Himalayas : పెనుప్రమాదంలో హిమానీనదాలు
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:39 AM
మంచినీటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, జలవనరుల స్థిరనిర్వహణ కోసం 32వ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ‘హిమానీనద సంరక్షణ’ ఇతివృత్తంతో నేడు నిర్వహించుకుంటున్నాం.

మంచినీటి ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి, జలవనరుల స్థిరనిర్వహణ కోసం 32వ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ‘హిమానీనద సంరక్షణ’ ఇతివృత్తంతో నేడు నిర్వహించుకుంటున్నాం. 1993 నుంచి ఐక్యరాజ్యసమితి ఏటా మార్చి 22వ తేదీన ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. పది శాతానికి పైగా ప్రపంచ భూభాగాన్ని కప్పి ఉంచిన హిమానీనదాలు, మానవాళి మనుగడకు అత్యంత ఆవశ్యకమైన మంచినీటిని అందించే ప్రధాన వనరులు. నిరంతరం కురిసే మంచు కాలక్రమేణా మందపాటి మంచుపలకంగా మారి, తన బరువు కారణంగా కిందకు జారుతూ, పారే నదులుగా మారుతాయి. ఆస్ట్రేలియాలో మినహా, అన్ని భూఖండాలలో వున్న హిమానీనదాలు వాతావరణ మార్పులకు గురై, కుంచించుకుపోతూ, ప్రాణుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. విలుప్తమైన వాటిని కూడా పరిగణిస్తే, ప్రపంచంలో రమారమి రెండు లక్షల చిన్న, పెద్ద హిమానీనదాలు వున్నాయి. వీటిలో సింహభాగం భూగోళానికి ఉత్తర, దక్షిణ ధ్రువాలలోని ఆర్కిటిక్, అంటార్కిటికా ఖండాలలో 130–170 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన ఖండాంతర హిమానీనదాలు వున్నాయి. మిగిలినవి దాదాపు లక్ష చదరపు కిలోమీటర్లలో విస్తరించి హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో వున్నాయి. ధృవప్రాంతాలకు వెలుపల ఎక్కువ మొత్తంలో మంచు, మంచుపలకలూ ఉన్నందున ఈ ప్రాంతం మూడో ధ్రువంగా గుర్తింపు పొందింది.
మూడో ధ్రువంలో భాగమైన ఆఫ్ఘానిస్తాన్, పాకిస్థాన్, తజకిస్తాన్ దేశాల పరిధిలోని హిందూకుష్ పర్వతాలలో, భూటాన్, చైనా, భారత్, నేపాల్, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్ దేశాలలోని హిమాలయ పర్వత ప్రాంతాలలో కలిపి దాదాపు 46 వేల హిమానీనదాలు వున్నాయి. ఎనిమిది వేల మీటర్లకు పైగా వున్న 14 శిఖరాలలోని హిమానీనదాలు సింధు, గంగ, బ్రహ్మపుత్ర వంటి పది ప్రధాన నదులకు జీవం పోస్తూ అత్యధిక జనాభా గల దేశాలలో పర్యావరణానికి ఊతమిస్తున్నాయి. ధ్రువ ప్రాంతాలకు వెలుపల, అధికంగా ఏడు వేల హిమానీనదాలు కలిగివున్న దేశంగా పాకిస్థాన్ నిలుస్తోంది. భారత్ విషయానికి వస్తే, ధ్రువ ప్రాంతాలకు ఆవల 78 కి.మీ. పొడవున్న సియాచిన్ రెండో అతిపెద్ద హిమానీనదం. ఇది కాకుండా, గంగ నది జన్మస్థానం గంగోత్రి, మిలన్, జెము, పిండారీ వంటి ప్రముఖ హిమానీనదాలు దేశంలో వున్నాయి. వాతావరణ మార్పులతో, హిందూకుష్ హిమాలయ ప్రాంతంలోని హిమానీనదాలు ద్విగుణీకృత వేగంతో కరుగుతున్నాయి. పదేళ్ల క్రితం, లద్ధాఖ్‌లోని లేహ్ జిల్లాలో కులుం గ్రామం ఇల్లూ వాకిలి వదిలి సమీపంలోని లేహ్–మనాలి జాతీయ రహదారి మీది ఉప్షి గ్రామంలో ఉపాధికి వలస వెళ్ళింది. తమ గ్రామం యావత్తూ ఆధారపడిన హిమానీనది కరిగిపోవడం, ఏడాదికేడాది తగ్గుముఖం పట్టిన మంచు మొత్తం ఇరవై కుటుంబాలకు తాగునీరు, సాగునీరు లేకుండా చేయడమే దీనికి కారణం. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరిగిన ఉష్ణోగ్రతలు పర్వత ప్రాంతాలలో శరదృతువు మంచును వసంత ఋతువులో నీటిగా వాడుకునే పరిస్థితిని క్రమంగా మారుస్తున్నాయి.
