Tariff War Erupts: దీటుగా తిప్పికొడతాం
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:55 AM
అమెరికా ప్రకటించిన ప్రతీకార సుంకాలపై చైనా, యూరోపియన్ యూనియన్, కెనడా, జపాన్ సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. చర్చలు విఫలమైతే తాము దీటుగా తిప్పికొడతామని ఈయూ, చైనా హెచ్చరించాయి

అమెరికా ప్రతీకార సుంకాలపై చైనా
ట్రంప్ నిర్ణయం సరికాదన్న వివిధ దేశాధినేతల
చర్చలకు సిద్ధం.. లేదంటే ప్రతిచర్య తప్పదు : ఈయూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతీకార సుంకాల నిర్ణయాన్ని అమెరికా తక్షణమే వెనక్కి తీసుకోవాలని చైనా పేర్కొంది. లేనిపక్షంలో తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అమెరికా చర్యలను దీటుగా తిప్పికొడతామని హెచ్చరించింది. ప్రతీకార సుంకాలపై ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే వైట్‌హౌస్ యంత్రాంగంతో ఫోన్‌లో మాట్లాడిన చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ.. ప్రతీకార సుంకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. అమెరికా నిర్ణయం ప్రపంచ ఆర్థికాభివృద్ధిని ప్రమాదంలో నెట్టేలా ఉందని తెలిపింది. ‘ప్రతీకార సుంకాల పేరిట అమెరికా తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా బెదిరింపులకు దిగడమే. ప్రతీకార సుంకాలు అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా లేవు. వాణిజ్య యుద్ధం లో విజేతలు ఉండరు’ అని పేర్కొంటూ చైనా వాణిజ్య శాఖ ఓ ప్రకటన చేసింది. ట్రంప్ ప్రతీకార సుంకాలపై యూరోపియన్ యూనియన్ (ఈయూ) తీవ్రంగా స్పందించింది. ట్రంప్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎదురుదెబ్బ అని ఈయూ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. ప్రతీకార సుంకాల అంశంలో వైట్‌హౌ్‌సతో చర్చలకు తాము సిద్ధమని.. చర్చలు విఫలమైతే ప్రతిచర్యలు కచ్చితంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈయూ ప్రతిచర్య ఏంటనేది నెలాఖరులోగా తెలుస్తుందని ఫ్రెంచ్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు అన్నారు.
అమెరికా నిర్ణయానికి కెనడా దీటుగా బదులిచ్చింది. తాము ప్రతీకార సుంకాలు విధిస్తామని పేర్కొన్న కెనడా ప్రధాని మార్క్ కార్నే.. అమెరికా నుంచి దిగుమతయ్యే వాహనాలపై 25శాతం సుంకం వేస్తామని ప్రకటించారు. కాగా, ప్రతీకార సుంకాలపై అమెరికా నిర్ణయం ఆ దేశ ప్రజలకే నష్టం కలిగిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ ప్రకటించారు. అమెరికా ప్రతీకార సుంకాలను జపాన్ కూడా తప్పుబట్టింది. అమెరికాలో అత్యధిక పెట్టుబడులు పెడుతున్న జపాన్‌పై కూడా సుంకాలు విధించడం ఏంటనీ? జపాన్ ప్రధాని షెగురు ఇషిబా ప్రశ్నించారు. ప్రతీకార సుంకాల విధింపుపై తాము అమెరికాతో మాట్లాడతామని తైవాన్ ప్రకటించింది. ప్రతీకార సుంకాల పేరిట అమెరికా మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ఇరువర్గాలకు నష్టం కలిగిస్తుందని ఇటలీ, జర్మనీ దేశాలు పేర్కొన్నాయి. ప్రతీకార సుంకాలపై అమెరికాతో చర్చించి ఒప్పందాలు చేసుకుంటామని ఐర్లాండ్, స్వీడన్ ప్రకటించాయి.
ఇవి కూడా చదవండి
Supreme Court Orders: హెచ్‌సీయూ భూములపై తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీం ఆదేశాలు
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest National News And Telugu News