Share News

Stock Market Crash: అమెరికాలో ట్రంపొచ్చె.. మార్కెట్ పోయే!

ABN , Publish Date - Feb 12 , 2025 | 04:40 AM

శ్వేతసౌధంలో అడుగుపెట్టిన రోజు నుంచీ ట్రంప్‌ జారీ చేస్తున్న ఉత్తర్వులు, తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు అల్లాడిపోతున్నాయి.

Stock Market Crash: అమెరికాలో ట్రంపొచ్చె.. మార్కెట్ పోయే!

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లు షేక్‌.. ‘బేర్‌’మంటున్న భారత స్టాక్‌ మార్కెట్‌

ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడైనప్పటి నుంచీ మదుపర్లకు రూ.23 లక్షల కోట్ల నష్టం

రోజుకు సగటున లక్ష కోట్లకుపైగా లాస్‌.. గత 5 రోజుల్లో రూ.17 లక్షల కోట్లు ఆవిరి

‘వివాహం విద్య నాశాయ..’’ అని నానుడి! అదే కోవలో.. ‘‘ట్రంప్‌ అధ్యక్షుడైతే స్టాక్‌మార్కెట్లు సర్వనాశాయ’’ అని ఎన్నికలకు ముందే పలువురు ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. వారి అంచనాలన్నీ ఇప్పుడు నిజమవుతున్నాయి. శ్వేతసౌధంలో అడుగుపెట్టిన రోజు నుంచీ ట్రంప్‌ జారీ చేస్తున్న ఉత్తర్వులు, తీసుకుంటున్న నిర్ణయాలు, విధిస్తున్న సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌మార్కెట్లు అల్లాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మన బీఎ్‌సఈ సెన్సెక్స్‌, నిఫ్టీ50 కుదేలై.. ఈక్విటీ ఇన్వెస్టర్లు ఐదంటే ఐదు రోజుల్లో రూ.16.97 లక్షల కోట్లు నష్టపోయారు. 22 రోజుల్లో రూ.23 లక్షల కోట్లు ఆవిరైపోయాయి!!

అమెరికా అధ్యక్షుడుగా డోనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టడం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు అశనిపాతంగా మారింది. అధికారం చేపట్టిన రోజు నుంచి ట్రంప్‌ తీసుకున్న పలు నిర్ణయాలు స్టాక్‌ మార్కెట్లను కుదేలు చేశాయి. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చిన కొంత మంది నాయకులు వరుసగా కొద్దిరోజులపాటు అత్యుత్సాహంతో నిర్ణయాలు తీసుకుంటుండడం కద్దు. కానీ.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చి 20 రోజులు దాటిపోయినా ఆయన తీరులో ఏ మార్పూ రాలేదు! వైట్‌హౌ్‌సలో అడుగుపెట్టినరోజే డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఉత్తర్వులు గుప్పించిన ట్రంప్‌.. ఆ తర్వాత తన, మన అనే తేడా లేకుండా పలు దేశాల, పలు ఉత్పత్తుల దిగుమతులపై సుంకాల కొరడా ఝుళిపిస్తుండడంతో ప్రపంచం యావత్తూ బెంబేలెత్తిపోతోంది. కెనడా, మెక్సికో దేశాలపై 25 శాతం సుంకాలు కొరడా ఝుళిపించడం.. చైనాపై 10ు అదనపు సుంకాలు వేస్తాననడం.. ఆయా దేశాలూ ప్రతిచర్యలకు దిగడం.. ఇలా ఒకదానివెంట మరొకటిగా జరుగుతున్న పరిణామాల ప్రభావంతో.. ఒక్క అమెరికా మార్కెట్లే కాదు, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి.

భారీగా నష్టాలబారిన పడుతున్నాయి. గడిచిన రెండేళ్లుగా జోరుగా దూసుకుపోయిన డౌజోన్స్‌, ఎస్‌ అండ్‌ పీ 500, నాస్‌డాక్‌ సూచీలు, అమెరికా కంపెనీల షేర్ల ధరలు ఇప్పుడు కుదేలవుతున్నాయి. మన ఈక్విటీ మార్కెట్‌నే తీసుకుంటే.. ఈ ఏడాది జనవరి 20న ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి మంగళవారం వరకు.. అంటే 22 రోజుల్లో నికరంగా సెన్సెక్స్‌ 779.84 పాయింట్లు, నిఫ్టీ 272.95 పాయింట్లు నష్టపోయాయి. దీంతో ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల షేర్ల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.23.07 లక్షల కోట్లకు పైగా పతనమైంది. జనవరి 20న రూ.431.59 లక్షల కోట్లున్న మార్కెట్‌ విలువ మంగళవారం మార్కెట్‌ ముగిసే సమయానికి రూ.408.52 లక్షల కోట్లకు పడిపోయింది. ఇరవై రెండు రోజుల్లో రూ.23 లక్షల కోట్లు నష్టం అంటే.. సగటున రోజుకు లక్ష కోట్ల రూపాయలకు పైగా సొమ్ము ఆవిరైపోయింది. ఇక చిన్న, మధ్యశ్రేణి కంపెనీల షేర్లయితే 40 శాతం వరకు దిగజారాయని అంచనా.

jik.jpg


మాగా దెబ్బకు..

