Global Politics : సుంకాలపై సమష్టి పోరాటం
ABN , Publish Date - Mar 22 , 2025 | 04:47 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షేక్ స్పియర్‌ను చదివారో లేదో గాని ఆ మహాకవి మాటలలోని సత్యాన్ని బాగానే గ్రహించారు: ‘స్నేహంలో చిత్తశుద్ధిలేని ముఖస్తుతి ఉన్నది’.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ షేక్ స్పియర్‌ను చదివారో లేదో గాని ఆ మహాకవి మాటలలోని సత్యాన్ని బాగానే గ్రహించారు: ‘స్నేహంలో చిత్తశుద్ధిలేని ముఖస్తుతి ఉన్నది’. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడు అయిన తన స్నేహితుడు డోనాల్డ్ ట్రంప్‌ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ వలసలు, వీసాలు, వాణిజ్య సమతుల్యత, సుంకాలు, అణు ఇంధనం, దక్షిణ చైనా సముద్రం, బ్రిక్స్, క్వాద్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మొదలైన అంశాలపై స్వదేశానికి అనుకూలంగా ట్రంప్‌తో సంప్రతింపులు జరపగలననే ఆశాభావంతో ఉన్నారు. అధ్యక్షుడు ట్రంప్ నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉంటారు. అంతకు మించి ఉండరు. ప్రధానమంత్రి నరేంద్రీ మోదీ మూడో పదవీ కాలం ఇంకా నాలుగు సంవత్సరాలు ఉన్నది. మరోసారి కూడా ప్రధానమంత్రి కావాలని ఆయన ఆశిస్తున్నారని చెప్పవచ్చు. అయితే నాలుగు సంవత్సరాల ఉమ్మడి వ్యవధిలో సమస్యలు అన్నిటినీ పరిష్కరించడం సాధ్యం కాదన్నది స్పష్టం. రాబోయే అమెరికా ప్రభుత్వం రిపబ్లికన్ పార్టీది అయినా, డెమొక్రాటిక్ పార్టీది అయినా ట్రంప్ విధానాలను కొనసాగించక పోవచ్చు. ఈ సంభావ్య పరిణామమే భారత్‌కు మొదటి పాఠం కావాలి. ప్రభుత్వాధినేతల మధ్య వ్యక్తిగత స్నేహ సంబంధాలకు అతీతంగా పరిస్థితులను సమగ్రంగా చూడాలి. ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఆయనకు ఒక స్నేహితుడు ఎప్పుడు శత్రువు అవుతాడో, ఒక శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో ఎవరూ చెప్పలేరు. పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అధ్యక్షుడు ట్రంప్‌ను ప్రధాని మోదీ ఘనంగా ప్రశంసించారు.
ఆయన వినమ్రతను, కష్టాల నుంచి బయటపడగల శక్తిని బాగా మెచ్చుకున్నారు. ద్వితీయ పర్యాయం అధ్యక్ష పదవీ కాలంలో సాధించాల్సిన లక్ష్యాల విషయమై ట్రంప్ మొదటిసారి కంటే బాగా సన్నద్ధమయ్యారని మోదీ అన్నారు. ఆయనకొక మార్గదర్శక ప్రణాళిక ఉన్నదని, వేసే ప్రతి అడుగు లక్ష్య పరిపూర్తికి తోడ్పడేదిగా ఉంటుందని మోదీ అన్నారు. మోదీ ఇంకా ఇలా అన్నారు: ‘తాను నిర్దేశించిన లక్ష్యాలను సాధించగల శక్తిమంతమైన పాలనాదక్షుల బృందానికి బాధ్యతలు అప్పగించారు. సమర్థులైన ఆ అధికారులు అధ్యక్షుడు ట్రంప్ దార్శనికతను అమలుపరచగలరని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను’. అమెరికా ప్రజలు అందరూ ఈ ప్రశంసతో ఏకీభవించకపోవచ్చు. సెనేటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు అందరూ ఆయా ప్రభుత్వ విభాగాలకు ట్రంప్ ఎంపిక చేసుకున్న అధికారులు అందరూ శక్తి మంతులని, పాలనా దక్షులని భావించడం లేదు. ట్రంప్ దార్శనికత అమెరికాకు గానీ, ప్రపంచానికిగానీ శ్రేయస్సును సమకూర్చేదని అమెరికా ప్రజలు అందరూ భావించడం లేదు. డోనాల్డ్ ట్రంప్ తన దార్శనికతను అమలుపరచడమనేది భారత్‌కు శుభవార్త కాబోదు. తన లక్ష్యాల పరిపూర్తిలో ట్రంప్ సఫలమయితే దాని పర్యవసానాలు భారత్‌కు ఎలా ఉంటాయో చూద్దాం: సరైన పత్రాలు లేకుండా అమెరికాకు వలస వెళ్లిన భారతీయులు (దాదాపు 7 లక్షల మంది అని అంచనా) దాదాపుగా అందరినీ తిరిగి భారత్‌కు పంపించి వేస్తారు; అమెరికాలో గ్రీన్‌కార్డ్ ఉన్న భారతీయులకు అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని నిరాకరించే అవకాశమున్నది; విద్యాధికులు, వృత్తి నిపుణులకు జారీ చేసే హెచ్ 1బి వీసాల జారీని గణనీయంగా తగ్గించివేస్తారు; హార్లే డేవిడ్‌సన్ బైక్‌లు, భౌర్బన్ విస్రీ, జీన్స్, ఇతర అమెరికన్ సరుకులపై దిగుమతి సుంకాలను తగ్గించడం భారత్‌కు అనివార్యమవుతుంది; భారత్ నుంచి అల్యూమినియం, ఉక్కు ఎగుమతులు, బహుశా ఇంకా ఇతర భారతీయ సరుకులపై అమెరికా భారీ స్థాయిలో సుంకాలు విధించే అవకాశమున్నది; భారత్‌లో ఉద్యోగాలను సృష్టించే పరిశ్రమలను నెలకొల్పకుండా అమెరికన్ ప్రైవేట్ పెట్టుబడులను నిరుత్సాహపరుస్తారు.