లద్ధాఖ్‌లో పద్మశ్రీ చెవ్వాన్గ్ నోర్ఫెల్ పర్వతపువాలులో చేపట్టిన కృత్రిమ హిమానీనదాల నిర్మాణం, లేదా రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ఏటా శీతాకాలంలో నిర్మిస్తున్న హిమాస్థూపాలు అక్కడ చేజారుతున్న పరిస్థితిని అవగతం చేస్తున్నాయి. ఇది కేవలం కులుం గ్రామ కథ కాదు, హిమాలయ సానువుల్లో వున్న ప్రతి గ్రామం ఎదుర్కొంటున్న సవాలే. హిమాలయాల పర్యావరణాన్ని కాపాడే ఉద్యమంలో భాగంగా సోనమ్ వాంగ్‌చుక్ గత నెలలో ఖర్దుంగ్ లా పాస్ దగ్గర కరుగుతున్న హిమానీనద భాగాన్ని (ట్రావెలింగ్ గ్లేసియర్) ఐక్యరాజ్య సమితి ముఖ్య కార్యాలయంలో పర్యావరణ కార్యక్రమ అధికారి జమీల్ అహ్మద్‌కి అందజేసి హిమాలయ ప్రాంత ప్రజలు ఎదుర్కోనున్న మనుగడ సమస్యను, హిమానీనద సంరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 1984– 2023 మధ్య హిమాలయ నదీ పరీవాహక ప్రాంతాలలో సేకరించిన వివరాల విశ్లేషణలో, పది హెక్టార్ల విస్తీర్ణం పైబడిన 2431 హిమానదీయ సరస్సులలో 676 సరస్సుల విస్తీర్ణం రెట్టింపయింది. ఇందులో 130 భారత్ పరిధిలోనివే. దీనర్థం, మంచు కరిగి నదుల ద్వారా సముద్రాలలో కలిసి, సముద్రాల మట్టం పెంచడం, తద్వారా తీర ప్రాంతాలను ముంచడం. ఇది దీర్ఘకాల ప్రమాదమైతే, హిమానదీయ సరస్సులు కట్టలు తెగి (గ్లేషియల్ లేక్ అవుట్ బరస్ట్ ఫ్లడ్స్) 2013 కేదార్‌నాథ్ వరదల వంటి ప్రమాదాలూ పొంచి ఉన్నాయి. క్రమరీతిలో నీటి లభ్యత లేకపోతే, గంగ వంటి జీవనదులు కాస్తా కాలానుగుణ నదులుగా మారే ప్రమాదం వున్నది.
జాతీయ ధ్రువ, మహాసముద్ర పరిశోధన కేంద్రం (ఎన్‌సిపిఓఆర్) హిమాచల్‌ప్రదేశ్‌లోని లాహోల్ స్పితీలోని చంద్రబేసిన్‌లో జరిపిన పరిశోధనలో 2013–2021 మధ్య హిమ ప్రాంతానికి ఆరుశాతం మేరకు నష్టం వాటిల్లినట్టు తెలిసింది. గంగ, బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థలకు దాదాపు సగం నీరు హిమానీనదాలు కరిగిన నీటి ద్వారానే లభ్యమవుతుంది. అయితే, క్రమంగా తగ్గుతున్న హిమానీనదాలు, నేరుగా ఆయా పరీవాహక ప్రాంతాలలోని వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాల నీటి లభ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. విలుప్తమవుతున్న హిమానీనదాలు, హిమాలయాల్లోని కులుం వంటి గ్రామాలను ఇప్పటికే ప్రమాదంలో పడేశాయి. హిమాలయాలను ప్రభావితం చేసే అన్ని అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి తక్షణమే దిద్దుబాటు చర్యలను తీసుకుంటేనే దశాబ్దాల నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టాన్ని ప్రస్తుతానికి అరికట్టగలం. హిమాలయాలకు అయిన గాయం మానడానికి అవి ఏర్పడడానికి పట్టినంత సమయం పడుతుంది. ఇది ఒక ప్రభుత్వమో, దేశమో చేయగల కార్యం కాదు. సమష్టిగా మానవాళి తమ మనుగడ కోసం, తమ జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా హిమానీనద సంరక్షణ కోసం ప్రతిజ్ఞ చేయాలి. l రమేశ్‌చంద్ర రావులపల్లి (ఐ.ఐ.ఎస్) (నేడు ప్రపంచ నీటి దినోత్సవం)