Share News

కొన్ని సాహిత్యంతో బతికిన క్షణాలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 03:42 AM

కాసిని రూకల సంపాదనకు, ఆకలి శత్రువును మచ్చిక చేసుకొనేందుకు బ్రతుకు కట్టుకొయ్యకు బందీలమే అందరం. అరుదుగా అది వదులయే అవకాశం వస్తుంది. అప్పుడప్పుడు ప్రయాణాల రూపంలో...

కొన్ని సాహిత్యంతో బతికిన క్షణాలు

కాసిని రూకల సంపాదనకు, ఆకలి శత్రువును మచ్చిక చేసుకొనేందుకు బ్రతుకు కట్టుకొయ్యకు బందీలమే అందరం. అరుదుగా అది వదులయే అవకాశం వస్తుంది. అప్పుడప్పుడు ప్రయాణాల రూపంలో. నిత్యజీవన సంగ్రా మంలో ఒక ఆటవిడుపు ప్రయాణం. బంధిత తూనీగను ‘ఎగిరిపో’ అని అగ్గిపెట్టె తెరిచిన అద్భుతం. ఇటీవల అలా వచ్చిన అవకాశం సాహిత్య అకాడమీ వారి ఆహ్వానం. మార్చిలో 7 నుంచి 12 వరకు జరిగే ‘సాహిత్యోత్సవ్‌’లో పాల్గొనమని వచ్చిన పిలుపుతో మబ్బుల రాదారిపై పయనించి ఢిల్లీలోని సాహిత్య అకాడమీ కార్యాలయం ఆవరణలో అడుగుపెట్టాను. అడుగుపెట్టానో లేదో పుస్త కాల చిత్రాలతో ఏర్పాటు చేసిన అపురూపమైన స్వాగతద్వారాలు. అన్ని భాషల అక్షరాలను ఒకేచోట కొలువు తీర్చిన డిజైన్లు. కళ్ళెత్తి చూస్తే కనకాభిషేకాలు అన్నట్లు గోడల మీద కనిపించే వివిధ భాషల రచయితలు, కవుల ఫొటోలు. ఓ పక్కన కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న రచయితలు.


సాహిత్యంలో కథ, నవల, వ్యాసం, విమర్శ, ఎన్ని ప్రక్రియలున్నా కవిత్వం ఎక్కువగా భావోద్వేగాల ప్రవాహం. అందుకే దానికి ఆకర్షణ అధికం. ఈ ఆరు రోజుల సమావేశంలో మొత్తం 24 కవి సమ్మేళనాలు నిర్వహించారు. బహుభాషా కవి సమ్మేళనాలు, దళిత కవి సమ్మేళనం, అస్మిత, నారీ చేతన మొదలైన మహిళల కవి సమ్మేళనాలు ఈశాన్య, దక్షిణ భాషా కవి సమ్మేళనం శ్రోతల కవిత్వ దాహాన్ని తీర్చాయి. 11న కావేరీ సంభాగరలో ఎన్‌. కిరణ్‌ కుమార్‌ సింగ్‌ అధ్యక్షతన ‘టేస్టీ సౌండ్‌’ కవి సమ్మేళనంలో సిద్ధార్థ శంకర్‌ కలిత (అస్సామీ), రగకి బాక్‌ (కాశీ), టి.కె. సంతోష్‌ కుమార్‌ (మలయాళం), తిరు ప్రసాద్‌ (నేపాలీ), అక్షత రాజ్‌ (తుళు)లతో పాటు నేను ‘ఈ దేహం ఎవరిది’, ‘కూరగాయలమ్మాయి’, ‘వంటింటి సూర్యోదయాలు’ ఈ మూడు కవితలూ చదివాను. వీటిని కల్లూరి శ్యామల అనువదించారు. ఈ ఆరు రోజుల కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి శ్రీయుతులు ఖాదర్‌ మొహియుద్దీన్‌, ముకుంద రామారావు, రెంటాల జయదేవ్‌, ఎ. కృష్ణారావు, వేంపల్లి షరీఫ్‌, పి. జ్యోతి, తోట సుభాషిణి, ఓల్గా, రాగిళ్ళ రమేష్‌, స్వర్ణ కిలారి, పెండ్యాల గాయత్రి, కోడూరి విజయకుమార్‌, కొలకలూరి ఇనాక్‌ తదితరులు పాల్గొన్నారు.