అంతర్జాతీయ సంబంధాలలో ట్రంప్ పోకడల విషయాన్ని చూద్దాం. పనామా కాలువను అమెరికా తన నియంత్రణలోకి తీసుకుంటే నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రతిస్పందిస్తారు? ఆ సముద్ర మార్గంలో భారత్, ఇతర దేశాల ఓడల రాకపోకలకు అనుమతించినంతవరకు ఎవరూ నిరసన తెలుపకపోవచ్చు. అయితే పనామా కాలువను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోవడమనేది నిస్సందేహంగా ఒక దురాక్రమణే. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడమే. గ్రీన్‌ల్యాండ్‌ను ఏదో ఒక విధంగా అమెరికా స్వాయత్తం చేసుకుంటే మోదీ ఏ విధంగా ప్రతిస్పందిస్తారు? గ్రీన్‌ల్యాండ్ మనకు సుదూరంలో ఉన్న దీవి కనుక, అమెరికా చర్యకు మనం ఆందోళనపడవలసిన అవసరం లేదని భారత్ భావిస్తుందా? కొన్ని ‘దురాక్రమణలను’ క్షమించవచ్చుగానీ రష్యా మరిన్ని ఉక్రెయిన్ ప్రాంతాలను, తైవాన్‌ను చైనా స్వాధీనం చేసుకుంటే భారత్ ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది? ఆక్సాయిచిన్, అరుణాచల్‌ప్రదేశ్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు చైనా ప్రయత్నిస్తేనో?! భారత్, చైనాల మధ్య యుద్ధం తప్పక సంభవిస్తుంది. ఆ యుద్ధంలో మనకు మద్దతుగా ఏ దేశం నిలబడుతుంది? ఆధునిక దౌత్యం వ్యక్తిగత స్నేహాలను మించిన వ్యవహారం. డెమొక్రాటిక్ పార్టీతో నెలకొల్పుకున్న స్నేహ సంబంధాలను వదులుకుని ట్రంప్ పార్టీకి మోదీ మళ్లీ ప్రాధాన్యమిస్తారా? ఏది ఏమైనా జనవరి 20, 2029 తరువాత ట్రంప్ అధికారంలో ఉండరు. తదుపరి అధ్యక్షుడు డెమొక్రాటిక్ పార్టీకి చెందిన నాయకుడు కావచ్చు. గత పది సంవత్సరాలుగా దేశీయ పరిశ్రమల సంరక్షణ విధానానికి నరేంద్ర మోదీ ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. ఆయన దాన్ని ఘనంగా ఆత్మనిర్భరత అని చాటుతున్నారు. తన స్నేహితుడు డాక్టర్ అర్వింద్ పనాగరియాతో సహా పలువురు ఆర్థికవేత్తల విజ్ఞతాపూర్వక సలహాలు, సూచనలను పెడచెవిని పెట్టి మోదీ ప్రభుత్వం 500కు పైగా సరుకుల దిగుమతులపై సుంకాలు, సుంకాలేతర చర్యలు చేపట్టింది. భారతీయ సరుకులపై అమెరికా వసూలు చేస్తున్న అధిక సుంకాలపై మోదీ నిరసన తెలిపినప్పుడు ఆయన ఆక్షేపణలను ట్రంప్ మహాశయుడు పూర్తిగా కొట్టివేశాడు. ఏప్రిల్ 2, 2025 నుంచి పూర్తి స్థాయిలో సుంకాల సమరాన్ని ప్రారంభించేందుకు ట్రంప్ ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది.
ట్రంప్‌తో మోదీ దోస్తీ, ముఖ ప్రీతి మాటలు బాగానే ఉన్నాయి గానీ, ట్రంప్ సుంకాల సమరం నుంచి ఇండియాను మినహాయించడానికి అవి తోడ్పడుతాయా? ట్రంప్ విధించే ప్రతీకార సుంకాలను భారత్ ప్రతిఘటిస్తుందా? సూత్రబద్ధ చర్చలు, సంప్రదింపులే దౌత్యానికి హృదయం వంటివి. ముఖస్తుతి మాటలు ఎంతమాత్రం దౌత్య వ్యవహారం కాబోవు. ఆచరణాత్మక వైఖరి నిండుగా ఉన్న ఫ్రిడ్రిచ్ మెర్జ్ (కాబోయే జర్మన్ ఛాన్సలర్), ట్రంప్ విసురుతున్న సవాళ్లకు దీటుగా ప్రతిస్పందిస్తున్న కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, 27 యూరోపియన్ యూనియన్ దేశాలను సంఘటితం చేసిన యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ తెయెన్‌లు అంతర్జాతీయ చట్టాలు, ఒడంబడికలను విచక్షణారహితంగా ఉల్లంఘించకుండా ట్రంప్‌ను అడ్డుకోవడంలో విజయం సాధించే అవకాశమున్నది. న్యాయ నియమాల ప్రాతిపదికన పోరాడేవారి పక్షాన భారత్ నిలబడి తీరాలి.
(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు)