Share News

జెలెన్‌స్కీ హీరో కాదు, జీరో

ABN , Publish Date - Mar 21 , 2025 | 01:42 AM

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపుకీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకీ మధ్య వాషింగ్టన్‌ ఓవల్‌ ఆఫీసులో జరిగిన వాగ్యుద్ధం ఒక ప్రపంచ సంచలనం అయింది. యూరపునైతే....

జెలెన్‌స్కీ హీరో కాదు, జీరో

ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంపుకీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీకీ మధ్య వాషింగ్టన్‌ ఓవల్‌ ఆఫీసులో జరిగిన వాగ్యుద్ధం ఒక ప్రపంచ సంచలనం అయింది. యూరపునైతే అది కుదిపేసింది. ఇటీవల అమెరికా పాలకుల స్వభావం మారలేదు కాని వారి ఎత్తుగడలలో చీలిక వచ్చింది. అమెరికా తన లక్ష్యాలను తిరిగి వేరుగా నిర్వచించుకోవాలి అన్న ధోరణికి ప్రతినిధి డొనాల్డ్‌ ట్రంప్‌. అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్‌ మాటల్లో చెప్పాలంటే, ‘‘నగరానికి కొత్త షెరీఫ్‌ వచ్చాడు.’’ అంటే రంగంలోకి ట్రంప్‌ వచ్చాడు. ట్రంప్‌ వచ్చీ రాగానే అమెరికా పాత ఏర్పాటుని మార్చే పనిని హడావుడిగా మొదలుబెట్టేసాడు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక రంగాలలో ఈ డబడబలూ పెను కంపాలు అందుకే. రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుంచీ ప్రపంచంలో తిరుగులేని ఆర్థిక శక్తిగానూ సైనిక శక్తిగానూ ఏపుగా ఎదుగుతూ వచ్చిన అమెరికా ప్రపంచానికి పెద్దన్న అయింది. ఇప్పుడు అమెరికా ఆటలకి అడ్డుకట్ట వేసే శక్తులు క్రమంగా రంగంలోకి వచ్చాయి. చైనా ఒక కొత్త సామ్రాజ్య శక్తిగా, ఆర్థిక శక్తిగా సవాలు విసురుతోంది. రష్యా కొంత కోలుకొని నిలబడింది. మరోవైపు అమెరికా ఆర్థిక పతనం పుంజుకొంటోంది. అమెరికా జాతీయ రుణం 36 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి పెరిగింది.


ఈ సందర్భంలో తమ పాత ఏర్పాటుకి కాలం చెల్లిందనీ, మరో కొత్త ‘‘ఏర్పాటు’’ అవసరమనీ ట్రంపు వర్గం భావిస్తోంది. ఓవల్‌ ఆఫీసు డ్రామా తర్వాత, జెలెన్‌స్కీని హీరోగా చూపించే కథనాలు వచ్చాయి. నిజానికి, ఒక పెద్ద ఆటలో జెలెన్‌స్కీ ఒక చిన్న బుడంకాయ. ఈ బుడంకాయకు భవిష్యత్తు లేదు. అతడు అమెరికా, యూరపు నాయకుల రాజకీయ క్రీడలో ఒక పావు మాత్రమే. అతనికి ఒక స్వతంత్ర పాత్ర ఏదీ లేదు. రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం మొదలైన నాటి నుంచీ, ఈ బంటుని యూరపు అమెరికాలు బాగానే మేపుతూ వచ్చాయి. నాటో దేశాల్లో ఎక్కడికెళ్లినా అతడికి డబ్బూ ఆయుధాలూ ఇచ్చి బుజ్జగించారు. ఈ గారాబం జెలెన్‌స్కీ తలకెక్కింది. ట్రంప్‌ వచ్చాక అదంతా మారిపోతోంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు కావడానికంటే ముందే రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్‌ కుదేలయిపోయింది. ఉక్రెయిన్‌ వాస్తవ పరిస్థితి తెలిసిన నిపుణుల మాట ఇది. ఆ సంగతి జెలెన్‌స్కీకి తెలుసు. అయితే తన కుక్క చావుని, ప్రపంచానికి ఒక వీర మరణంగా చూపించాలన్న కోరిక కూడా ట్రంప్‌ ముందు అతని కుప్పిగంతులకు మరో కారణం. మరో విశేషం: సమావేశాన్ని రద్దు చేద్దామని ట్రంప్‌ ముందు జెలెన్‌స్కీకి కబురుచేశాడు. కాని జెలెన్‌స్కీ మాత్రం వస్తానని పట్టుబట్టాడు. అప్పుడు, జెలెన్‌స్కీ వచ్చేది, కేవలం తమ ఉమ్మడి ఒప్పందం మీద సంతకం చేయడానికి మాత్రమే అని ట్రంపు బహిరంగ ప్రకటన చేశాడు.


