Share News

Trump Tariffs Shake Global Markets: ఫార్మాపైనా సుంకాలు

ABN , Publish Date - Apr 05 , 2025 | 03:48 AM

ట్రంప్ ఫార్మా, సెమీకండక్టర్లపై కొత్త సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయం ప్రపంచ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించింది, ఐఫోన్ ధరలు పెరిగే అవకాశం ఉంది

Trump Tariffs Shake Global Markets: ఫార్మాపైనా సుంకాలు

దాంతోపాటు సెమీకండక్టర్లపైనా త్వరలో విధిస్తాం: ట్రంప్‌

మునుపెన్నడూ లేని స్థాయిలో ఉంటాయని వెల్లడి

అద్భుత ఆఫర్లతో వచ్చే దేశాలతో సుంకాలపై

సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నానని స్పష్టీకరణ

ఐఫోన్లు, ఐప్యాడ్ల ధరలు 30-43% పెరిగే చాన్స్‌

అమెరికాపై 34% అదనపు సుంకం వేసిన చైనా

భారత మార్కెట్లు పతనం.. ఫార్మా షేర్లు కుదేలు

930, 345 పాయింట్ల మేర సెన్సెక్స్‌, నిఫ్టీ డౌన్‌

18 లక్షల కోట్లు కోల్పోయిన ప్రపంచ కుబేరులు

భారీగా నష్టపోయిన జుకెర్‌బెర్గ్‌, జెఫ్‌ బెజోస్‌, మస్క్‌

మేం విధించిన సుంకాలు మాకు బేరమాడే శక్తినిచ్చాయి. ఇప్పుడు అన్ని దేశాలూ మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. మేం చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం అదే. ఈ సుంకాలు మళ్లీ అమెరికాను డ్రైవర్‌ సీటులో కూర్చోబెట్టాయి. - డొనాల్డ్‌ ట్రంప్‌

వాషింగ్టన్‌, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాల కత్తి దూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా మరో బాంబు పేల్చారు! త్వరలోనే ఫార్మాస్యూటికల్‌ (ఔషధాలు), సెమీకండక్టర్లపైనా దిగుమతి సుంకాలు విధిస్తామని.. గురువారం సాయంత్రం ఆయన ప్రకటించారు. ఆ సుంకాలు మునుపెన్నడూ ఎరుగని స్థాయిలో ఉంటాయనే సంకేతాలిచ్చారు. బుధవారం ఆయన ప్రకటించిన సుంకాల జాబితాలో ఈ రెండు రంగాలూ లేకపోవడంతో ఆయా పరిశ్రమలవారు ఊపిరి పీల్చుకున్నారు. ఫార్మా షేర్ల ధరలు పెరిగాయి కూడా. కానీ, అంతలోనే ఆయన ఈ ప్రకటన చేయడంతో ఫార్మా ఇండస్ట్రీ ఆనందం ఆవిరైంది. ట్రంప్‌ ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో స్టాక్‌మార్కెట్‌ కుదేలైంది. సెన్సెక్స్‌ 930 పాయింట్లు, నిఫ్టీ 345 పాయింట్ల మేర పతనమయ్యాయి. ముఖ్యంగా ఫార్మా రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. అటు అమెరికా, ఆసియా మార్కెట్లూ పతనమయ్యాయి.


