Share News

అభివృద్ధే దక్షిణాదికి శాపమైందనుకోవాలా?

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:23 AM

ఏ దేశానికైనా రాష్ట్రాల సాధికారత చాలా ముఖ్యం. కేంద్రం కింద నలిగిపోకుండా, రాష్ట్రాల మధ్య సమానతను తెచ్చే వ్యవస్థనే సమాఖ్య అంటాము. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగినంత అధికారాలు, నిధులు సమకూర్చాల్సిన ...

అభివృద్ధే దక్షిణాదికి శాపమైందనుకోవాలా?

ఏ దేశానికైనా రాష్ట్రాల సాధికారత చాలా ముఖ్యం. కేంద్రం కింద నలిగిపోకుండా, రాష్ట్రాల మధ్య సమానతను తెచ్చే వ్యవస్థనే సమాఖ్య అంటాము. సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగినంత అధికారాలు, నిధులు సమకూర్చాల్సిన బాధ్యతను కలిగి ఉంటుంది. భారతదేశం కేంద్రీకృత సమాఖ్య రూపంతో పుట్టింది. దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడడానికి రాష్ట్రాలన్నిటికీ కేంద్రం చేసిన చట్టాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం కల్పించారు. కాలక్రమేణా 1980ల తర్వాత జాతీయ పార్టీల మీద అసంతృప్తితో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవి వేగవంతమైన అభివృద్ధి కోసం తమదైన నమూనాలు తెచ్చాయి. దరిమిలా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి వేగవంతమైంది. అభివృద్ధి పెరిగిన కొద్దీ ప్రభుత్వాల మీద ఇంకా బాధ్యత పెరుగుతుందని జర్మన్ ఆర్థికవేత్త అడాల్ఫ్ వాగ్నర్ చెప్పినట్టు, ప్రభుత్వాల బడ్జెట్లు కూడా పెరిగాయి. ఈ పరిస్థితిలో రాష్ట్రాలకు నిధుల కొరత సమస్యగా మారింది. ప్రధానంగా, సమాఖ్య నిబంధనల ప్రకారం, దక్షిణాది రాష్ట్రాల నుంచి వచ్చిన పన్ను ఆదాయం దేశంలో ఉన్న వెనుకబడిన రాష్ట్రాలకు తరలిపోవడం వివాదాలకు కారణం అయింది.


డిలిమిటేషన్ ప్రమాదం కూడా ముందుకు రావడంతో సమాఖ్య వివాదాలు ఇప్పుడు ప్రముఖంగా ముందుకొచ్చాయి. మొదటి యాభై ఏళ్ళు దేశంలోని మొత్తం రాబడిలో కేంద్రానికి 70శాతం, అన్ని రాష్ట్రాలకూ కలిపి కేవలం 30 శాతం నిధులు వెళ్ళే లాగా మొదటి 10 ఆర్థిక సంఘాలు నిర్ణయించాయి. అయితే, రాష్ట్రాలకు వినోదం, ఎక్సయిజ్, ప్రాపర్టీ, రిజిస్ట్రేషన్ పన్నులు లాంటి కొన్ని సొంత పన్నులు విధించుకునే అధికారం ఉండేది. ఇవి కాక కేంద్రానికి వెళ్లిన 70శాతం ఆదాయంలో, ఆర్థిక సంఘం నిర్ణయంతో కొన్ని నిధులూ, కేంద్రం తన ప్లానింగ్ కమిషన్ సూచనల ఆధారంగా కొన్ని నిధులు వెనక్కి వచ్చేవి. 1990ల్లో రాష్ట్రాలు ఈ 30 శాతం చాలట్లేదని పోట్లాడాయి. 25 ఏళ్ళ పోరాటం తర్వాత 14వ ఆర్థిక సంఘం దీన్ని 40 శాతానికి పెంచాలని సిఫార్సు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇదిగో చేస్తున్నామని చెప్పింది. తీరా చూస్తే, ఆదాయ పన్నుల మీద, పెట్రోలు మీద 10శాతం సెస్సు, సర్‌చార్జి వాసులు చేసి, దాని వాటా మళ్ళీ 70 శాతానికి తెచ్చుకుంది. జీఎస్టీ విధానం వల్ల రాష్ట్రాలు సొంతంగా పన్నులు నిర్ణయించుకునే అధికారాన్ని కోల్పోయాయి.


కేంద్రం ఉచ్చులో బిగుసుకున్నాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. దీని మీద 15వ సంఘం చేసిన సిఫార్సులు దక్షిణాది రాష్ట్రాలకు శరాఘాతం అయ్యాయి. ఈ సిఫార్సులు రాష్ట్రాల మధ్య నిధులను పంచే ప్రాతిపదికను మార్చాయి. జనాభా, విస్తీర్ణం, వెనుకబాటుతనం, పన్నుల రాబడి పెంచినందుకు ఇన్సెంటివ్, అటవీ భూమి శాతం దామాషాగా రాబడిని రాష్ట్రాలకు పంచుతారు. ఇందులో జనాభా లెక్కకు ప్రాతిపదికగా ఇదివరలో 1991 జనాభా లెక్కలు ఉండగా, దాన్ని 2021 జనాభా లెక్కలకి మార్చారు. దీనితో జనాభాని కంట్రోల్ చేసుకున్న దక్షిణాది రాష్ట్రాలకు భారీ కోత, జనాభా నియంత్రణని గాలికొదిలేసిన రాజస్థాన్, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ లకు విపరీతంగా నిధుల కేటాయింపు పెరిగింది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్ల ఆశ్రిత రాష్ట్రాలకు లాభం చేకూరేలా ఇది చేస్తున్నారని దక్షిణాది రాష్ట్రాల ఆరోపణ. 24 ఉత్తరాది రాష్ట్రాలన్నీ కలిపి 64 శాతం పన్నుల రాబడిని జెనెరేట్ చేస్తే, కేవలం 5 దక్షిణాది రాష్ట్రాలు 36 శాతం పన్నులను సేకరిస్తున్నాయి. కానీ కేవలం 18.6 శాతాన్ని మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు తిరిగి ఇస్తున్నారు. యూపీ, బిహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు తాము ఇచ్చేదానికి సుమారుగా రెట్టింపు మొత్తాన్ని వెనక్కు పొందుతున్నాయి.


ఇక్కడ పలు ప్రశ్నలు వస్తాయి: బలహీనమైన రాష్ట్రాలకు సహాయం చెయ్యడం బాగానే ఉన్నా, వాళ్ళు ఎన్నటికీ ఇదే బలహీనతను ప్రదర్శిస్తారా? ఈ సహాయం వల్ల వారిలో అలసత్వం పెరిగి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా ఉంటున్నారా? ఈ సహాయానికి ఒక కాలపరిమితి అంటూ లేకపోతే, దక్షిణాది రాష్ట్రాల వాటా మీద ఆధారపడి బతకడం మనకు ఒక అలవాటు ఐపోదా? దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి ద్వారా పెంచుకున్న పన్నుల రాబడిని ఉత్తరాది రాష్ట్రాలు తన్నుకుపోతే, ఇక్కడి ఆర్థిక ప్రగతి కుంటుపడదా? సమాఖ్య స్ఫూర్తి కోసం దక్షిణాది రాష్ట్రాలు ఎంత కాలమని ఎంత వరకూ త్యాగం చేయాలి? ఇదిగాక, గ్రాంట్ల కేటాయింపులో కూడా అన్యాయం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాల ఆరోపణ. ఇందులో వాస్తవం లేకపోలేదు. ఉదాహరణకు, ఆయుష్మాన్ భారత్ అనే కేంద్రం నిశ్చయించిన ఆరోగ్య బీమా పథకం కంటే ముందే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న బీమా పథకాలు ఎక్కువ కవరేజ్ కలిగి ఉన్నవి. కానీ, మా పాలసీ తీసుకుంటేనే ఈ గ్రాంటు ఇస్తామని కేంద్రం షరతుపెట్టింది. అది చెయ్యని పక్షాన తెలంగాణకి రూ.2 వేల కోట్లు తిరస్కరించారు. అలాగే జాతీయ విద్యా విధానం అమలు చెయ్యని కారణంగా తమిళనాడుకి సర్వశిక్ష అభియాన్ స్కీము కింద రూ.2.6 వేల కోట్లు నిరాకరించారు. షరతులతో కూడిన గ్రాంట్లు ఇవ్వడం, తిరస్కరించడం ద్వారా కేంద్రం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించకుండా పెద్దన్నలా అధికారాన్ని రుద్దుతున్నది.