కార్యక్రమాలన్నీ ఒకేసారి వేరు వేరు చోట్ల జరగడం వలన అన్నీ వినటం కుదరలేదు. ఈ సాహిత్య కార్యక్రమంలో ‘కథా సంధి’, ‘రచ యితతో ముఖాముఖి’, ‘సంవత్సర లెక్చర్‌’ ఈవెంట్స్‌ జరిగాయి. ముఖ్యంగా ఎనిమిదో తారీకున సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలకు సన్మాన కార్యక్రమం కూడా జరిగింది. ఈ సంవత్సరం విమర్శకు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు బహుమతి గ్రహీత. చివరిరోజు ప్రఖ్యాత బెంగాలీ కవి సుబోధ్‌ సర్కార్‌తో ముఖాముఖి చాలా అద్భుతమైన కార్యక్రమం. లెక్కకు మించి పుస్తకాలు రాసిన సుబోధ్‌ సర్కార్‌ తన ప్రసంగంలో ఎన్నో ఆసక్తికర విషయాలు చెప్పారు. బాల్యంలో ఒకసారి టికెట్‌ లేకుండానే రైలు ఎక్కారట. టీసీ వచ్చి పట్టుకొని ఫైన్‌ కట్టమంటే డబ్బులు లేవని చెప్తే పోలీస్‌ స్టేషన్‌కి తీసుకు వెళ్లారట. ‘‘నా దగ్గర టికెట్‌ లేదు. నా బుర్రలో కవిత్వం ఉన్నది’’ అని కవితలు చదివారట. అప్పుడు పంపించేశారట. ఆయన రాసిన కవితా సంపుటి గురించి– ఇది చదివితే 30ఏళ్ళ భారత దేశ చరిత్ర తెలుస్తుందన్నారు.


ఇటీవల జరిగిన మణిపూర్‌ సంఘటన గురించి ‘‘hacked my mothers of Manipur, she is burning’’ అని కవిత చదువుతున్నప్పుడు కన్నీటి నది ఐపోయింది మనసు. నేనూ కూడా మణిపూర్‌ సంఘటన మీద రాసిన ‘ఖబడ్దార్‌’ కవిత గుర్తుకు వచ్చింది. ఎంతో ప్రభావితం చేసిన ఆయన ముఖాముఖి విన్నాక– ‘‘మంచి కవిత్వమే ఉంది, రాజ్యమెందుకు’’ (సుకవితాయద్యస్తి రాజ్యేనకిమ్‌) అనే మాట గుర్తుకు వచ్చింది. టీ విరామ సమయాలలో అనేక భాషా కవులతో సంభాషణలు. తమిళ కవి రమేష్‌ మాటల సందర్భంలో తనకి కుప్పం యూనివర్సిటీ, బి. తిరుపతిరావు గారు తెలుసని చెప్పారు. తన కవితలను ఆ యూనివర్సిటీలో వారు అనువదించారని చెప్పారు. కన్నడ కవయిత్రి పూర్ణిమ, తమిళ కవయిత్రి అక్షతల స్నేహ సంభాషణలతో కవిత్వానికి ఎల్లలు లేవనిపించింది. ఈ సభలు చూడడానికి వచ్చిన మలయాళ కవి గణేష్‌ పుత్తూర్ తాను సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీతనని, తెలుగు కవి రమేష్‌ కార్తీక్‌ తెలుసని చెప్పారు. ఈ రెండు రోజులు అందరూ కలిసి మాట్లాడుకోవడం, కలిసి సమయం గడపడం, ఒక సాహిత్య వాతావరణంలో జీవించడం... నిజంగా ఇవే కదా బ్రతికిన క్షణాలంటే అనిపించింది. నాకు ఈ అవకాశమిచ్చిన సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాస్ రావుగారికీ, ప్రసేన్ గారికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఊగి ఊగి దిగినా ఇంకా కాసేపటి వరకు ఊగుతూనే ఉంటుంది ఉయ్యాల. అలాగే ఢిల్లీ ‘సాహిత్యోత్సవ్‌’ నుంచి వచ్చి పది రోజులు దాటినా ఇంకా అక్కడే తారట్లాడుతున్న ఆత్మ. ఇంకా చెవుల్లో వినిపిస్తున్న కవి సమ్మేళనం కవితలు, ప్రసంగాల పరంపరలు.


విశాలమైన ఢిల్లీ వీధులు, ఇరు పక్కలా చెట్లు, అతిథులను సేద తీర్చే ఆత్మీయమైన దీవెనలు. అద్భుతమైన వాతావరణం. బుద్ధుడికి రావిచెట్టు కింద జ్ఞానోదయమైనట్టు ఈ విశాల విశ్వ కవితా సాగరంలో నేనొక అతి చిన్న బొట్టునే అన్నది ఈ ఉత్సవాల్లో నేను గ్రహించిన నిజం.

మందరపు హైమవతి

94410 62732

ఇవి కూడా చదవండి..

Ex MP Kesineni Nani : డీలిమిటేషన్‌పై స్పందించిన మాజీ ఎంపీ

CM Chandrababu: పోలవరానికి సీఎం చంద్రబాబు

Vidadala Rajini: ఆయనకు నాపై చాలా కోపం.. ఎందుకో తెలియదు

Viral News: శవయాత్రలో ఆశ్చర్యకర ఘటన..

KTR: కేటీఆర్ కాన్వాయ్‌లో అపశ్రుతి

IPL Uppal Stadium: ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల దందా.. రంగంలోకి పోలీసులు

For Andhrapradesh News And Telugu News

Updated Date - Mar 24 , 2025 | 03:42 AM