ISRO Space Docking: ఇస్రో స్పేస్ డాకింగ్ విజయవంతం ఇక అంతరిక్ష కేంద్రం
ABN , Publish Date - Jan 17 , 2025 | 04:14 AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది! కొంత సమయం తేడాతో.. ఒకే లాంచింగ్ వాహనం ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన 2 ఉపగ్రహాలూ సక్సె్‌సఫుల్‌గా అనుసంధానమయ్యాయి!

2035 నాటికి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న భారత్
ఐదు మాడ్యూళ్లను డాక్ చేయడం ద్వారా నిర్మాణం!
అందులో భాగంగానే స్పేస్ డాకింగ్ ప్రయోగ నిర్వహణ
2028 డిసెంబరు నాటికి తొలి మాడ్యూల్ లాంచింగ్
తర్వాత దశలవారీగా మిగతా 4 మాడ్యూళ్లు రోదసిలోకి
భూమికి 400 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమిస్తూ సేవలు
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన ప్రతిష్ఠాత్మక స్పేస్ డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది! కొంత సమయం తేడాతో.. ఒకే లాంచింగ్ వాహనం ద్వారా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిన 2 ఉపగ్రహాలూ సక్సె్‌సఫుల్‌గా అనుసంధానమయ్యాయి! దీంతో భారతదేశం భవిష్యత్తులో ఒక దాని తర్వాత మరొకటిగా మాడ్యూళ్లను పంపి భారీ నిర్మాణాలను చేపట్టడానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం రోదసిలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం తరహాలోనే.. 2035 నాటికి సొంతంగా అంతరిక్ష కేంద్రం (భారతీయ అంతరిక్ష స్టేషన్-బీఏఎ్‌స) నిర్మించాలన్న ఇస్రో లక్ష్యానికి ఈ విజయం ఎంతగానో కీలకం. గురువారం 2 ఉపగ్రహాలను డాక్ చేసినట్టుగానే.. భవిష్యత్తులో ఐదు మాడ్యూళ్లను డాక్ చేయడం ద్వారా బీఏఎ్‌సను నిర్మించాలన్నది ఇస్రో లక్ష్యం. 2019లో.. అప్పటి ఇస్రో చీఫ్ కె.శివన్ బీఏఎస్ నిర్మాణానికి సంబంధించిన వివరాలను ప్రపంచానికి తొలిసారి వెల్లడించారు. 2030 నాటికి బీఏఎ్‌సను 20 టన్నుల బరువుతో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ.. కొవిడ్ కారణంగా ఆలస్యం జరిగింది.
ఇప్పుడు.. మొత్తం ఐదు మాడ్యూళ్లతో బీఏఎ్‌సను నిర్మించాలన్నది ఇస్రో ప్రణాళిక. దాని బరువు దాదాపు 52 టన్నుల దాకా ఉంటుందని అంచనా. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలాగానే.. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ ఉండే ఈ అంతరిక్ష కేంద్రంలో పలు పరిశోధనలు చేపట్టే యోచన ఉంది. బీఏఎ్‌సలోకి వెళ్లే భారతీయ వ్యోమగాములు.. అక్కడే 3 నుంచి 6 నెలలపాటు పరిశోధనలు నిర్వహించేలా అందులో ఏర్పాట్లు చేయనున్నారు. 2028 డిసెంబరు నాటికి ఎల్‌వీఎం3 లాంచ్ వెహికల్ ద్వారా.. 10 టన్నుల బరువుండే మొదటి మాడ్యూల్‌ను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. మిగతా మాడ్యూళ్లను.. తదుపరి తరం లాంచ్ వెహికల్ సూర్య ద్వారా రోదసిలోకి పంపి, ఒకదానికొకటి అనుసంధానం చేసి 2035 నాటికి పూర్తి చేయాలని ఇస్రో శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. భారతీయ అంతరిక్ష కేంద్రం తాలూకూ డిజైన్లను పరిశీలిస్తున్నట్టు.. 2024లో జరిగిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్’లో ఇస్రో అప్పటి చీఫ్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. ఈ స్పేస్‌స్టేషన్‌కు సంబంధించి ఎలకా్ట్రనిక్ పరికరాలను బెంగళూరులోని యూఆర్ రావ్ ఉపగ్రహ కేంద్రం, హార్డ్‌వేర్‌ను విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అందించనున్నట్టు తెలిపారు.
ఏం చేస్తారంటే..
