Justice Yashwant Varma: యశ్వంత్ బదిలీపై నిరసనలు.. సుప్రీంకోర్టుకు బార్ సభ్యులు..
ABN , Publish Date - Mar 27 , 2025 | 08:59 PM
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టునుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం సుప్రీంకోర్టు కొలీజియాన్ని కలిశారు.

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బుల కట్టలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వర్మను ఢిల్లీ హైకోర్టునుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం బదిలీ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ సభ్యులు కొందరు తప్పుబడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సుప్రీంకోర్టు కొలీజియాన్ని కలిశారు. నాలుగు డిమాండ్లను కొలీజియం ముందు ఉంచారు. అలహాబాద్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ తివారీ మాట్లాడుతూ..
‘ మేము నాలుగు డిమాండ్లను కొలీజియం ముందు ఉంచాము. మొదటిది.. జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టునుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడాన్ని వెంటనే ఆపాలి. రెండు, మూడు ప్రకారం.. న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఎటువంటి పనులు కూడా అతడికి ఇవ్వకూడదు. నాలుగవ దాని ప్రకారం.. అతడిపై వెంటనే నేర విచారణ జరగాలి’ అని అన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనపై త్రి సభ్య కమిటీ దర్యాప్తు జరుగుతోంది. త్రిసభ్య కమిటీ సభ్యులు మంగళవారం వర్మ ఇంటిని పరిశీలించారు. ఢిల్లీ పోలీసులు కూడా బుధవారం రోజున జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్లారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడ కొన్ని ఫొటోలు తీసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది నుంచి కూడా వివరాలు సేకరించారు.
నోట్ల కట్టలు దొరకలేదు: DFS చీఫ్
ఢిల్లీ అగ్నిమాపక సేవల అధికారి అతుల్ గర్గ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల ఘటనపై కొద్దిరోజుల క్రితం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరకలేదని అన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కేవలం కల్పితం మాత్రమే అని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ మార్చి 14వ తేదీన కంట్రోల్ రూముకు యశ్వంత్ ఇంటినుంచి కాల్ వచ్చింది. ఇద్దరు అగ్నిమాపక సిబ్బందిని పంపాం. ఇంట్లోని స్టోర్ రూములో మంటలు చెలరేగాయి. అక్కడ వస్తువులు తప్ప .. డబ్బులు లేవు. మంటలు ఆర్పిన వెంటనే పోలీసులు సమాచారం ఇచ్చాం. మా ఇద్దరు సిబ్బంది వెనక్కు వచ్చేశారు’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..
Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా