Share News

‘పెట్టుబడి సేవ’లో సైన్స్!

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:12 AM

కృత్రిమ మేధ గురించి నేను రాసిన దానిమీద, మామిడి నారాయణ గారి విమర్శ సిద్ధాంతం వేరూ, సైన్స్ వేరూ మార్చి 1, ఆంధ్రజ్యోతి చూశాను. దానికి క్లుప్తంగా నా జవాబు. 1 నా వ్యాసంలో నేను ‘తడబడ్డా’నని నారాయణ అనుకున్నట్టు...

‘పెట్టుబడి సేవ’లో సైన్స్!

‘కృత్రిమ మేధ’ గురించి నేను రాసిన దానిమీద, మామిడి నారాయణ గారి విమర్శ ‘సిద్ధాంతం వేరూ, సైన్స్ వేరూ!’ (మార్చి 1, ఆంధ్ర జ్యోతి) చూశాను. దానికి క్లుప్తంగా నా జవాబు. (1) నా వ్యాసంలో నేను ‘తడబడ్డా’నని నారాయణ అనుకున్నట్టు నేను ఎక్కడా ‘తడబడ’లేదు. నా వ్యాసంలో, నేను అన్నది ఏమిటీ? ‘‘మంచి టెక్నాలజీని వద్దనడం లేదు. అది సమాజంలో మానవులందరికీ మంచిదై వుండాలి! దానిని పెట్టుబడిదారీ పద్ధతుల్లో వాడడం వల్ల, శ్రమ దోపిడీ విపరీతంగా జరుగుతున్న విషయాన్ని గుర్తించాలి’’ అని నేను స్పష్టంగా చెపితే, దానిలో తడబాటేముంది? (2) ‘రంగనాయకమ్మ కోణంలో చూద్దాం’ అంటూ, నేను ప్రస్తావించని, చర్చించని, ఇద్దరు పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తల పేర్లు తీసుకొచ్చి, వాళ్ళ అభిప్రాయాల్ని అసందర్భంగా చెప్పుకొచ్చారు నారాయణ. ఉదాహరణకి, నారాయణ ప్రస్తావించిన వారిలో ఒకరైన ‘సే’ అనే ఫ్రాన్స్ దేశపు ఆర్ధికవేత్త అవగాహన ఎంత అర్ధరహితమో ‘కాపిటల్’లో మార్క్స్ ఏనాడో వివరించాడు. అలాంటి ఆర్ధికవేత్తని, ఈ చర్చలోకి తీసుకురావడం, అతనితోనూ, ఇంకొక పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తతోనూ మార్క్సుని కలిపి, వారి సిద్ధాంతాలే కాకుండా, మార్క్సు సిద్ధాంతం కూడా ‘‘విఫలం’’ అయిందనడం, పరమ అసందర్భ వ్యాఖ్యానం! (3) ‘మార్క్సు చెప్పినట్టు, ఎక్కడా కార్మికులు తిరుగుబాటు చెయ్యలేదు’– కాబట్టి మార్క్సు సిద్ధాంతం ‘విఫలం’ అయిందని నారాయణ తీర్పు చెప్పేశారు! ఈ రకం వాదననే ఇంకో ఆయన కిందటి సంవత్సరం, ఇదే పత్రికలో (ఆంధ్రజ్యోతి, 3–2–24) చేస్తే, దానికి నేను ఇచ్చిన జవాబునే తిరిగి ఇక్కడ చెప్పక తప్పదు.


‘‘అవి (వర్గపోరాటాలు) జరగలేదంటే, అది మార్క్సిజంలో లోపం కాదు. వర్గ పోరాటాలు అనేవి, పగలూ–రాత్రీలా, అమావాస్యా–పౌర్ణమీలా, ప్రకృతి సహజంగా జరగవు! వర్గ పోరాటాలకోసం, శ్రామికవర్గ పార్టీలైన కమ్యూనిస్టు పార్టీలకు, మార్క్సిస్టు సిద్ధాంత గ్య్నానంతో, నడిచే సామర్ధ్యాలు బలహీనపడి ఉండవచ్చు! అందుకే, అలా జరగలేదు.’’ (4) నేను నా వ్యాసంలో, ముఖ్యంగా చెప్పింది, టెక్నాలజీని లాభాల కోసం పెట్టుబడిదారీ పద్ధతుల్లో ఉపయోగించడం వల్ల, ఉద్యోగాలు పోతాయని! అంతే చెప్పాను. కానీ, నారాయణ ప్రస్తావించిన ‘ఆర్ధిక మాంద్యం’ గురించి, నా వ్యాసంలో ఎక్కడా నేను మాట్లాడనే లేదు. కానీ, నారాయణ మాత్రం, ‘కీన్స్’ అనే పెట్టుబడిదారీ ఆర్ధికవేత్త, ఆర్ధిక మాంద్యం విషయమై చెప్పిన చిట్కాలని ప్రస్తావించారు. ఆ చిట్కాలనే, ఒక ‘ప్రత్యామ్నాయ సిద్ధాంతం’గా, ప్రశంసించారు కూడా! పెట్టుబడిదారీ ఆర్ధికవేత్తలు చెప్పే చిట్కాలు, ఆర్ధిక మాంద్యానికి అసలు కారణమైన ‘‘అమితోత్పత్తి అనే అంటురోగాన్ని’’ ఎలా నయం చెయ్యలేవో, ‘కాపిటల్’లో, మార్క్సు వివరంగానే రాశాడు. అవేవీ పట్టించుకోకుండా, చిట్కాలనే గొప్ప సిద్ధాంతంగా కీర్తిస్తున్నారు నారాయణ! (5) ‘ట్రాక్టర్ లాంటి యంత్రాల వినియోగం లేకపోతే, సగం జనాభా ఆకలితో చచ్చిపోయేవారే’– అని ఒక విచిత్ర వాదన చేశారు నారాయణ. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాలలోనూ కలిపి, 2022 నాటికి, దాదాపు కోటి ట్రాక్టర్లున్నాయని ఒక లెక్క! పైగా ప్రతీ సంవత్సరమూ, వాటి అమ్మకాలు పెరుగుతున్నాయి కూడానట!


మరి, ‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్త’ గానీ, ‘ప్రపంచ ఆకలి సూచిక’ గానీ, ప్రపంచవ్యాప్తంగా ఆకలి చావుల గురించి ఏమి చెబుతున్నాయి? ఆకలి చావుల్లో, భారతదేశం పరిస్తితి, ‘‘సీరియస్’’గా వుందని, తాజా వార్త! ‘ఆకలి’ సమస్యని చూడవలిసింది, ఆహార ఉత్పత్తి ట్రాక్టర్లతో జరుగుతోందా, ఇంకో రకంగానా అని కాదు. ఉత్పత్తి అయిన ఆహార సరుకులు జనాభాలో ఏ వర్గాలకు, ఎంతెంత అందుతున్నాయి? ఎంతమంది కొనగలుగుతున్నారు?– అన్నవి అసలు ప్రశ్నలు! (6) ‘యాంత్రీకరణను వ్యతిరేకిస్తూ, శ్రామికులకు పనిలేదని వాపోయేవారు’, ఒక విషయం చూడాలట! ‘తెలంగాణా పల్లెలకు ఇతర రాష్ట్రాలనించీ వచ్చే వ్యవసాయ కూలీల్ని చూడమని’ ఒక హాస్యాస్పదమైన వాదన చేశారు నారాయణ! అసలు, వ్యవసాయ కూలీలు, తమ ప్రాంతాలనించీ దూర ప్రాంతాలకు ఎందుకు వలస పోతారు? తామున్న చోట పనులు దొరకకే కదా? పైగా నారాయణ చెప్పిన రాష్ట్రాలలో, ఆయన ముచ్చటపడే ట్రాక్టర్లకు కొదవ లేదు. ఉదాహరణకి, 2022లో, జనవరికీ–జులైకీ మధ్య, ఉత్తరప్రదేశ్‌లో అమ్ముడైన ట్రాక్టర్లు 75,817. అసలు దేశం మొత్తంలోనే, ఉత్తరప్రదేశ్‌లో వున్నన్ని ట్రాక్టర్లు ఎక్కడా లేవని వ్యవసాయరంగ సమాచారం! (7) మహారాష్ట్రలో, బారామతిలో జరుగుతున్న కృత్రిమ మేధ పరిశోధనల గురించి, చాలా పొంగిపోతూ వర్ణించారు నారాయణ. కానీ, ఆ మహారాష్ట్రలోనే 2022లో, 4,248 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి, మహారాష్ట్రలో కూడా, అనేక రకాల వ్యవసాయం పనులకు ఉపయోగించే ట్రాక్టర్లు వేల సంఖ్యలో ప్రతీ యేటా కొత్తగా అమ్ముడవుతున్నాయని లెక్కలున్నాయి. (8) ‘కృత్రిమ మేధ వల్ల పెట్టుబడిదారులకు విపరీత లాభాలు వస్తాయనేది ఒక భ్రమ’ అని మందలిస్తున్నారు నారాయణ! అదే భ్రమ అయితే, కృత్రిమ మేధ కంపెనీలు, అన్నేసి లక్షల కోట్లు పెట్టుబడులు ఎందుకు పెడుతున్నాయి? ఒక పక్క విపరీత లాభాలు రావడం ‘భ్రమ’ అంటూనే, ఇంకో పక్క ‘పెట్టుబడి పెట్టేవారు లాభం తప్పక ఆశిస్తారు’ అనడం ఎందుకు? ‘ఆశే లేకపోతే ప్రగతికి ఆస్కారం వుండద’ని, ఇంకో ఉవాచ! దేనిలో ‘ప్రగతి’? లాభాల్లోనా ప్రగతి? (9) ‘సైన్సు ఏదో ఒక వర్గ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని భావించడం అర్ధరహితం’–అంటున్నారు నారాయణ. సైన్స్ ‘‘ప్రస్తుత సమాజంలో’’, ఏ వర్గం చేతిలో ఆస్తిగా వుంది? సైంటిస్టులూ, ఇంజినీర్లూ వంటి మేధా శ్రామికుల్ని, పనిలో పెడుతున్నది ఏ వర్గం? ప్రస్తుత సమాజంలో, సైన్సు, పెట్టుబడికి సేవచేస్తోంది. ఏ రంగంలోనైనా, పెట్టుబడి లక్ష్యం ఏమిటి? లాభార్జనే! దానికోసం ఎంతటి వింధ్వంసానికైనా పాల్పడుతుంది.


ఉదాహరణకి, వ్యవసాయ రంగంలో అదేమి చేస్తుందో, మార్క్సు మాటల్లో చూడండి: ‘‘పెట్టుబడిదారీ విధానం, సమస్త సంపదలకూ మూలాలైన భూమినీ, కార్మికుల్నీ సర్వనాశనం చెయ్యడం ద్వారా మాత్రమే, తన సాంకేతిక పరిగ్న్యానాన్నీ (టెక్నాలజీనీ) సామాజిక ఉత్పత్తిక్రమాల సమ్మేళనాన్నీ అభివృద్ధిపరుస్తుంది.’’ (‘కాపిటల్’లో, ‘ఆధునిక పరిశ్రమలూ, వ్యవసాయమూ’ అనే చోట). (10) చివరిగా, ప్రస్తుత సమాజంలో, సైన్సు ఏ వర్గానికి ఉపయోగపడుతోంది– అనే విషయంలో నా అవగహనను ‘‘అర్ధరహితం’’గా కొట్టిపారేసిన, నారాయణగారికి ఒక అర్ధవంతమైన సలహా! మీ పేరుకింద వున్న మీ సంస్త పేరుని, ‘‘సెంటర్ ఫర్ బెటర్ కాపిటలిస్టిక్ ఇండియా రీసెర్చ్ ఫౌండేషన్’’ అని మార్చుకుంటే, మీ అవగాహనకు తగ్గట్టు వుంటుంది!

రంగనాయకమ్మ

ఈ వార్తలు కూడా చదవండి..

Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Mar 25 , 2025 | 01:13 AM