అంతవరకూ ఉక్రెయిన్‌కి అందించిన భారీ ‘‘సాయా’’నికి గాను, ఉక్రెయిన్‌ తన ఖనిజ సంపదపైన వందేళ్ల పాటు అమెరికాకు హక్కులు కల్పించాలి అన్నదే ఒప్పందం. తామిచ్చిన సాయం 350 బిలియన్‌ డాలర్లని ట్రంప్‌ చెప్పాడు. సామ్రాజ్యవాదుల ‘‘సాయం’’ మరి అలాగే ఉంటుంది. ఈ ఘోరమైన ఒప్పందం గురించి సమావేశానికి ముందే జెలెన్‌స్కీకి తెలుసు. ఓవల్‌ ఆఫీసులో కెమేరాల ముందు అతడు ఒక క్షతగాత్రుడిలా డ్రామా ఆడాడు. అక్కడ ఒక దేశ భక్తునిగా, తన దేశం కోసం ట్రంపునయినా ఎదుర్కోగల వీరునిగా అవతారం ఎత్తాడు. ఇప్పుడు ట్రంపుని మంచి చేసుకోడానికి నానా తంటాలు పడుతున్నాడు. ఖనిజ సంపదపై అమెరికాకు హక్కులు రాసివ్వడానికి, దేశాన్ని తాకట్టు పెట్టడానికి అతడు సిద్ధమే. అయితే, యుద్ధం ఆగకూడదు, తన పదవి ఊడగూడదు. ఎంతకాలం? రష్యాని ఓడించే దాకా. అది సాధ్యమా? ఈ ప్రశ్న ఒక రిటైరైన అమెరికా కల్నల్‌ని అడిగితే, ఆయన నవ్వకుండా చెప్పిందిది: రష్యన్లందరూ ఓ ఉదయం లేవగానే నడవడం ఎట్లాగో మర్చిపోతే, అది సాధ్యం. యుద్ధం కొనసాగితే జనం అన్యాయంగా చచ్చిపోతూనే ఉంటారు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ జనం. యుద్ధం ఆగిపోతే నాశనమయ్యేది, జెలెన్‌స్కీ, అతని ముఠా మాత్రమే. ఉక్రెయిన్‌లో మార్షల్‌ లా కొనసాగుతోంది. ఎన్నికలు సక్రమంగా జరిగితే జెలెన్‌స్కీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. అందుకే అతడు ఎన్నికలకు వెళ్లడు. మార్షల్‌ లా పొడిగిస్తాడు. ఎన్నికలు జరపక తప్పని పరిస్థితి ఎదురైతే వాటిని సక్రమంగా జరగనీయడు. ప్రపంచాన్నంతా అదుపు చెయ్యాలన్న తన పాత ధోరణిని వదులుకోక తప్పదని ట్రంప్‌ దళం గ్రహించింది. ఇకముందు సమ ఉజ్జీలతో దీర్ఘ కాలంపాటు సాగే యుద్ధాల్లో అది ఇరుక్కోకపోవచ్చు. తాను కొడితే తిరిగి కొట్టలేని అర్భకుల మీద దాడులకే అది పరిమితం కావచ్చు. ఈ క్రమంలో జెలెన్‌స్కీ లాంటి పెంపుడు కుక్కల్ని తగ్గించుకొని వాటిపై గతంలో పెట్టిన మదుపుని వడ్డీతో సహా వెనక్కి తీసుకోవాలనుకోవచ్చు.


