దళిత కవితకు తార్కిక పదును
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:38 AM
దిశానిర్దేశం లేని అర్థరహిత జీవితాన్ని, కల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసిద్ద అమెరికన్ బ్లాక్ పొయెట్ లాంగ్‌స్టన్ హ్యూస్ కలలు లేని జీవితం, ఎగరలేని రెక్కలు విరిగిన పక్షి వంటిదంటాడు. కలలు భవిష్యత్తు కోసం ప్రేరణనిచ్చి,...

దిశానిర్దేశం లేని అర్థరహిత జీవితాన్ని, కల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ప్రసిద్ద అమెరికన్ బ్లాక్ పొయెట్ లాంగ్‌స్టన్ హ్యూస్ ‘‘కలలు లేని జీవితం, ఎగరలేని రెక్కలు విరిగిన పక్షి’’ వంటిదంటాడు. కలలు భవిష్యత్తు కోసం ప్రేరణనిచ్చి, పోరాడే శక్తినిస్తాయి. ఇక్కడ కల అంటే గమ్యాన్ని నిర్దేశించుకోవడంలో హేతువాద ఆలోచన కలిగిన తాత్వికత. భారతీయ సమాజంలో సామాజిక అసమానతలు ఇంకా ఒక ప్రధాన సమస్యే! రాజ్యాంగం చట్టపరంగా సమానత్వాన్ని నెలకొల్పినప్పటికీ, సామాజిక స్థాయిలో మార్పును తీసుకురావడానికి కవిత్వమే శక్తివంతమైన సాధనం కాగలదు. బ్లాక్ పోయెట్రీలా భారతీయ కులవివక్షకు వ్యతిరేకంగా వచ్చిన నిరసన కవిత్వమే దళితకవిత్వం. ఇది బౌద్ధం, అంబేద్కర్ రాజ్యాంగం, మార్క్సిజం తాత్వికతను ఆపాదించుకున్నాక కవిత్వోద్యమస్థాయిని దాటి పరిణత దళిత సాహిత్యంగా మార్పు చెందింది. వేముల ఎల్లయ్య ‘క్రీనీడ – తార్కిక కవిత్వం’ కవితా సంపుటి దళిత తాత్వికతతో, విశ్వజనీన విశాల దృక్పథంతో తర్కించుకుంటూ పరిణామం చెందినట్టుగా కనిపిస్తుంది. దీనిలో కేవలం అనుభవాలను వ్యక్తీకరించడమే కాకుండా, పరిష్కారం కనబడుతుంది.
వెలుతురులో జీవించలేని జీవితాల పట్ల వివక్షకు నీడ ప్రతీక. ‘క్రీనీడ’ అంటే కింది నీడని అర్థం. ఈ పద బంధం తీవ్ర అణిచివేత, పరాధీనతను సూచించినా, ఈ ‘క్రీనీడ’ కవిత్వం హేతువాదంతో పరిష్కారం దిశగా ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది. ఈ కవిత్వంలో సొంత భాష, స్వీయ అనుభవాలు, భావోద్వేగాలు కవికి మాత్రమే పరిమితం కాలేదు. సార్వజనీనమైనవి. ఆ విధంగా ‘క్రీనీడ’ అంతర్జాతీయస్థాయి కవిత్వం. వేముల ఎల్లయ్య కవిత్వంలో శైలి, అభివ్యక్తి, వస్తుపరంగా పరిణామం చెందుతున్నా, భాష స్థిరంగా ఉంది. వచనంలో, కవిత్వంలో భాషాపరంగా బలమైన దళితజీవిత ఇమేజరీ ఉంటుంది. మొనదేలిన వడపోతలేని భాష ఉంటుంది. నిండైన నిరసనతో కూడిన ఆవేదన ధ్వనిస్తుంది. కవిత్వానికి తీసుకున్న వస్తువును దేశీయపదాలలో కుదించి, సరళంగా చెప్పడం కన్పిస్తుంది. రెక్కలు లేని పక్షి ఎగరలేదు. తాత్వికత లేని కవి స్వతంత్రంగా ఆలోచించలేడు. తర్కించలేడు. అలాంటి లిల్లీపుట్ కవుల గురించి వేముల ఎల్లయ్య ‘గతి’ కవితలో రాశాడు. ‘‘మొగవేశ్య కవీ మొఖం కప్పిన పట్టుచీర/... ఏ దేశం దేవ్లాడినా మీలాంటి సంస్కృతి తస్కరీ కవులు దొరుకున?/ఏం! లగాయించిన లత్కోర్సాఫ్ కూలిపోయే పాలకుని నిల్పే కైతా!’’ అని రాజకీయనాయకుల అధికారాన్ని నిలబెట్టడానికి కవిత్వాన్ని రాసే వెన్నులేని కవులను కవిత్వబోనులో దోషిగా నిలదీస్తాడు.
ఇందులోని కవితలు ఎక్కువగా సామాన్యుల విజయాలు. వారి సామాజిక బలిదానాలను, త్యాగాలను కీర్తించడం; మహిళ, దళిత, బహుజన కవులు, కళాకారుల స్మృతి కవితలు; సమకాలీన ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ అంశాలు; యుద్ధోన్మాదం; దళిత రాజకీయాలపై ఆక్రోశం, దళితజాతి సంస్కృతి గొప్పదనం, దళితకవుల తాత్వికభూమికను చర్చిస్తాయి. ఉద్యమాలను నిర్మించే సాహిత్య ప్రక్రియ కవిత్వం. అయినా పిడికిలి ఎత్తినదే కవిత్వమనే పిడివాదాన్ని కవిగా ఎల్లయ్య వ్యతిరేకిస్తాడు. దళిత కవుల జీవితంలో ఒత్తిడి, అవమానం ఉంటాయి కాబట్టి, వారి కవిత్వంలో ఎక్కువగా నిరసన ఉంటుందని కొందరు అపోహపడుతుంటారు. కానీ వారు ప్రబంధ వర్ణనను మించి రాయగలరని ‘ఉదయ పుంత’ తెలియజేస్తుంది. ఈ కవితలో ప్రకృతి తాత్వికత, దళితజీవన సౌందర్యం కనిపిస్తుంది. ‘‘వెన్నెల వెదజల్లిన మొగులు కొప్పర కప్పి/ తారలు పొదిగిన కంటిపొరల కింది కనుపాపల్లే/ నెమలి పురులిప్పిన భూమి బొంగురం జాల విప్పే/ ఆకాశపు కొప్పు దులిపిన గర్భం మొగులొల్లే/ బాలింత వాసన మబ్బు దిగిన వర్షం కురిసిన తలం/ పంటకు దూప పాదు మల్లి ఇగురుపొర పొద్దునద్దే/ పండు ఉదయపుంత కిరణం పానిపై లోకమల్లెచ్చే.../ అడవికొసరు పరుసుకున్న మనిషి యంత్రం పిప్పి’’ అంటాడు.
