Share News

Madhya Pradesh: పోలీసుల ఎదుటే కుమార్తెను కాల్చేశాడు

ABN , Publish Date - Jan 16 , 2025 | 06:18 AM

పెద్దలు కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించి తన ఇష్టప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనుకున్న కుమార్తెను ఆమె తండ్రి కాల్చి చంపారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది.

Madhya Pradesh: పోలీసుల ఎదుటే కుమార్తెను కాల్చేశాడు

  • పెళ్లికి 4రోజుల ముందు తండ్రి ఘాతుకం

  • ప్రేమ వ్యవహారమే కారణం

  • మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘటన

గ్వాలియర్‌, జనవరి 15: పెద్దలు కుదిర్చిన పెళ్లిని వ్యతిరేకించి తన ఇష్టప్రకారం జీవిత భాగస్వామిని ఎంచుకోవాలనుకున్న కుమార్తెను ఆమె తండ్రి కాల్చి చంపారు. పోలీసులు చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన తనూ గుర్జార్‌కు ఆమె తండ్రి మహేశ్‌ వివాహాన్ని ఏర్పాటుచేశారు. అది ఇష్టం లేని ఆమె.. తన పెళ్లికి నాలుగు రోజులు ముందు, మంగళవారం, 52 నిమిషాలు నిడివి గల వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోను తనూ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. విక్కీ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని, కానీ, తమ కుటుంబం వేరే సంబంధం ఖాయం చేసిందని ఆమె తెలిపారు. వారు కుదిర్చిన సంబంధాన్ని వ్యతిరేకించినందుకు నన్ను రోజూ ఇంట్లో కొడుతున్నారనీ వాపోయారు.


తనకు ప్రాణహాని ఉన్నదని, తనను రక్షించాలని ఆ వీడియోలో ఆమె కోరారు. సోషల్‌ మీడియాలో ఆమె వీడియో వైరల్‌ కావడంతో ఎస్పీ ధర్మవీర్‌సింగ్‌ సహా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి ఆమె ఇంటికి చేరుకున్నారు. ఎందరు ఎన్నివిధాలా చెప్పినా తనూ, తన కుటుంబంతో కలిసి ఉండేందుకు నిరాకరించారు. తనను ప్రభుత్వ సంరక్షణ కేంద్రానికి (వన్‌ స్టెప్‌ సెంటర్‌) పంపాలని పోలీసు అధికారులను కోరారు. ఆమె మేజర్‌ (20ఏళ్లు) కావడంతో తనూను సంరక్షణ కేంద్రంలో చేర్చడానికి పోలీసు అధికారులు సిద్దమయ్యారు. ఇంతలో తండ్రి వారిని ఆపారు. తన కుమార్తెతో కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమెను కొద్ది దూరం తీసుకువెళ్లాడు. పోలీసులు చూస్తుండగానే కూతుర్ని కాల్చి చంపేశాడు.

Updated Date - Jan 16 , 2025 | 06:18 AM