యూరపుని కూడా అది తన ప్రాధమ్యాల నుంచి తొలగించవచ్చు. జెలెన్‌స్కీ ట్రంపుని కలవడానికంటే ముందే ఫ్రెంచి అధ్యక్షుడు మాక్రాన్‌, బ్రిటిషు ప్రధాన మంత్రి స్టార్మర్‌ ఒకరి తరవాత ఒకరు ట్రంపుని కలిశారు. వారి లక్ష్యం: యూరపు భద్రతకి, వారి శాంతి దళాల భద్రతకీ అమెరికా హామీ ఇవ్వాలి; రష్యా కొమ్ములు విరగ్గొట్టాలి. ఈ నాయకులకు కావల్సింది శాంతి కాదు; యుద్ధం. అందుకు అమెరికా నడుం బిగించాలి. రష్యాతో పోరాటంలో తమల్ని ముందుండి నడపాలని వారు కోరినప్పుడు, ట్రంపు వారి సైనిక శక్తిని పొగిడి వారికి అమెరికా అవసరం లేదనీ, వారే స్వయంగా రష్యాని ఎదుర్కోగలరని చెప్పి చేతులు దులుపుకొన్నాడు. ఒక బ్రిటిషు విలేఖరి వ్యాఖ్యానించినట్టుగా అంతవరకూ ‘‘రాజుగారి విదూషకుల్లాగా’’ ప్రవర్తించిన ఆ ఇద్దరు యూరపు నాయకులూ ట్రంపు మాటలకి ఏడవలేక నవ్వారు. అమెరికాకి ఇప్పుడు చైనాని నిరోధించడమే ప్రధానం. అమెరికా తన సొంత సహజ సరిహద్దుల్లో, సుస్థిరం కావాలనుకొంటోంది. సహజ సరిహద్దులు అంటే, కెనడా, మెక్సికో, గ్రీన్‌లాండు, పనామా కెనాల్‌ తదితరాలు. ఇక, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం మాటకొస్తే, ఇప్పటికే రష్యా దాదాపు జయించింది అన్నది నిపుణుల అంచనా. ఉక్రెయిన్‌ భూభాగాలను రష్యా ఎంత ఆక్రమించింది అన్నది ఇక్కడ గీటురాయి కాదు. అది ఉక్రెయిన్‌ సైనికశక్తిని ఎంత నిర్వీర్యం చేసింది అన్నదే ప్రధానం. ఇప్పుడు ఉక్రెయిన్‌కి రిజర్వు దళాలు అంతమైపోయాయి. రిజర్వు ఆయుధాలూ లేవు. సైనికుల ఆత్మస్థయిర్యం అత్యంత దిగువ స్థాయిలో ఉంది. ప్రజల్లో యుద్ధ విముఖత భారీగా పెరిగింది. జెలెన్‌స్కీ ఓ రాజకీయ జూదరి. తాజా కుర్‌స్క్‌ యుద్ధంలో అతడి నడ్డి విరిగింది. యుద్ధ రంగం వదిలిపోతున్న ఉక్రెయిన్‌ సైనికుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పుడు, అమెరికా కూడా తన కాడి కింద పడేసింది. యూరపు దేశాలు మాత్రం మాటల్లో సంఫీుభావం ప్రకటించాయి. పాత వార్సా దేశాలైన పోలెండు, మూడు బాల్టిక్‌ దేశాలతో పాటు స్కాండినేవియన్‌ దేశాలు కూడా ఉక్రెయిన్‌కి సంఫీుభావం తెలిపాయి. ఈ ‘‘సంఫీుభావాల’’న్నీ కలిసినా అంతిమ ఫలితాన్ని మార్చలేవు. ట్రంపుతో చర్చల్లో నెల రోజుల యుద్ధ విరమణకి అంగీకరిస్తూనే, యుద్ధానికి గల మూలకారణాలను తొలగించమంటున్నాడు పుతిన్‌. అంటే, నాటో సంగతి తేల్చమంటున్నాడు. అంతే కాదు. ఉక్రెయిన్‌కి, విదేశీ సహాయం – ఆయధాలు, డబ్బు, గుప్త సమాచారం వగైరాలు– ఆగిపోవాలి, అంటున్నాడు. పక్క నుంచి జెలెన్‌స్కీ గుండెలు బాదుకుంటూ ఏదో అరుస్తూనే ఉన్నాడు. వినేవాడే లేడు.

ఎ. గాంధి

(సంపాదకుడు, పీకాక్‌ క్లాసిక్స్)

ఈ వార్తలు కూడా చదవండి...

Marri Rajasekhar: జగన్ అలా చేయడం తీవ్రంగా బాధించింది

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Mar 21 , 2025 | 01:42 AM