Myanmar Earthquake: నైఫిడోలో తాజా ప్రకంపనలు..గోరుచుట్టుపై రోకటిపోటు
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:22 PM
శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మరోసారి మయన్మార్ రాజధాని నైఫిడోలో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

నైఫిడో: మయన్మార్ (Myanmar) చిగురుటాకులా వణికిపోతోంది. మయన్మార్‌ను కుదిపేసిన భారీ భూకంపంలో మృతుల సంఖ్య 1,002కి చేరుకోగా, క్షతగాత్రుల సంఖ్య 2,376కు చేరింది. తాజాగా శనివారం మధ్యాహ్నం 2.50 గంటలకు మరోసారి మయన్మార్ రాజధాని నైఫిడో (Naypyidaw)లో భూప్రకంపనలు సంభవించాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైనట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. శుక్రవారంనాడు ఇదే ప్రాంతంలో భూకంపతాకిడికి తీవ్ర నష్టం జరగగా, తాజా ప్రకంపకనల ప్రభావం ఏమేరకు ఉందనేది వెంటనే తెలియలేదు.
మయన్మార్‌ను కేవలం 11 నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు శుక్రవారంనాడు కుదిపేశాయి. తొలి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. దీంతో భారీ విధ్వంసం చేటుచేసుకుంది. పలు భవంతులు, వంతెనలు, చారిత్రక కట్టడాలు పేకమేడల్లా కుప్పకూలాయి. రోడ్లు, హైవేలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 15 లక్షల మంది జనాభాతో మయన్మార్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన మాండలే ఈ భారీ విధ్వంసానికి కేంద్ర స్థానంగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ విలయంలో 1,0002 మంది ప్రాణాలు కోల్పోగా, 2,300 మందికి పైగా గాయపడినట్టు, శిథిలాలను తొలగిస్తుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఈ సంఖ్య 10,000కు దాటవచ్చని యూఎస్‌జీఎస్ అంచనా వేస్తోంది.
పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లో కూడా శుక్రవారం భూప్రకంపనలతో పలు ఇళ్లు, నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనాలు కంపించిపోయాయి. సుమారు 9 మంది మృతి చెందినట్టు చెబుతున్నారు.