మన కాకతీయ కొదమ సింహం!
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:19 AM
శివాజీ పుత్రుడైన శంభాజీ చరిత్ర ‘ఛావా’ అనే పేరుతో సినిమా రూపంలో వచ్చింది కనుక మనకు ఆయన గొప్పతనం, త్యాగం, మరాఠీల గొప్పతనం తెలిసింది (ప్రధానంగా నేటి యువతకు). కానీ అంతకు కొన్ని వందల ఏళ్ళ ముందే గొప్ప త్యాగం...

శివాజీ పుత్రుడైన శంభాజీ చరిత్ర ‘ఛావా’ అనే పేరుతో సినిమా రూపంలో వచ్చింది కనుక మనకు ఆయన గొప్పతనం, త్యాగం, మరాఠీల గొప్పతనం తెలిసింది (ప్రధానంగా నేటి యువతకు). కానీ అంతకు కొన్ని వందల ఏళ్ళ ముందే గొప్ప త్యాగం చేసిన మన కాకతీయ ప్రతాపరుద్రుడి చరిత్ర అజ్ఞాతంగా పుస్తకాల్లో ఉండిపోయింది.- ప్రభుత్వాలు కూడా మరిచిపోయాయి. ఇవాళ ఆ చక్రవర్తి పుట్టిన రోజు సందర్భంగానైనా ఆయన్ని తలచుకుందాం! 1303లో ప్రారంభమైన ఢిల్లీ సుల్తానుల దండయాత్రలని 1323 వరకు మొక్కవోని దీక్షతో ఎదుర్కొని వారిని దక్షిణభారతం దేశం వైపు విస్తరించనివ్వకుండా అడ్డుకున్న మహా సాహసి ప్రతాపరుద్రుడు. నాటి కాకతీయ సామ్రాజ్యం చిన్నదేమీ కాదు. దక్షిణ భారతదేశం మొత్తం వ్యాపించి ఉండేది. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్న అల్లావుద్దీన్ ఖిల్జీ తన వట్టిపోయిన ఖజానాను నింపుకోవడం కోసం సుసంపన్న దక్షిణ భారతదేశంపై దృష్టి నిలిపాడు.
అతనికి దేవగిరి రాజధానిగా కలిగిన యాదవ రాజ్యం, కాకతీయుల పరిపాలనలో ఉన్న ఓరుగల్లు కనిపించాయి. మొట్టమొదట 1295లో ఖిల్జీ దేవగిరిపై దాడి చేశాడు. ఓటమిపాలైన యాదవ రాజు రామచంద్ర దేవుడు సంధి చేసుకొని అపార ధనరాశులని ఖిల్జీకి కానుకగా సమర్పించుకున్నాడు. సామంతుడిగా మారిపోయాడు. 1303లో ఖిల్జీ అపార సైన్యాన్ని ఓరుగల్లు పైకి దండయాత్రకు పంపించాడు. ఖిల్జీ సైన్యం కదలికలను ప్రతాపరుద్రుడు పసిగట్టాడు. తన సైన్యంతో నేటి కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ దగ్గర గల ఉప్పరపల్లి వద్ద ఎదురేగి మరీ ఢిల్లీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. దేవగిరి లాగే ఎంతో సునాయాసంగా కాకతీయులను ఓడించవచ్చునన్న వెర్రి భ్రమలతో కాకతీయులపై యుద్ధానికి దిగిన ఖిల్జీకి ఉప్పరపల్లి వద్ద చేదు అనుభవం ఎదురైంది. ఉప్పరపల్లి యుద్ధభూమిలో ఖిల్జీ సైన్యం చావుదెబ్బ తిన్నది. చచ్చినవాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు ఢిల్లీ వైపు పారిపోయారు. భారతదేశాన్ని పాదాక్రాంతం చేసుకున్న ఖిల్జీకి ఓటమి రుచి చూపించాడు ప్రతాపరుద్రుడు. అల్లావుద్దీన్ ఖిల్జీకి ఎదురైన ఈ గర్వభంగాన్ని వెలుగోటి వారి వంశావళి లోను, ఆ యుద్ధంలో పాల్గొన్న పోతుగంటి మైలి, వెన్నడు, నాగదేవుని శాసనాల్లోనూ నేటికీ చూడవచ్చు.
