HMPV: చైనాలో కొత్త వైరస్!
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:17 AM
చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన డ్రాగన్ దేశంలో తాజాగా ‘హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)’ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

హెచ్‌ఎంపీవీ విజృంభణతో కలకలం
కొవిడ్ తరహా లక్షణాలతో ఆందోళన
ఆస్పత్రులకు జనం పోటెత్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
ఫ్లూ కేసులేమీ భారీగా పెరగలేదు: చైనా
హెచ్‌ఎంపీవీని 2001లోనే గుర్తించారు
అది సీజనల్ వ్యాధే అంటున్న నిపుణులు
న్యూఢిల్లీ, జనవరి 3: చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన డ్రాగన్ దేశంలో తాజాగా ‘హ్యూమన్ మెటానిమోవైరస్ (హెచ్‌ఎంపీవీ)’ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారినపడిన స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు చెబుతున్నారు. హెచ్‌ఎంపీవీతోపాటు ఇన్‌ఫ్లూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైర్‌సలు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. చైనాలోని ఆస్పత్రులు కిటకిటలాడుతున్నట్లు కొందరు వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ వైరస్ సోకినవారిలో కొవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. జలుబు, జ్వరం, దగ్గు, ముక్కు కారడం వంటి లక్షణాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నట్లు సమాచారం. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ సంస్థ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక వెల్లడించింది. డిసెంబరు 16 నుంచి 22 వరకు చైనాలో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. కాగా, హెచ్‌ఎంపీవీని 2001లోనే గుర్తించారు. ప్రస్తుతం చైనాలో వెలుగు చూస్తున్న కేసులకు ఇదే కారణమని చెబుతున్నారు. ఇది అక్కడ సీజనల్ వ్యాధి అని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, చైనాలో భారీ సంఖ్యలో ఫ్లూ కేసులు వచ్చాయని, జనం ఆస్పత్రుల బాట పడుతున్నారన్న వార్తలను చైనా తేలిగ్గా తీసుకుంది. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు సహజమని, గత ఏడాదితో పోలిస్తే ఈ సారి వాటి తీవ్రత చాలా తక్కువగా ఉందని ఆ దేశ విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. చైనా ఉత్తరప్రాంతంలో శీతాకాలంలో ఫ్లూ, శ్వాసకోశ బాధితులు ఎక్కువగా ఉంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే అలాంటి కేసులు ఈ సారి చాలా తక్కువగా ఉన్నాయన్నారు. చైనా పౌరులు, చైనాలో ఉన్న విదేశీయుల ఆరోగ్యానికి తమ ప్రభుత్వానిది హామీ అని పేర్కొన్నారు. విదేశీయులు నిర్భయంగా చైనాలో పర్యటించవచ్చన్నారు.
లక్షణాలు ఏంటి..?
హెచ్‌ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడించారు. దగ్గు, జ్వరం, ముక్కు దిబ్బడగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్, నిమోనియాకు దారితీయొచ్చని చెబుతున్నారు. దగ్గు, తుమ్ముతో వెలువడే తుంపర్ల కారణంగా, వైరస్ బారిన పడిన వ్యక్తులతో సన్నిహితంగా మెలగడం, వైరస్ వ్యాపించిన ప్రాంతాలను తాకిన తర్వాత నోరు, ముక్కు, కళ్లను తాకడం వంటివి చేస్తే హెచ్‌ఎంపీవీ సోకుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఈ వైరస్ సోకిన వారికి ప్రత్యేకించి చికిత్స ఏమీ లేదని అంటున్నారు.
నివారణ ఇలా..
చిన్నపాటి ముందుజాగ్రత్త చర్యలతో వైరస్ సోకకుండా చూసుకోవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సబ్బుతో 20 సెకన్ల పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలంటున్నారు. అపరిశుభ్ర చేతులతో ముఖాన్ని తాకకూడదని, వైరస్ బారినపడిన వ్యక్తులకు దూరంగా ఉండాలని, తరచూ తాకాల్సి వచ్చే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. వైరస్ బారిన పడినవారు తమ వస్తువులను ఇతరులు వాడకుండా చూడాలని, లక్షణాలు కనిపిస్తున్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి, విశ్రాంతి తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.
భయపడాల్సిన పని లేదు: కేంద్రం
దేశంలో సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా, శ్వాసకోశ వ్యాధులపై ‘జాతీయ వ్యాధుల నివారణ కేంద్రం (ఎన్‌సీడీసీ)’ దృష్టి పెట్టిందని కేంద్రం వెల్లడించింది. చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ విజృంభిస్తోందన్న వార్తల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయెల్ చెప్పారు. చైనాలో వైరస్ అంశంపై సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు. హెచ్‌ఎంపీఎ్‌స వైరస్ వల్ల సాధారణ జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలే వస్తాయని తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా గత నెలలో శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారి సంఖ్య ఏమీ పెరగలేదని చెప్పారు.