వాల్‌స్ట్రీట్‌లో ఎస్‌ అండ్‌ పీ 500 ఫ్యూచర్స్‌ 3.6 శాతం మేర పడిపోగా.. డౌజోన్స్‌ సూచి 3.4%, నాస్‌డాక్‌ 4% మేర డౌన్‌ అయ్యాయి. అటు యూరోపియన్‌ మార్కెట్ల పరిస్థితి మరింత ఘోరంగా ఉంది. జర్మనీ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌.. ఆసియాలో జపాన్‌, దక్షిణ కొరియా మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. కొవిడ్‌ (2020) తర్వాత మార్కెట్లు ఈ స్థాయిలో క్రాష్‌ కావడం ఇదే మొదటిసారి. దీంతో టాప్‌-500 ప్రపంచ కుబేరుల సంపద 208 బిలియన్‌ డాలర్లు.. అంటే దాదాపుగా రూ.17.8 లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. భారీగా నష్టపోయిన ప్రముఖుల్లో ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా అధిపతి జుకెర్‌బెర్గ్‌, అమెజాన్‌ చీఫ్‌ జెఫ్‌ బెజోస్‌ వంటివారున్నారు. మెటా షేర్లు 9% మేర పతనం కావడంతో.. జుకెర్‌బెర్గ్‌ 17.9 బిలియన్‌ డాలర్ల మేర (దాదాపు రూ1.5 లక్షల కోట్లు) నష్టపోయారు. అమెజాన్‌ షేర్లు కూడా 9% పతనమై బెజోస్‌ వ్యక్తిగతంగా రూ.1.3 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు. ఇక.. ట్రంప్‌కు అనుంగు మిత్రుడు, టెస్లా అధినేత ఈలన్‌ మస్క్‌ సంపద 11 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.94 వేల కోట్లు) మేర కరిగిపోయింది. ప్రముఖ పాదరక్షల బ్రాండ్లు నైకీ, అడిడాస్‌ వంటి సంస్థల షేర్లు రెండంకెల పతనాన్ని చవిచూశాయి. కాగా.. భారత్‌పై 26% సుంకాలను విధిస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించగా, ఆ తర్వాత వైట్‌హౌస్‌ అధికారులు విడుదల చేసిన అనెక్సర్‌లో అది 27 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ, గురువారంనాడు దాన్ని మళ్లీ సవరించి భారత్‌పై 26% సుంకం విధిస్తున్నట్టు మరో పత్రాన్ని వైట్‌హౌస్‌ వర్గాలు విడుదల చేశాయి. మరోవైపు.. అమెరికా ప్రతీకార సుంకాలు భారత ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీస్తాయని లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.

sdfzg.jpg


ఈ అంశంపై ప్రభుత్వం పార్లమెంటులో సమాధానం చెప్పాలంటూ కాంగ్రెస్‌ సహా విపక్ష ఎంపీలు పార్లమెంట్‌ హౌస్‌ ప్రాంగణంలో నిరసన తెలిపారు.

చర్చలకు సిద్ధం

తన ప్రతీకార సుంకాల ప్రకటనతో స్టాక్‌మార్కెట్లు కుదేలైనా ట్రంప్‌ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నారు. తాను సుంకాలు విధించడం వల్లనే ఇప్పుడు ప్రతి దేశం తమను అభ్యర్థిస్తోందని.. ఇప్పుడా దేశాలు తాము ఏం అడిగినా కాదనే పరిస్థితిలో ఉన్నాయని, తమ కోసం ఏదైనా చేస్తాయని ఆయన మీడియాతో అన్నారు. తన హయాంలో అమెరికాను మరింత సుసంపన్నం చేస్తానని పునరుద్ఘాటించారు. ‘‘మేం విధించిన సుంకాలు మాకు బేరమాడే శక్తినిచ్చాయి. ఇప్పుడు అన్ని దేశాలూ మమ్మల్ని సంప్రదిస్తున్నాయి. మేం చేసిన పని వల్ల కలిగిన గొప్ప ప్రయోజనం అదే. ఈ సుంకాలు మళ్లీ అమెరికాను డ్రైవర్‌ సీటులో కూర్చోబెట్టాయి’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఏదైనా దేశం అమెరికాతో డీల్‌ కుదుర్చుకోవాలని భావిస్తే అందుకు మీరు అంగీకరిస్తారా?’’ అని విలేకరులు ప్రశ్నించగా.. అద్భుతమైన ఆఫర్లతో ఏ దేశమైనా ముందుకొస్తే తాను సిద్ధమేనని జవాబిచ్చారు.


చైనా ప్రతీకార చర్యలు..

