AP Govt : నల్లజర్ల ఘటనపై సర్కారు సీరియస్
ABN , Publish Date - Mar 23 , 2025 | 04:53 AM
తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలోని గాంధీ కాలనీలో భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది.

‘అంబేడ్కర్’ను అవమానించినవారిపై కఠిన చర్యలు
డీజీపీని ఆదేశించిన సీఎం చంద్రబాబు
నిందితుల అరెస్టుకు ప్రత్యేక పోలీసు బృందాలు
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలోని గాంధీ కాలనీలో భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకుంది. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు శనివారం మాట్లాడారు. అంబేడ్కర్‌ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే వారిపై నిఘా ఉంచాలని సూచించారు. డీజీపీ స్పందిస్తూ.. ఈ ఘటనలో కుట్ర కోణాన్ని వెలికితీయడానికి దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. నిందితుల అరెస్టుకు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని సీఎంకు వివరించారు.
రాష్ట్రంలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయని, అలాంటివారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ హెచ్చరించారు.