ఇస్రో ప్రతిపాదనల ప్రకారం.. భారతీయ అంతరిక్ష కేంద్రం కొలతలు 27 మీటర్ల పొడుగు, 20 మీటర్ల వెడల్పు మేర ఉండనున్నాయి. అందులో గరిష్ఠంగా ఆరుగురు వ్యోమగాములు ఉండొ చ్చు. సాధారణంగా ఇద్దరు నుంచి నలుగురు వ్యోమగాములు ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. భూమికి 400 నుంచి 450 కిలోమీటర్ల ఎత్తున తిరిగే బీఏఎస్.. అమెరికన్, రష్యన్, జపనీస్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ స్పేస్‌పోర్టులకు అందుబాటులో ఉంటుంది. ఈ అంతరిక్ష కేంద్రంలో మన వ్యోమగాములు మైక్రోగ్రావిటీకి సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో కూడా డాక్ అయ్యేలా.. దీంట్లో ఒక యూనిక్ డాకింగ్ పోర్టును ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర సమయాల్లో వ్యోమగాముల ప్రాణాలను రక్షించుకునేందుకు.. శాశ్వతంగా డాక్ చేసిన ‘సేఫ్టీ క్రూ మాడ్యూల్’ కూడా ఇందులో ఉండనుంది. 2028లో లాంచ్ చేయనున్న మొదటి మాడ్యూల్‌లో సిబ్బంది ఉండడానికి అవసరమైన క్వార్టర్లు, ప్రాణాధార వ్యవస్థల వంటివి ఉండనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వరుసగా.. బీఏఎస్-2 (కోర్-డాకింగ్ మాడ్యూల్), బీఏఎస్-03 (సైన్స్ రిసెర్చ్ మాడ్యూల్), బీఏఎస్-04 (లాబొరేటరీ మాడ్యూల్), బీఏఎస్-05 (కామన్ వర్కింగ్ మాడ్యూల్)లను దానికి అనుసంధానం చేస్తారు. అలాగే.. కొత్తగా వచ్చే మాడ్యూళ్ల బెర్తింగ్ కోసం రోబోటిక్ ఆర్మ్’ను కూడా ఏర్పాటు చేయనున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైబడి సేవలందిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని కూడా ఇలాగే దశలవారీగా నిర్మించారు. అదే మన సొంత అంతరిక్ష కేంద్రానికి స్ఫూర్తి.
అంచెలంచెలుగా..
మానవుడు ఇప్పటిదాకా రోదసిలో నిర్మించిన అతి పెద్ద, అత్యంత బరువైన బాహుబలి కట్టడం.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎ్‌సఎస్). భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తున.. భూదిగువ కక్ష్యలో తిరుగుతూ ప్రతి 90 నిమిషాలకొకసారి భూమిచుట్టూ ప్రదక్షిణ చేసే కృత్రిమ ఉపగ్రహం ఈ ఐఎ్‌సఎస్! స్పేస్ రేసులో నువ్వా నేనా అంటూ పోటీపడిన అమెరికా, రష్యా.. భవిష్యత్తులో ఇతర గ్రహాల మీదకు వెళ్లడానికి, చంద్రుడి మీదకు చేపట్టబోయే యాత్రలకు ఒక బేస్ స్టేషన్‌లా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వేర్వేరు స్పేస్ స్టేషన్ల నిర్మాణానికి నడుం బిగించాయి. కానీ పదేళ్లయినా అవి కార్యరూపం దాల్చకపోవడంతో అమెరికా తొలుత యూరప్ దేశాలతోపాటు, కెనడా, జపాన్ సహకారం తీసుకుంది. తర్వాత వాటితో రష్యా కూడా జత కలిసింది. అలా ఐఎ్‌సఎస్ నిర్మాణం 1998లో మొదలైంది. ఇటుకా ఇటుకా పేర్చి ఇల్లు కట్టినట్టు.. 18 మాడ్యూళ్లు సహా 43 ఎలిమెంట్లతో ఐఎ్‌సఎ్‌సను నిర్మించారు. దాని బరువు దాదాపు 4.2 లక్షల కిలోలు. అది ఆరు పడగ్గదుల ఇల్లంత విశాలంగా ఉంటుంది. అందులో ఆరు స్లీపింగ్ క్వార్టర్లు, రెండు బాత్‌రూమ్‌లు, ఒక జిమ్ ఉంటాయి. రోదసిలో సెకనుకు ఐదు మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. రోజులో దాదాపు 16సార్లు భూమిని చుట్టేస్తుంది. అయితే, అంతరిక్ష కేంద్రాల నిర్మాణానికి సంబంధించి చాలా దేశాలకు సొంత ప్రణాళికలు ఉన్నాయి. ఈ క్రమంలోనే.. 2030లో ఐఎ్‌సఎ్‌సను విచ్ఛిన్నం చేసేందుకు అమెరికా స్పేస్‌ఎక్స్ సంస్థతో రూ.7 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది.
శ్రీహరికోటలో మూడో లాంచ్ ప్యాడ్
నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, సూళ్లూరుపేట, జనవరి 16(ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌లో మూడో లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి రూ. 3,985 కోట్లు వ్యయం అవుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇస్రో ‘నెక్స్ట్ జెనరేషన్ లాంచ్ వెహికిల్స్ (ఎన్‌జీఎల్వీ)’తో పాటు ఎల్‌వీఎం3 అంతరిక్ష వాహనాల ప్రయోగాలకు అనుగుణంగా ఈ కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణం ఉంటుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే రెండో లాంచ్ ప్యాడ్‌కు స్టాండ్‌బై కూడా ఇది ఉంటుందని, భవిష్యత్‌లో మానవ సహిత అంతరిక్ష యాత్రకు సంబంధించిన రాకెట్ల ప్రయోగ సామర్థ్యం కూడా దీనితో పెరుగుతుందని తెలిపింది. నాలుగేళ్లలో దీని నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ ప్రకటనలో ప్రభుత్వం వెల్లడించింది.