ట్రంప్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ (మాగా) నినాదం అందుకున్నారు. ఇందుకోసం చైనాతో పాటు దాదాపు అన్ని దేశాల దిగుమతులపైనా సుంకాలు పెంచేశారు. తాజాగా స్టీలు, అల్యూమినియం దిగుమతులపైనా 25 శాతం సుంకం విఽధించారు. ఇది చాలదన్నట్టు వచ్చే రెండు మూడు రోజుల్లో కొన్ని దేశాల దిగుమతులపై ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించారు. సోమ, మంగళవారాల్లో మార్కెట్‌ పతనానికి ఈ హెచ్చరికలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లోనే కాదు.. మన స్టాక్‌ మార్కెట్‌ వరుసగా ఐదు సెషన్లుగా అమ్మకాలతో హోరెత్తిపోతోంది. మంగళవారం సెన్సెక్స్‌ 1,018.20 పాయింట్ల నష్టంతో 76,293.60 స్థాయికి దిగజారగా... నిఫ్టీ 309.80 పాయింట్ల నష్టంతో 23,071.80 వద్ద ముగిసింది. గత రెండు వారాల్లో సెన్సెక్స్‌ ఇంత కనిష్ఠ స్థాయిలో ముగియడం ఇదే మొదటిసారి. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల షేర్లలో 29, నిఫ్టీలోని 50 కంపెనీల షేర్లలో 44 మంగళవారం నష్టాలతో ముగిశాయి. దీంతో బీఎ్‌సఈలో లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ ఒక్క రోజే రూ.9.29 లక్షల కోట్లు కోసుకుపోయి రూ.408.52 లక్షల కోట్లకు చేరింది. గత 5రోజుల నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం రూ.16.97 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. గత ఐదు సెషన్స్‌లో సెన్సెక్స్‌ 2,290.21 పాయింట్లు, నిఫ్టీ 667.45 పాయింట్లు నష్టపోయాయి.


విదేశీ మదుపర్లు వెనక్కి..

మన దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ పోర్టుఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) అమ్మకాలు కూడా మార్కెట్‌ పతనానికి ప్రధాన కారణం. 2024 సెప్టెంబరు త్రైమాసిక వృద్ధిరేటు నీరసించినప్పటి నుంచే ఈ సంస్థలు అమ్మకాలకు లాకులెత్తాయి. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎఫ్‌పీఐలు దాదాపు రూ.85,841 కోట్ల పెట్టుబడులను మన మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకున్నట్టు అంచనా. డాలర్‌తో రూపాయి మారకం రేటు ఒక స్థాయి వద్ద స్థిరపడే వరకూ ఈ సంస్థల అమ్మకాలు ఆగక పోవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. మార్కెట్లు ఇలా నష్టాల్లో ఉండడంతో.. తమ అవసరాలకు షేర్లు అమ్మి సొమ్ము చేసుకుందామనుకునేవారికి ఇబ్బందికర పరిస్థితి. కొత్తగా కొందామనుకునేవారికి కూడా భవిష్యత్తుపై భరోసా లేని దుస్థితి!! ఈ పరిస్థితి ఇప్పటికే పరిమితం కాదని.. ట్రంప్‌ అత్యుత్సాహం, టెంపరితనం తగ్గేవరకు ఇలాగే కొనసాగే ప్రమాదం ఉందనే ఆందోళన ఇన్వెస్టర్లలో వ్యక్తమవుతోంది.

- బిజినెస్‌ డెస్క్‌, అంధ్రజ్యోతి


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: ప్రభుత్వానికి రుణ మంజూరు పత్రాలు అందజేసిన హడ్కో ప్రతినిధులు

Also Read: కేటీఆర్‌తోపాటు ఆయన ఫ్యామిలీ దరఖాస్తు చేసుకుంటే..

Also Read: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

Also Read: ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి

Also Read : అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్

Also Read : పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు

Also Read: వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం

Also Read: బెల్ట్ షాపులు నిర్వహిస్తే.. కేసు నమోదు

For National News And Telugu News

Updated Date - Feb 12 , 2025 | 04:40 AM