Kapil Sibal: ఎన్నికల సంఘం ఓ విఫల సంస్థ
ABN , Publish Date - Mar 24 , 2025 | 02:50 AM
రాజ్యాంగంలో పేర్కొన్నట్లు ఆ సంస్థ తన విధులను నిర్వర్తించడం లేదని, సమాజంలో అత్యధిక శాతం ప్రజలు దానిపై నమ్మకం కోల్పోయారని చెప్పారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమన్నారు.

డీలిమిటేషన్‌తో దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం: కపిల్ సిబ్బల్
న్యూఢిల్లీ, మార్చి 23: ‘‘ఎన్నికల సంఘం ఓ విఫల సంస్థ’’ అని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబ్బల్ ఆరోపించారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లు ఆ సంస్థ తన విధులను నిర్వర్తించడం లేదని, సమాజంలో అత్యధిక శాతం ప్రజలు దానిపై నమ్మకం కోల్పోయారని చెప్పారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలమన్నారు. డీలిమిటేషన్ అంశం దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. పీటీఐకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం తగ్గుతోందన్నారు. జడ్జిల నియామకంతోపాటు ప్రస్తుతం ఉన్న వ్యవస్థ సరిగ్గా పనిచేయడం లేదని.. ఈ సమస్యను ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ గుర్తించినప్పుడే ఇందులో మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
‘ఇండియా’ కూటమి గురించి మాట్లాడుతూ.. అందులోని పార్టీలు కూటమిగానే వ్యవహరించాలన్నారు. వాటికి ఒకే విధానం, సిద్ధాంతం, భవిష్యత్ కార్యాచరణ ఉండాలన్నారు. ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అవి వ్యవహరించిన తీరు సరికాదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, దేశంలో జనాభా గణన ఇంకా జరగనందున ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ సాధ్యం కాదని సిబ్బల్ అన్నారు.