‘తమలపాకుతో నువ్వొకటిస్తే తలుపుచెక్కతో నేనొకటిస్తా’ అన్న సామెత చందంగా.. తమ దేశంపై తాజాగా 34 శాతం సుంకాలు విధించిన అమెరికాపై చైనా అంతేస్థాయిలో అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. అంతటితో ఆగక.. అమెరికా రక్షణ రంగానికి, కంప్యూటర్‌, స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమలకు అత్యంత కీలకమైన అరుదైన ఖనిజ లోహాల ఎగుమతులపై నియంత్రణలు విధించింది. అమెరికాకు చెందిన 16 సంస్థలకు పంపే ద్వంద్వ వినియోగ ఉత్పత్తుల ఎగుమతిపై నిషేధం విధించింది. చైనాకు ఎగుమతులు చేస్తున్న ఆరు అమెరికా సంస్థలపై వేటు వేసింది.. చైనా తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికాలో ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలపై గట్టిగానే ప్రభావం చూపనున్నాయి. అమెరికాపై తాము విధించిన ఈ అదనపు సుంకం ఏప్రిల్‌ 10 నుంచి అమల్లోకి వస్తుందని చైనా కస్టమ్స్‌ టారిఫ్‌ కమిషన్‌ ఆఫ్‌ద స్టేట్‌ కౌన్సిల్‌ ప్రకటించింది. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో వ్యాజ్యం కూడా దాఖలు చేసింది. కాగా, చైనా విధించిన ప్రతీకార సుంకంపై ట్రంప్‌ వెంటనే స్పందించారు. తాను విధించిన సుంకాలతో భయాందోళనలకు గురై చైనా తప్పు చేసిందని తన సొంత సామాజిక మాధ్యమం సోషల్‌ ట్రూత్‌లో పోస్ట్‌ చేశారు.


పెరగనున్న ఐఫోన్లు, ఐప్యాడ్ల ధరలు?

ప్రతీకార సుంకాలతో అమెరికాను మళ్లీ సుసంపన్నం చేస్తానంటూ ట్రంప్‌ ఘనంగా ప్రకటించారుగానీ.. ఈ పెంపు ప్రభావం అంతిమంగా అమెరికన్‌ వినియోగదారులపైనే పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు.. యాపిల్‌ సంస్థ ఐఫోన్ల ఉత్పత్తికి చైనాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. కొన్నాళ్లుగా వియత్నాం, భారత్‌ వంటి దేశాల్లోనూ ఉత్పత్తి ప్రారంభించింది. కానీ, తాజా పెంపుతో చైనాపై సుంకాల భారం 54 శాతానికిచేరింది. అలాగని తమ ఉత్పత్తి మొత్తాన్నీ చైనా నుంచి వియత్నాంకో, భారత్‌కో తరలిద్దామన్నా.. ఆ రెండు దేశాలపైనా వరుసగా 46%, 26% చొప్పున సుంకాలను ట్రంప్‌ విధించారు. ఆ ప్రభావం యాపిల్‌పై గట్టిగానే పడబోతోంది. ఇప్పుడు యాపిల్‌ ముందున్న దారులు రెండే.. సుంకాల వల్ల అదనంగా పడే భారాన్ని తాను భరించడం. లేదా వినియోగదారులపై వేయడం. అలా వేయడం వల్ల ఐఫోన్ల ధరలు 30 నుంచి 43 శాతం దాకా పెరుగుతాయని అంచనా. దీనివల్ల.. ప్రస్తుతం అమెరికాలో 799 డాలర్లకు విక్రయిస్తున్న ఐఫోన్‌ 16 ధర దాదాపు 1142 డాలర్లకు విక్రయించాల్సి ఉంటుంది. 1599 డాలర్లకు విక్రయిస్తున్న ఐఫోన్‌ 16 ప్రోమ్యాక్స్‌ ధర ఏకంగా 2,300 డాలర్లు అవుతుంది.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 05 , 2025 | 03:48 AM