సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా..
ABN , Publish Date - Apr 02 , 2025 | 01:02 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రెండు, మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు ప్రైవేట్ స్కూల్స్‌లో భారీగా పెరుగుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకురావాలని ఆలోచిస్తోంది.

కరీంనగర్ టౌన్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రెండు, మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. మరోవైపు ప్రైవేట్ స్కూల్స్‌లో భారీగా పెరుగుతోంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూల్స్‌లో విద్యార్థుల సంఖ్యను పెంచి పూర్వవైభవం తీసుకురావాలని ఆలోచిస్తోంది.
ఫ ప్రత్యేక ప్రణాళిక
ఒక్కో విద్యార్థికి దాదాపు 80 వేల రూపాయల వరకు ఖర్చుచేస్తూ విద్యతోపాటు మధ్యాహ్న భోజనం, ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్స్‌ను అందిస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నా విద్యార్థుల చేరికలు ఎందుకు తగ్గుతున్నాయనేదానిపై క్షేత్రస్థాయి నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. బడిబాట కార్యక్రమాన్ని చేపట్టి బడీడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించడం, బడిమానేసిన వారిని చేర్చుకోవడం వంటివాటిని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఏప్రిల్ 23 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ సెలవుల్లో ఉపాధ్యాయులకు విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, పాఠశాలల్లోని సౌకర్యాలను వివరించడం వంటివాటిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలను ఖరారుచేసి సెలవులకు ముందే వాటిని ప్రకటిస్తుందని ఇటీవల జరిగిన జిల్లా విద్యాశాఖ అధికారుల సమావేశంలో ఉన్నతాధికారులు చెప్పినట్లు తెలిసింది.
ఫ ఉపాధ్యాయులకు లక్ష్యాలు
ప్రతి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులకు లక్ష్యాలు నిర్దేశించడంతోపాటు చేర్పించిన విద్యార్థుల సంఖ్యను బట్టి వారికి ప్రోత్సాహాన్ని అందించే విధంగా పాయింట్స్‌ను ఇస్తారు. ఉపాధ్యాయులు సాధించిన పాయింట్స్‌ను వారి సర్వీసు బుక్కుల్లో చేర్పించి పదోన్నతులు, బదిలీల సమయంలో వారికి ప్రయోజనం చేకూర్చుతారు. దీంతో ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంగా విద్యార్థులను చేర్పించేందుకు కృషి చేస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా గత మార్చినెలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ (కృత్రిమే మేఽధ) ద్వారా బోధనను ప్రభుత్వం ప్రారంభించింది. విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారి ప్రావీణ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు కంప్యూటర్ ద్వారా వారికి అర్థమయ్యేలా విద్యాబోధన చేసేందుకు 50కిపైగా విద్యార్థులున్న పాఠశాలలకు రెండేసి కంప్యూటర్లు, హెడ్స్‌ఫోన్స్‌ను పంపించేందుకు చర్యలు తీసుకుంటుంది.
ఫ అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతులు
అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చే విధంగా ఆధునిక హంగులతో తరగతి గదులు, ఫర్నీచర్, ఫ్యాన్లు, తాగునీటి వసతి, భోజన గది వంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. కలెక్టర్ పమేలా సత్పతి ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. కూరగాయలను పండించి, వాటితో మధ్యాహ్న భోజనం పెట్టే విధంగా కిచెన్, విటమిన్ గార్డెన్స్‌ను ఏర్పాటు చేయిస్తున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల్లో కిచెన్ గార్డెన్లలో పండించిన కూరగాయలతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు. ఈ చర్యల ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.