Share News

గోర్–బోలికి రాజ్యాంగ హోదా ఏదీ?

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:58 AM

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు కూడా తోడై మాతృభాషలు కనుమరుగవక తప్పని పరిస్థితి దాపురించింది...

గోర్–బోలికి రాజ్యాంగ హోదా ఏదీ?

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన దేశంలో మాతృభాషల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రపంచీకరణ, సరళీకృత ఆర్థిక విధానాలు కూడా తోడై మాతృభాషలు కనుమరుగవక తప్పని పరిస్థితి దాపురించింది. ఆంగ్లభాష అంతర్జాతీయ భాషగా రూపాంతరం చెందడంతో ప్రపంచవ్యాప్తంగా వేల సంఖ్యలో మాతృభాషలు అంతరించిపోతున్నాయి. అంతరించిపోతున్న భాషల్లో బంజారాలు మాట్లాడే గోర్–బోలి ఒకటి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు భాషను ఆంగ్ల భాష అధిగమించినట్లు, గిరిజన భాషలను తెలుగు అధిగమిస్తోంది. లంబాడీ(బంజారా) గిరిజన భాషకు గుర్తింపు లేదు, లిపి లేదు. గిరిజనుల భాషలు మౌఖికమైనవి కావడం మూలాన నిరాదరణకు గురవుతున్నాయి. భారత రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లలో పేర్కొన్న గిరిజన రాష్ట్రాల్లో 698 తెగలకు చెందిన 10 కోట్ల మంది జనాభా ఉంది. మన దేశంలో మొత్తం 1652 భాషలుండగా, గిరిజనులు మాట్లాడే భాషలే సుమారుగా 600 దాకా ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్‌లో ఇప్పటికి 22 భాషలు అధికారికంగా గుర్తింపు పొందగా, అందులో గిరిజనులు మాట్లాడే మణిపురి, డోంగ్రీ, బోడో, కొంకిణి, సంథాలీ భాషలకు మాత్రమే చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలోనే కాకుండా, దేశవ్యాప్తంగా దాదాపుగా 20 రాష్ట్రాలలో నివసిస్తున్న బంజారాలు, హిందీ తరువాత అత్యధికంగా తమ సంప్రదాయ భాష గోర్–బోలిను మాట్లాడుతున్నారు.


కానీ అతి పెద్ద సమూహం కలిగిన లంబాడీ భాషకు రాజ్యాంగబద్ధ గుర్తింపు విషయంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బంజారాలు మాట్లాడే భాష అంతరించే దశలో ఉంది. భాష ద్వారానే బంజారాలు తమ సంస్కృతీ సాంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకుంటున్నారు. కాని బంజారాలతో పాటు కొన్ని రకాల తెగల భాషలకు లిపి లేదన్న సాకుతో ఇతర భాషలను పాలకులు వారిపై రుద్దుతున్నారు. 1956లో హైదరాబాద్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో విలీనమై భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించిన తరువాత ఆదివాసీ, గిరిజన విద్యార్థుల మీద తెలుగు రుద్దారు. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పదేళ్ల క్రితం రాజీవ్‌ విద్యామిషన్‌ (ఆర్‌.వి.ఎం)ద్వారా బంజారా భాషలో తెలుగు లిపితో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు వాచకాలను ముద్రించి ప్రత్యేక పాఠశాలను నెలకొల్పి, ఆయా భాషా సంబంధ బోధకులను కూడా నియమించింది ఇలా కొంత ప్రయత్నం చేసినా, కొన్ని సాంకేతిక లోపాల వల్ల నేడు పాఠశాలలు పని చేయడం లేదు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో గోర్–బోలి భాషను చేర్చాలన్న డిమాండ్‌తో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వివిధ రూపాల్లో పోరాడుతున్నా, సమస్య పరిష్కారం కాలేదు. బంజారా తెగ అస్తిత్వానికి గోర్–బోలి భాష కీలకమైనది. బంజారాల భాషకు రాజ్యాంగ హోదా కల్పించి, తగిన ప్రోత్సాహం అందించాలి.

జటావత్ హనుము,

రిసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ

ఈ వార్తలు కూడా చదవండి..

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 12:58 AM