వాస్తవాలకు దూరంగా భూరికార్డులు
ABN , Publish Date - Mar 21 , 2025 | 01:39 AM
నమ్మకమైన భూమి రికార్డు లేకుండా హేతుబద్ధమైన చట్టబద్ధమైన భూపరిపాలన అసాధ్యం. నేడు మండలం నుంచి జిల్లా స్థాయి వరకూ వచ్చే భూసంబంధిత ఫిర్యాదులలో చాలా మట్టుకు భూమి రికార్డులపైనే...

నమ్మకమైన భూమి రికార్డు లేకుండా, హేతుబద్ధమైన, చట్టబద్ధమైన భూపరిపాలన అసాధ్యం. నేడు మండలం నుంచి జిల్లా స్థాయి వరకూ వచ్చే భూసంబంధిత ఫిర్యాదులలో చాలా మట్టుకు భూమి రికార్డులపైనే ఉంటున్నాయి. ఈ మధ్య ఒక ఆదివాసీ గ్రామ గిరిజనులపై ఏడు ఇంజక్షన్ దావాలు వేసారు. ప్రతివాదులు సాగు అనుభవంలో ఉన్నారు. కాని వారి వద్ద ఎలాంటి లిఖిత సాక్ష్య పత్రాలు లేవు. వారి సాగు అనుభవాన్ని రికార్డు చేయలేదు. ప్రతివాదులు సాగులో లేరు, అయినా వారి వద్ద అన్ని రికార్డులు ఉన్నాయి. మరికొంత విచారణ చేస్తే, ఈ కేసులు వేయడానికి ముందు వెబ్ లేండ్ భూమి రికార్డులో కావలసిన విధంగా మార్పులు చేసారని తేలింది. మరింత లోతుకు వెళ్తే అల్లసాని పెద్దన్న పేరుతో కొన్ని ఎంట్రీలు ఉన్నాయని తెలిసింది. శ్రీకృష్ణ దేవరాయుల అష్ట దిగ్గజాలు మా ఊరికే వచ్చినట్లు ఉన్నారని ఒక ఆదివాసీ యువకుడు చమత్కరించాడు. నిజానికి ఇవి 1975 భూ సంస్కరణల చట్టం ద్వారా స్వాధీనం చేసుకున్న సీలింగ్ మిగులు భూములు. ఈ కేసులలో కోర్టు సాగులో ఉన్న వారికి వ్యతిరేకంగా తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చింది. అంటే భూ మాఫియా మొదటి రౌండ్‌లో పై చేయి సాధించినట్టే! ఇందుకు కారణం తప్పుడు భూమి రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడే నాటికి, రెండు చోట్ల మూడు రకాలైన భూవిధానాలు అమలులో ఉన్నాయి.
మద్రాస్‌లో భాగంగా ఉన్న నేటి ఆంధ్రప్రదేశ్‌లో జమీందారీ, రైత్వారీ విధానాలు; తెలంగాణలో నైజాం విధానం అమలవుతూ వచ్చాయి. అందుచేత ఆయా ప్రాంతాలలోని భూమి రికార్డులలో తేడా కనిపిస్తుంది. 1948 జమీందారీ రద్దు చట్టం తరువాత, ఆంధ్ర జమీందారీ ప్రాంతాలలో సర్వే & సెటిల్మెంట్ జరిపి వాటిని రైత్వారీ విధానంలోకి తెచ్చారు. అంతేకాదు, ఇనాముల రద్దు చట్టం, ఆదివాసీ ప్రాంతాలలో ముఠాదారి వ్యవస్థను రద్దు చేసి వాటిని కూడా రైత్వారీ విధానంలోకి మార్చడంతో ఆంధ్ర ప్రాంత భూమి రికార్డుల మధ్య సారూప్యత ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో రెండు రకాలైన భూమి రికార్డులు ఉనికిలోకి వచ్చాయి. తెలంగాణ భూమి రికార్డు. ఆంధ్ర భూమి రికార్డు. తెలంగాణలో ఒక రెవిన్యూ గ్రామానికి 48 భూమి రికార్డులు ఉండగా, ఆంధ్ర ప్రాంతంలో 38 ఉండేవి. 1976లో తెలంగాణ రికార్డులను 48 నుండి 21కి, 1979లో ఆంధ్ర ప్రాంతంలో 38 నుండి 23కు తగ్గించారు. రెండు ప్రాంతాలలో ఉన్న రికార్డులను ఒకే విధంగా మార్చేందుకు ఒక నిపుణుల కమిటీని వేసారు. ఆ కమిటీ సిఫారసులకు అనుగుణంగా 1992లో ఉమ్మడి రాష్ట్రం అంతటా ఒక రెవిన్యూ గ్రామానికి 11 రికార్డులుగా నిర్ణయించారు. భూమి రికార్డుల అవసరం ఎందుకంటే భూ పరిపాలన కోసం అని జవాబు. భూ పరిపాలన అంటే రైతుల నుంచి భూమి శిస్తు వసూలు మొదటి అవసరం. ఆ శిస్తు కట్టే బాధ్యుడిని గుర్తించడం రెండవ అవసరం. రైతుల నుంచి వచ్చే భూమి శిస్తు ప్రభుత్వ ఆదాయంలో ఒక అప్రధాన వనరుగా మారేకొద్దీ భూమి రికార్డుల యాజమాన్యంపై ప్రభుత్వాలకు ఆసక్తి తగ్గుతూ వచ్చింది.
