Mother Dog: నా కూనను కాపాడరా..!
ABN , Publish Date - Jan 19 , 2025 | 03:59 AM
కన్నబిడ్డల పట్ల తల్లి చూపించే ప్రేమకు కొలమానం ఉండదు. మనుషులైనా, మూగజీవాలైనా కన్నప్రేమ విషయంలో ఎలాంటి తేడా ఉండదు. ఇది నిజమని నిరూపించే ఘటన ఒకటి జనవరి 13న తుర్కియేలో జరిగింది. ప్రాణాపాయంలో ఉండి అచేతనంగా పడిపోయిన ఓ కుక్క పిల్లను దాని తల్లైన వీధి శునకం నోట కరిచి వర్షంలో తడుస్తూ స్థానికంగా ఓ జంతువుల ఆస్పత్రికి తీసుకొచ్చింది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న పిల్లను ఆస్పత్రికి తెచ్చిన వీధి కుక్క
తుర్కియేలో ఘటన.. శునకం కన్నప్రేమకు జనం ఫిదా
ఇస్తాంబుల్, జనవరి 18: కన్నబిడ్డల పట్ల తల్లి చూపించే ప్రేమకు కొలమానం ఉండదు. మనుషులైనా, మూగజీవాలైనా కన్నప్రేమ విషయంలో ఎలాంటి తేడా ఉండదు. ఇది నిజమని నిరూపించే ఘటన ఒకటి జనవరి 13న తుర్కియేలో జరిగింది. ప్రాణాపాయంలో ఉండి అచేతనంగా పడిపోయిన ఓ కుక్క పిల్లను దాని తల్లైన వీధి శునకం నోట కరిచి వర్షంలో తడుస్తూ స్థానికంగా ఓ జంతువుల ఆస్పత్రికి తీసుకొచ్చింది. తన పిల్లను అక్కడి సిబ్బంది ముందు పడేసి.. ‘నా బిడ్డను కాపాడండి’ అన్నట్టు వారివైపు దీనంగా చూసింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురైన ఆ ఆస్పత్రి సిబ్బంది.. వెంటనే తేరుకుని కొన ఊపిరితో ఉన్న ఆ పిల్లను పరీక్షించి అవసరమైన వైద్య సాయం అందించి ప్రాణాన్ని నిలిపారు. ఆస్పత్రి బల్లపై ఆ పిల్లకు చికిత్స చేస్తున్నంత సేపు తల్లి శునకం కూడా అక్కడే కంగారుగా తిరుగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా.. ఆ వీధి శునకం కన్నప్రేమకు జనం ఫిదా అయిపోతున్నారు.