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ వర్మ
Chennai: రేపు ప్రధాని మోదీతో ఈపీఎస్, ఓపీఎస్ భేటీ
Earthquake: పలు దేశాల్లో కంపిస్తోన్న భూమాత.. క్షణ క్షణం.. భయం భయం
For National News And Telugu News