1984 జనవరి నెలలో భూమి శిస్తును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చారిత్రకంగా భూమి రికార్డులు ఉనికిలోకి వచ్చిందే శిస్తు వసూలు కోసం. రాజ్యం (స్టేట్) ఆ ఆదాయం వద్దనుకున్నాక వాటి ప్రాథమిక లక్ష్యం ఎగిరిపోయింది. ఉమ్మడి రాష్ట్రం భూమి శిస్తు కమిషనర్ ఆ మిగిలిన 11 రికార్డులలో ఏవి ఉంచాలి, వేటిని తుంచాలి, ఉంచదలచుకున్న రికార్డులలో ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై 2004లో అధికారులతో ఒక కమిటీ వేసారు. పనిలో పనిగా భూమి రికార్డుల కంప్యూటరైజేషన్ యోచన కూడా చేయమన్నారు. కమిటీ 65 పేజీల నివేదిక ఇచ్చింది. ఉన్న 11 రికార్డులలో మూడు (భూమి రికార్డులు నెంబర్ 3-ఎ, 8, 4బి) అవసరం ఇక లేదని తేల్చారు. మిగిలిన వాటిలో మార్పులను ఆ కమిటీ సూచించింది. అంటే ఒక రెవిన్యూ గ్రామానికి 11 రికార్డుల నుంచి 8కి తగ్గాయి. వీటిలో జనన, మరణాల రిజిస్టర్లు తీసివేస్తే 6 మిగిలాయి. భూమికి సంబంధించిన రికార్డులు రెవిన్యూ శాఖ వద్ద మాత్రమే కాదు, మరో రెండు శాఖల వద్ద కూడా ఉంటాయి. అవి సర్వే & సెటిల్మెంట్ శాఖ, రిజిష్ట్రేషన్ శాఖలు. ఈ మూడూ దేనికి అదే స్వతంత్ర శాఖలు. 2006లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కోనేరు రంగారావు కమిటి తన నివేదికలో భూమి రికార్డుల స్థితిపై చర్చించి మూడు సిఫార్సులు చేసింది. ఇందులో– మొత్తం భూమి రికార్డు, భూ పరిపాలనను ‘టైటిల్ గ్యారంటి’ (టోరన్స్ సిస్టం)లోకి మార్చాలన్నది మొదటి సూచన. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద టైటిల్ గ్యారంటీ చట్టానికి మూలాలు ఇక్కడే ఉన్నాయి. మూడు శాఖలను కలిపి ఒకే ఒక సమీకృత భూపరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది రెండవ సిఫారసు. భూమి రికార్డుల నిర్వహణ గ్రామ రెవిన్యూ అధికారి చేతిలో వుంటుంది. కరణాల వ్యవస్థ రద్దు తరువాత, గ్రామ రెవిన్యూ వ్యవస్థపై గత 25 సంవత్సరాలలో ఐదుసార్లు మార్పులు చేస్తూ, ప్రయోగాలు చేస్తూ వచ్చారు. అప్పటికే భూమి వాస్తవ పరిస్థితికి, రికార్డులలోని సమాచారానికి దూరం బాగా పెరిగిపోయింది.
ఈ ప్రయోగాలు పరిస్థితిని ఇంకా అస్తవ్యస్థంగా మార్చాయి. ప్రతి వ్యవసాయక సంవత్సరంలో నిర్వహించే జమాబందీ అనే రికార్డుల తనిఖీ నిల్చిపోయింది. ఇలా తప్పులు తడకలుగా తయారైన భూమి రికార్డులనే కంప్యూటరైజ్ చేసారు. ఆ ప్రక్రియలో మరిన్ని తప్పులు జరిగాయి. వాటిని సరి చేయకుండానే ఈ రికార్డులకు సాధికారిత కల్పించారు. వెబ్ పోర్టల్ ద్వారా మార్పులు, చేర్పులు మొదలుపెట్టారు. మండల రెవిన్యూ కేంద్రంలోని కంప్యూటర్ అసిస్టెంట్ రైతుల జాతకాలు రాసే విధాతగా మారాడు. కంప్యూటర్లపై అవగాన లేని తాహశీల్దార్లు కంప్యూటర్ అసిస్టెంట్‌ను కలెక్టర్‌లా చూసుకోవలసి ఉంటుంది. అక్కడితో ఆగలేదు. మొత్తం సమాచారాన్ని వివిధ ప్రభుత్వ శాఖలు, జాతీయ బ్యాంకులకు ఆన్‌లైన్‌లో అనుసంధానం చేయడంతో రైతుల చేతిలో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలకు దమ్మిడీ విలువ లేకుండాపోయింది. సర్వే నెంబర్లు, సబ్ డివిజన్ నెంబర్లు, విస్తీర్ణాలను రాత్రికి రాత్రే మార్చేస్తారు. భూమి వర్గీకరణ మార్చేస్తారు. అసలు మీ పేరే లేకుండా చేసేయగలరు. భూమి మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వవలసిన నజరానా ఇవ్వకపోతే మీరు పెట్టుకున్న రిజిస్ట్రేషన్ సమయానికి ఆన్‌లైన్ రికార్డులో ఏమైనా జరగవచ్చు. ఈ ఎంట్రీల ఆధారంగా పీఎమ్ కిసాన్, ఇతర ప్రభుత్వ సహాయాలు, బ్యాంకుల నుంచి అప్పులు, ఆదాయపు పన్ను మినహాయింపులు ఇలా పలు రకాలైన సేవలు పొందవచ్చు. ఈ రికార్డులో ఉన్న సమాచారాన్ని తీసుకునే వ్యవసాయ శాఖ ‘ఇ–క్రాప్’ బుకింగ్ చేస్తుంది. ఒక రెవిన్యూ గ్రామానికి 38 భూమి రికార్డుల నుండి 23కు అక్కడ నుండి 11కు తగ్గిపోయాయి. వెబ్ లేండ్ రికార్డు తరువాత రంగం మీద నాలుగు మిగిలాయి. ఇందులో 1) పట్టదార్ల వివరాలు చెప్పే 1B, 2) సాగుబడి రిజిస్టర్ నెంబర్/ అడంగల్ 3) సర్వే నెంబర్ పటం, 4) గ్రామ పటం. వీటిలో మూడు, నాలుగు సెటిల్మెంట్ రికార్డులు. ఇందులో రెండవదైన సాగుబడి రిజిస్టర్/ అడంగల్‌లో, పట్టాదారు వివరాలను, సాగుదారు వివరాలను ఏ వ్యవసాయ సంవత్సరానికి అ వ్యవసాయ సంవత్సరం నమోదు చేయాలి.
కాని అది జరగదు. పట్టాదారునే సాగుదారుగా చూపించేస్తారు. వీటికి నకళ్లు తీసుకొని, సాగులోలేని వారు తామే సాగు అనుభవంలో ఉన్నట్లు కోర్టులను నమ్మించి ఇంజక్షన్ ఆర్డర్స్ తెచ్చి భూమి నుండి నిజమైన సాగుదారుని తొలగిస్తూ ఉంటారు. భూమి రికార్డులు, వాటి యాజమాన్యంలో మార్పులు రాజ్యానికీ, రైతుకూ మధ్య సంబంధాలలో మార్పులకు సంకేతాలు. రైతు నుంచి లభించే శిస్తు వసూలు ఆదాయం ఒకప్పుడు కీలకంగా ఉండిన పరిస్థితి మారి ఇప్పుడు ఒక ఏడాదిలో భూమి ఎన్నిసార్లు చేతులు మారితే అంత లభించే రిజిస్ట్రేషన్ ఆదాయం కీలకమైంది. భూమి రియల్ ఎస్టేట్ సరుకుగా మారింది. సాగుచేయనివారు వ్యవసాయ భూమిని కొనుగోలు చేయకుండా నిలువరించే ఎలాంటి అడ్డంకులు మన రాష్ట్రంలో లేవు. మారుతున్న ఈ కొత్త అవసరం కోసమే, ఆన్‌లైన్ భూమి రికార్డు, ఆఫ్‌లైన్ టైటిల్ గ్యారంటీ.
పి.ఎస్. అజయ్ కుమార్
ఈ వార్తలు కూడా చదవండి...
Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు
For More Andhra Pradesh News and Telugu News..