అసలు ఈ సెంట్రల్ గ్రాంటులంటూ ఎందుకు, ఈ డబ్బంతా నేరుగా ఇచ్చేయమని రాష్ట్రాలు అడుగుతున్నాయి. ఆ విధంగా రాష్ట్రాల వాటా 50 శాతానికి పైగా పెంచవచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వం అధిక రాబడిని చేతిలో పెట్టుకుని రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తోంది. సరే, ఇక పెరిగే ఖర్చులకు, రాబడి ఎపుడూ వెనుకబడే ఉండడం భారతదేశంలో రాజ్యానికి తప్పని పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య లోటుని, అప్పులని నియంత్రిచే FRBM చట్టాన్ని 2003లో తెచ్చారు. ఇందులో కేంద్రం తన సాలీనా ద్రవ్య లోటు 3 శాతంగా, రాష్ట్రాల లోటు 3 శాతంగా, బ్యాంకుల నుంచి తెచ్చుకునే అప్పు మీద పరిమితులను విధించారు. రాష్ట్రాలు రెవెన్యూ లోటును (అంటే, సొంత ఖర్చులకు సొంత ఆదాయానికి మధ్య లోటును) జీరోగా మెయింటైన్‌ చెయ్యాలని, మిగతా 3శాతం తన రాష్ట్ర ఆదాయంలో 3శాతం మించకుండా రిజర్వు బ్యాంకు అప్పు ఇచ్చే పద్ధతిని మొదలుపెట్టారు. రాష్ట్రాలు, ఈ పరిమితులని పాటించాయి కానీ కేంద్ర ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా ఉల్లంఘించింది. తను ఉల్లంఘిస్తూనే రాష్ట్రాలను మాత్రం కట్టడి చేస్తోంది. కేరళ, పంజాబ్, యూపీ, తమిళనాడు, బిహార్ లాంటి రాష్ట్రాలు రెవెన్యూ అప్పులు చేయకుండా ఉండలేకపోయాయి. తెలంగాణలోని బీఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వాలు రెవెన్యూ లోటు జీరోగా చూపించి, ఏకంగా బడ్జెట్లో చూపని రహస్య అప్పులు విపరీతంగా చేశాయి. కేంద్రమైతే, పెట్రోల్ పన్నులోంచి ఈ ద్రవ్య లోటును తగ్గించుకుంది. మరి రాష్ట్రాలకు అలాంటి ఆధారం లేదు. కాబట్టి FRBM పరిమితిని 4 శాతానికి పెంచమని అడుగుతున్నారు. ఇది సాధ్యమే అయినా, రెండు సమస్యలు ఉన్నాయి. అప్పుతెచ్చిన నిధులను సద్వినియోగం చేసుకున్నప్పుడే అది సమర్థనీయం. సంక్షేమ పథకాలకోసం తాహతుకి మించి అప్పు తెచ్చి ఇస్తే, కిస్తీలు కట్టలేని పరిస్థితి వస్తుంది. రీపేమెంట్ ఖర్చు ఇప్పటికే బడ్జెట్లో 35 శాతానికి చేరుకుంది. కాబట్టి, అప్పు పరిమితి పెంచితే రాష్ట్రాలు ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని ఒక వాదన. అప్పు తెచ్చుకోకపోతే అభివృద్ధి సాధించలేని పరిస్థితి మరొక వైపు.


ఈ విషవలయాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యలకి కొన్ని పరిష్కారాలు కనుక్కోటం అవసరం. మొదటిగా, ఈ కేంద్ర ప్రాయోజిత నిధులను (CSS) కన్సాలిడేటెడ్ ఫండ్‌లో కలిపేసి రాష్ట్రాల భాగాన్ని పెంచాలి. రెండవది, రాష్ట్రాల మధ్య ఉన్న దామాషాలో జనాభా వెయిటేజీని తగ్గించి, రాష్ట్రాల పన్నుల రాబడి వెయిటేజీని పెంచాలి. ఈ రెంటిని మనం 16 ఆర్థిక సంఘాన్ని డిమాండ్ చెయాలి. మూడవది, ప్రస్తుతం దేశంలో 20 శాతంగా ఉన్న పన్ను – జీడీపీ నిష్పత్తిని 30 శాతానికి దశాబ్ద కాలంలో పెంచాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ టాక్స్‌, ఆస్తి పన్ను, వాసత్వ పన్నులు వసూలు చెయ్యాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు గృహ పన్నులను పెంచుకుని సొంత రాబడిపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వ మొత్తం రాబడిని పెంచితేనే ఈ కష్టాలు, కొట్లాటలూ తేలే అవకాశం ఉంది. కనీసం ఒక దశాబ్దం టార్గెట్‌గా పెట్టుకుని దీన్ని అమలు చేయాలి.

ప్రొ. ఆర్.వి. రమణమూర్తి

సెంట్రల్ యూనివర్సిటీ

ఈ వార్తలు కూడా చదవండి..

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 07:22 AM