ఇలా ఒక్కసారే కాదు, ఆయన పరిపాలించిన 22 సంవత్సరాల్లో తొమ్మిదిసార్లకు పైగా ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుపై దండయాత్రలు చేశారు. అందులో సింహభాగం ప్రతాపరుద్రుడే గెలిచాడు. ఆ తొమ్మిది యుద్ధాలలో రెండు యుద్ధాల్లో మాత్రమే ఓడిపోయాడు. అవి 1309 నాటి యుద్ధం, 1323 నాటి చివరి యుద్ధం. ఈ ఓటమి కూడా శత్రువు కుయుక్తుల ఫలితమే. 1309లో సుల్తాన్ సైన్యం ఆరు నెలల పాటు పోరాడినప్పటికీ ఓరుగల్లు కోట లొంగకపోయేసరికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్ని పీడించి, హింసించారు. తద్వారా ప్రతాపరుద్రుడిపై మానసిక ఒత్తిడి పెంచి సంధికి అంగీకరించేలా చేశారు! అటు తర్వాత జరిగిన అధికార మార్పిడిలో ఖిల్జీ తర్వాత ఘియాజుద్దీన్ తుగ్లక్ 1320లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఆ వెంటనే ఒట్టిపోయిన ఖజానాను నింపుకోవడం కోసం 1323లో ఎంతకు లొంగని ఓరుగల్లు పైకి దండెత్తాడు. ఈ యుద్ధాల గురించిన సమాచారం మనకు ఫెరిస్థా ఇసామీ, బారౌని, ఇమాన్ భతూత లాంటి ముస్లిం చరిత్రకారులు రాసిన పుస్తకాల ద్వారా తెలుసుకోవాల్సి రావడం దురదృష్టకరం. ఎందుకంటే నిజాలు రాసి సుల్తాన్లకు కోపం తెప్పించలేక వారు కాకతీయుల ఘనవిజయాల్ని మసిపూసి మారేడు కాయ చేశారు. ప్రతాపరుద్రుడి చేతిలో పలుమార్లు ఓటమిపాలైనప్పుడల్లా మాకై మేమే వెనుదిరిగామంటూ కాకమ్మ కథలు రాశారు.
చివరి యుద్ధానికి ముందు జరిగిన యుద్ధంలో తుగ్లక్ సైన్యాలు ఓటమిపాలై కాకతీయ సైన్యాలు వెంటపడి తరుముతుంటే పారిపోయి దేవగిరి చేరుకున్నాయి. అక్కడ రామచంద్ర దేవుడి దేవగిరి సైన్యాలను జత చేసుకుని కొన్ని రోజుల వ్యవధిలోనే ఓరుగల్లుపై మళ్ళీ దాడి చేశాయి. ఢిల్లీ సుల్తానులతో ప్రతి యుద్ధం మధ్యా ఎన్నో సంవత్సరాల తేడా ఉండడంతో ఢిల్లీ సైన్యాలు మళ్ళీ ఇప్పుడప్పుడే తమ మీదికి దాడికి రావని భావించిన ప్రతాపరుద్రుడు రైతులుగా ఉన్న తన సైన్యాన్ని వ్యవసాయ పనులకు, వారి సొంత ఇళ్ళకు పంపేశాడు. అతికొద్ది సైన్యం మాత్రమే ఓరుగల్లు కోటలో ఉంది. అంత తక్కువ వ్యవధిలో సుల్తాన్ మళ్ళీ దాడికి దిగుతాడని ఊహించని ప్రతాపరుద్రుడు నిరుత్తరుడయ్యాడు. వెంటనే తేరుకొని అందుబాటులో ఉన్న సైన్యాన్ని పోగేసి శత్రుపై దాడి మొదలుపెట్టాడు. త్వరలోనే కోటలో ఆహార ధాన్యాలు పూర్తిగా అయిపోయాయి. ఆకలి బాధకు తట్టుకోలేక లెక్కకు మించి పరివారం, సైనికులు పిట్టల్లా రాలిపోసాగారు. మరోపక్క కోట ఎంతకూ లొంగకపోయేసరికి ఢిల్లీ సుల్తాన్ సైన్యాలు అసహనానికి లోనై కోట బయట గల పరిసర ప్రాంత ప్రజల ధన ధాన్యాలు దోచుకుంటూ, ఇండ్లను తగలబెడుతూ, స్త్రీలను చెరబట్టడం మొదలుపెట్టారు. ఎటు చూసినా అసహాయ ఆర్తనాదాలు, ఆకాశాన్నంటే మంటలతో తగలబడుతున్న గ్రామాలు, కూలిపోతున్న గుళ్లు, యుద్ధంతో సంబంధంలేని నిర్దోషులైన ప్రజలు సైతం శత్రువుల చేతుల్లో హతమారిపోతున్నారు! వేగుల ద్వారా ఈ విషయాల్ని విన్న ప్రతాపరుద్రుడు తట్టుకోలేకపోయాడు. మరిన్ని నెలలు పోరాడే సత్తువ ఉన్నప్పటికీ తన ప్రజల దయనీయ స్థితికి చలించి తన పరివారంతో వెళ్ళి తుగ్లక్ సైన్యాధిపతి ఉలుగ్ ఖాన్ ముందు లొంగిపోయాడు. తనను పలుమార్లు ఓడించిన ఆ ధిక్కార కణం తన ముందు తలవంచితే చూడాలని అక్కడ ఢిల్లీ సుల్తాన్ ఎదురుచూస్తున్నాడు. కానీ తన ప్రజల మానాభిమానాలకు ప్రతీక అయిన ప్రతాపరుద్రుడు ఢిల్లీకి వెళ్లే మార్గమధ్యంలో నర్మదా నది తీరం వద్ద ఆత్మార్పణ గావించుకొని సుల్తాన్ కలల్ని కల్లలు చేశాడు. తన ఆత్మార్పణ తన ప్రజల్లో ఆగ్రహావేశాలను రగిలిస్తుందని, వారందరినీ ఏకం చేసి శత్రువును మట్టికరిపిస్తుందని, అత్యంత ఉన్నత స్థాయి నిరసన ఐన ఆత్మత్యాగాన్ని ఎంచుకున్నాడు. ఇచ్ఛా మరణాన్ని ఆహ్వానించాడు. ఆయన ఆశించినట్లుగానే అటు తర్వాత ఆయన సేనా నాయకులైన కొలని రుద్రదేవుడు, రేచర్ల సింగమనేడు, బెండపూడి అన్నయ మంత్రి వీరు ముగ్గురు, కాకతీయుల 72 మంది సామంతులలో ఒకరైన రేఖపల్లి సంస్థానాధీశుడైన ముసునూరి ప్రోలయ నాయకుడి నాయకత్వంలో ప్రజలతో కలిసి తిరుగుబాటు చేశారు.
1336లో ఢిల్లీ సుల్తాన్ల సైన్యాన్ని ఓడించి వారిని తరిమికొట్టి తిరిగి ఓరుగల్లు కోటపై స్వరాజ్య పతాకాన్ని ఎగరవేశారు. వీర శివాజీకి మహారాష్ట్ర ప్రజల్లోను, మహారాణా ప్రతాప్‌కు రాజస్థాన్ ప్రజల్లోను ఒక పదిలమైన స్థానం ఉంది. కానీ మన ప్రతాపరుద్రుడి విషయంలో ఆ స్థానాన్ని కల్పించడంలో మన ప్రభుత్వాలు విఫలమైనాయి! ఆయన 1254వ సంవత్సరం మార్చి 25న జన్మించాడు ఆ రోజును ప్రతి ఏటా ఒక ఉత్సవంలాగా జరుపుకుంటే ఆ మహనీయుడి త్యాగాన్ని గౌరవించినట్లు అవుతుంది. మన మట్టిలో పుట్టి, ఒకానొక మహా సామ్రాజ్యానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడై, భారతావనిని శాసించి, మన పూర్వీకుల ఆత్మగౌరవాన్ని నిలపడానికి ప్రాణత్యాగం చేసిన మనిషిని ఏటేటా స్మరించుకోవద్దూ!
డా. అంబటి శ్రీనివాస్‌రాజు
(నేడు ప్రతాపరుద్రుడి జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For AndhraPradesh News And Telugu News