పై కవితలో మబ్బులు వర్షానికి తడవకుండా వెన్నెలకు కొప్పెరను కప్పి, తారలను కంటిపాపలా కాచి, కొప్పెర పట్టిన వర్షపు బిందువులను భూమిపై దులిపితే, అది బాలింత వాసనతో నిండుగర్భిణిలా మారుతుంది. పంటకు పాదుగా నీటినిచ్చి, తిరిగి మాయమై కొత్తచిగురు కాసేలా పొద్దును ఆహ్వానిస్తాయి. కవి దళిత ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నల్లని మబ్బును తీసుకున్నాడు. భూమిపై తన చెమటను చిందించడం, తోటి మనిషి యంత్రం చేతిలో పిప్పిలా మారి ప్రకృతిని దెబ్బతీసే తత్వాన్ని ఈ కవితలో వ్యక్తం చేశాడు. వేముల ఎల్లయ్య ఈ సంపుటిలో ఒకచోట ‘‘లేనితనమే మనిషి మేనిఫెస్టో’’ అంటాడు. ఎక్కువగా సఫాయికార్మికులు సామాజికంగా వెనుకబడినవారే ఉంటారు. ‘సఫాయి’ కవితలో వారి చెమట రుచిని, వారి మురికి జీవితాలలో గట్టుతెగిన కష్టాలను పట్టించుకోని నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ‘‘చెమట అద్దిన నాలికే మైలవగరు రుచి.../ పారతిప్పిన మోరి తట్టుతెగిన ము రుగు.../కులం దూర్చిన పనిగడియ ఏ కార్మిక మేనిఫెస్టో లిఖితం?/ ...గీ దేశం మురికి కులవీలునామే! ఏర్కుందా?’’ అని సమాజానికి ప్రశ్నను, మేలుకొలుపును ఒకేసారి సంధిస్తాడు. కవిత్వంలో కనిపించే ఆవేశం, ఆవేదన కవి జీవితంలోనూ చాలా సహజంగా కనిపిస్తుంది. ఇది కవి నిబద్ధతను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేదే కానీ, బలహీనత కాదు.
వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనతో దేశం అట్టుడికిపోయింది. కానీ తెలంగాణ రైతు కదలక పోవడానికి కారణాన్ని ‘యుద్ధరైతు’ కవితలో కారణాన్ని కళ్ళముందుపెట్టాడు. ‘‘రైతుబంధు నోట్లకట్టలు నోరు మూయించే/ సరిహద్దు దేశాన యుద్ధరైతు గెలుపుదారై/ మట్టి విత్తుపాదై మొలక గొడుగెత్తిన ఆకాశం/ ప్రపంచ చిత్రపటంలో వీరులు రైతులైండ్రూ’’ అంటాడు. పుస్తకంలోని కవితలన్నీ ఒకచోట తాత్వీకరిం చటం కవితాసంపుటి శీర్షిక కవిత ‘క్రీనీడ’లో కనిపిస్తుంది. ‘‘నిజంనీడ... ఛాయా దొరకని వినికిడి/... మూఢవిశ్వాసి శ్వాస దేవగత్తే ఊదుపొగ యంత్ర దెయ్యం/ శాస్త్రీయ జ్ఞానదోపిడీ రాజకీయ లూటి పదవిపగ్గం/ బంధువులు బంధుపథకం ఓట్ల ఖరీదు ముద్దెర రొక్కం/ గింత రక్తం ఎరుపు గడ్డగట్టిన నోట్ల ముడుపులు యాగబలి/ మత కౌగిలి రాజ్యాంగ ఎచ్చిడీ/ మణిపూర్ మంటలు.../మనువాది మతశిక్ష/ భూమి తిరిగిన క్రీనీడ బుగులైతుంన్ద్ర’’. నిజం కనుగొనలేని సంస్కృతినీడలో దళితులు, మతం ముసుగులో మతపెద్దలు, జ్ఞానం పేరుతో, రాజకీయం పేరుతో దోపిడీలు, బలహీనులపై అన్యాయాలు... ఇవన్నీ కవిని గుబులు కలిగించేవే. తాత్వికతతో బాటు కుల, మత, సంస్కృతీ భావనల వలన అట్టడుగుప్రజలు పడే బాధల పట్ల కవికి తార్కికత అవసరమని ఈ కవిత్వం ద్వారా నిరూపించాడు. కిందనీడ దళిత అణిచివేతకు ప్రతీకయితే, దానిపైన నీడ బహుజన జీవితాల అణచివేతకు ప్రతీక కావొచ్చు. దళిత, బహు జన స్పృహను మేల్కొలిపే గొప్ప తాత్విక తార్కిక కవిత్వం ‘క్రీనీడ’ కవిత్వం.
శీలం భద్రయ్య
98858 38288
ఇవి కూడా చదవండి..
Ex MP Kesineni Nani : డీలిమిటేషన్‌పై స్పందించిన మాజీ ఎంపీ
CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు
Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు
Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..
KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి
IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు
For Andhrapradesh News And Telugu News